అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

  • కర్నూలు జిల్లాను అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
  • రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
  • -ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్

కర్నూలు:- కర్నూలు జిల్లాను అత్యాచార రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులతో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కి సంబంధించి మొత్తం 113 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. వాటిలో కేవలం 11 కేసులకు మాత్రమే ఇప్పటి వరకు ఏటీఆర్ (ATR – Action Taken Report) అందినట్లు తెలిపారు. పరిష్కార రేటు 1% కంటే తక్కువగా ఉందన్నారు. దాదాపు 102 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు. జిల్లాలో అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో దళితులు స్వేచ్ఛగా బతికేలా భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉందని చైర్మన్ స్పష్టం చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తప్పుడు కేసులుగా చిత్రీకరించకుండా, సాక్ష్యాధారాలు (దెబ్బలు, ఆస్తుల నష్టం, ఫోటోలు) ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని చైర్మన్ ఆదేశించారు. విధుల్లో వైఫల్యం చెందిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ తరపున సిఫార్సు చేస్తామని చైర్మన్ హెచ్చరించారు. సంస్కరణల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, దళితులపై ప్రతాపం చూపడం సరికాదని చైర్మన్ పేర్కొన్నారు. కేవలం భౌతిక మార్పులు సరిపోవని, ప్రజల్లో చైతన్యం రావాలని మరియు సివిల్ రైట్స్ (పౌర హక్కుల) సమావేశాలు నిర్వహించాలని చైర్మన్ సూచించారు. సమస్యలను విన్నవించేటప్పుడు ‘ప్రాతినిధ్యం’ వహించాలని, అవసరమైనప్పుడు ‘పోరాటం’ చేయాలని, రెండింటికీ తేడా తెలిసి ఉండాలని స్పష్టం చేశారు. “రేపటి పనిని ఈరోజే చేయాలి, ఈరోజుటి పనిని ఇప్పుడే చేయాలి” అనే భావన అధికారుల్లో ఉన్నప్పుడే పేద ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చైర్మన్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నవారి పట్ల కేవలం సానుభూతితో కాకుండా, వారి స్థానంలో మనల్ని ఉంచుకుని ఆలోచించినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్నారు.

10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో కర్నూలు జిల్లా 71.08 శాతం వచ్చిందని, వచ్చే ఏడాదికి ఈ శాతం పెరగాలని చైర్మన్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ల్లో పిల్లలను చేర్చుకున్నప్పటికీ,డబ్బులు తీసుకుంటున్నారని, అలాంటి కేసులను మీరు రిజిస్టర్ చేసి, అవసరమైతే స్కూల్ గుర్తింపు (recognition) రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎస్సీ లకు సంబంధించి ఇరిగేషన్ కనెక్షన్‌లు ఎన్ని ఉన్నాయి? అగ్రికల్చరల్ సర్వీస్ (వ్యవసాయ సేవలు) కనెక్షన్‌ లు ఎన్ని ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం కింద SC సామాజిక వర్గానికి చెందిన వారిని ఒక్కో గ్రూపులో 10 మంది SC కుటుంబాలను చేర్చడం ద్వారా వారికి లబ్ది చేకూరుతుందని, తద్వారా 10 కుటుంబాలు బాగుపడతాయని చైర్మన్ సూచించారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని మరియు గ్రూపులను సిద్ధం చేయాలని చైర్మన్ పశు సంవర్థక శాఖ అధికారిని ఆదేశించారు. లబ్ధిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారు గౌరవప్రదంగా జీవించగలరని, దీనివల్ల అట్రాసిటీల వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చైర్మన్ అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ శాఖ కు సంబంధించి వ్యవసాయ డ్రోన్లను 44 గ్రూపులను ఏర్పాటు చేసి, అందులో SCలను కూడా భాగస్వామ్యం చేసి ఇవ్వడం వల్ల SCలకు సరైన న్యాయం జరగదని, వారికి ప్రత్యేకంగా వాటా రావాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. 44 గ్రూపుల సభ్యుల పేర్లు మరియు వారి ఫోన్ నంబర్లను తన కార్యాలయానికి పంపాలని చైర్మన్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు..  వైద్య శాఖ కు సంబంధించి ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు? అందులో ఎస్సీ (SC) సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది? ఖాళీలు ఎన్ని ఉన్నాయి? అని చైర్మన్ డిసిహెచ్ఎస్ ను ఆరా తీశారు. మొత్తం 1687 మంది ఆశా వర్కర్లు ఉండగా, అందులో 272 మంది ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉన్నారన్నారు. ప్రస్తుతం 20 ఖాళీలు ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో వితంతువులకు లేదా అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయాలని చైర్మన్ సూచించారు.

ప్రస్తుతం 2,630 అగ్రికల్చర్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో 240 ఎస్సీ, 48 ఎస్టీ కనెక్షన్లు ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న 240 ఎస్సీ కనెక్షన్లను వెంటనే ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని చైర్మన్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.. ఎస్సీ ఏరియాల్లో వాటర్ కనెక్షన్లు అన్నీ ఉన్నాయి? ఎక్కడైనా నీటి ఎద్దడి ఉందా? అని చైర్మన్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారి బాధను చెప్పుకునే సందర్భంలో ఓపికగా వినాలన్నారు. బాధితుడిని కూర్చోబెట్టి, మర్యాదగా మాట్లాడాలన్నారు. ప్రైవేట్ కేసు వేసుకోమని చెప్పకూడదని, న్యాయపరంగా వాళ్లకి ఎంక్వయిరీ చేసి, వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ రైట్స్ డే లు నిర్వహించాలని, ఎస్సీ,ఎస్టీ గ్రీవెన్స్ డే నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్ కు సూచించారు. అట్రాసిటీ బాధితులకు పెన్షన్ ఏ నెల కానెల మంజూరు అయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ కేసులకు సంబంధించి ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ATR)ను 15 రోజుల్లోగా సమర్పిస్తామన్నారు. భూ సమస్యలు, అసైన్డ్ భూముల పంపిణీ, పెన్షన్లు మరియు హౌస్ సైట్ పట్టాల అంశాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే సగం కేసుల్లో ఉద్యోగాలు మరియు అసైన్డ్ భూములు ఇవ్వగలిగామని, కానీ హౌస్ సైట్ పట్టాల విషయంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అందాల్సిన పెన్షన్ల కోసం దాదాపు 40 నుండి 50 లక్షల రూపాయల నిధులు అవసరమని కలెక్టర్ చైర్మన్ దృష్టికీ తీసుకొని వెళ్ళారు. గతంలో ఉన్నట్లుగా, ట్రెజరీ నుండి డీడీ (సోషల్ వెల్ఫేర్) నేరుగా నిధులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తే బాధితులకు త్వరగా పెన్షన్లు అందుతాయన్నారు. PGRS (ప్రజా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కోసం జిల్లా ఉపాధి అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించి, ఒక రిజిస్టర్ ద్వారా ఫిర్యాదులన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫు నుంచి తాము రిజిస్టర్ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో యాక్ట్ ప్రకారం 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నామన్నారు. అన్ని కేసుల్లోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి గడువు లోపు ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుందన్నారు. కొన్ని కంప్లైంట్స్ మీ ద్వారా మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వచ్చే ఒక వారంలో చేసి కమిషన్ కు రిప్లై కూడా పంపడం జరుగుతుందన్నారు. ఎవరు స్టేషన్ కి వచ్చినా వాళ్ళకి 100% న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరికీ న్యాయం జరిగేలాగా చూసుకుంటామన్నారు. స్టేషన్ కి వచ్చిన వాళ్ళ ని కూర్చోపెట్టి వాళ్ళ కంప్లైంట్ ఏముందో అది తీసుకొని లా ప్రకారం ఏమి చేయాలో 100% చేస్తామన్నారు.

సమావేశంలో ఎస్సీ కమిషన్ సెక్రెటరీ చిన్న రాముడు, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా ఎస్సీ సంక్షేమ & సాధికారత అధికారి తులసి దేవి, కర్నూలు ఇంచార్జి ఆర్డీఓ అనురాధ, పత్తికొండ ఇంచార్జి ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డి ఈ ఓ సుధాకర్, ఎస్సీ కమిషన్ సభ్యులు బిక్షం మేకల, పాకనాటి గౌతమ్ రాజ్, రామాంజినమ్మ, డి వి ఎం సి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments