నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

   నా దేశం నా బాధ్యత లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

• సీఎం మార్గనిర్దేశం లో పొదుపుచర్యలకు శ్రీకారం
• ప్రజా ప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు మోడల్ గా నిలవాలి.
• ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనర్జీ పొదుపులో భాగంగా నేటి నుండే చర్యలు
• ఈవీ వాహనల వినియోగం, సోలార్ పవర్ ఎనర్జీపై అవగాహన పెంచుకోవాలి
• అవసరమైన విభాగాల్లో వర్క్ ఫ్రం హోం పై చర్యలపై సమాలోచన
• బంగారం కొనుగోళ్లుపై స్వీయ నియంత్రణ పాటించాలి
• దేశీయ టూరిజంకు పెద్దపీట వేయాలి.
• యుద్ధ పరిస్థితుల ప్రభావం తగ్గేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకుందాం..
• విదేశీమారక నిల్వలు తరిగిపోకుండా కాపాడుకుందాం..
-కొలుసు పార్థసారథి, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు

యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయం పొదుపు చర్యలను పాటించనున్నామని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాదేశం నా బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. క్యాబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలపై దిశానిర్దశం చేశారన్నారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వాహణ శ్రేణిలో వాహనాల సంఖ్యను స్వచ్ఛందంగా తగ్గించడం, సమావేశాలను ఆన్ లైన్ లో వర్చువల్ గా నిర్వహించడం, వారానికి ఒక సారి నో వెహికల్ ఫ్రైడే పాటించడం తదితర చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు సైతం స్వచ్ఛందంగా పొదుపు చర్యలు తీసుకోవాలని కోరారు.

యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇందన అవసరాల తగ్గింపు, విదేశీ మారక నిల్వల పరిరక్షణ, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, అలాగే ఆయిల్, గ్యాస్, యూరియా తదితర దిగుమతుల తగ్గింపు తో నియంత్రణ పాటించడం వల్ల మేలు జరుగుతుందన్నారు. అరటి, ధాన్యం, వ్యవసాయ, ఉద్యానవన పంటల ఎగుమతులపై యుద్ధ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకనే ప్రజా ప్రతినిధులు, అధికారులు పొదుపు చర్యల్లో ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, తాము పొదుపు చర్యలు పాటిస్తూ వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనందరం ఒక్క మాటపై నిలబడి కష్టాల నుండి బయటపడాలని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ గతంలో వాహనాలకు వినియోగించే ఆయిల్ పరిమితిని సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూడటం, ప్రభుత్వం నూతన వాహనాలను కొనుగోలు చేయాలంటే ఈవీ వాహనాలనే కొనుగోలు చేయడం వంటి చర్యలతో పాటు ప్రజలను చైతన్య పరిచేలా విస్తృత ప్రచారం నిర్వహించనున్నామన్నారు. ప్రజలు వాకింగ్, సైక్లింగ్ తదితర పర్యావరణ హితమైన చర్యలు పాటించాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటనల సమయంలో దగ్గర దూరాన్ని పాదయాత్రగా చేయాలని సూచించారు. వారానికి ఒక రోజు మంత్రులు, అధికారులు సైకిళ్లపై ఏపీ సచివాలయానికి వస్తే ఖచ్చితంగా అది ప్రజలపై ప్రభావం చూపి వారు సైతం అదే బాట పడతారన్నారు.

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో వారానికి రెండు రోజులు నో వెహికల్ డే లుగా పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఈవీ స్టేషన్ ల పెంపు లో భాగంగా ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ట్రాఫిక్ లో సైతం ఎక్కువ సేపు వాహనాలు నిలవకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆర్టీసీ సంస్థ తీసుకుంటున్న పొదుపు చర్యలపై సమీక్షిస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి అందించనున్న ఈవీ బస్సులు త్వరగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పెద్ద పెద్ద విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా పొదుపులో భాగంగా ఆన్ లైన్ క్లాస్ ల నిర్వహణపై సమాలోచన చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన విభాగాల్లో వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ నిర్వహణపై పరిశీలన చేస్తున్నామన్నారు.

స్వదేశీ టూరిజం, స్వదేశీ ప్రొడక్ట్స్ పై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. మన దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విదేశీ ప్రయాణాలు తగ్గించుకుని వేసవితో పాటు ఇతర సెలవు రోజుల్లో దేశంలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే విదేశీ వస్తువుల కొనుగోళ్లను తగ్గించి స్వదేశీ తయారీ ఉత్పత్తులను ఎక్కువగా వాడాలని మంత్రి పార్థసారథి కోరారు. బంగారం కొనుగోళ్లపై నియంత్రణ పాటించాలని, మన దేశంలో వందల టన్నుల్లో బంగారం దిగుమతి చేసుకుంటున్నామని దీంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయని, కావున ప్రజలు స్వచ్ఛందంగా బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్నారు. బంగారంపై మోజు తగ్గించుకుని కొద్ది రోజులు ఆగుదాం అని వేచి చూడటం వల్ల మన దేశం బంగారం దిగుమతులు తగ్గిస్తుందని వివరించారు.  ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ను బిగించుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. సోలార్ ప్యానెల్స్ బిగింపు కార్యక్రమంను వేగంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రైతులు కూడా ఎరువుల వాడకం తగ్గించాలని, నానో ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన పెంచుకోవాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments