ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు
విజయవాడ, మే.13:- జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిదులు 2025-26సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక, ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఛైర్మన్ గా నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ని ప్రభుత్వం నియమించిందని ఆయన వెల్లడించారు. ఇండియా టుడే పూర్వ ఎడిటర్ ఏ.ఏ.వి. ప్రసాద్, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొ.డి.వి.ఆర్. మూర్తి, రిటైర్డ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యన్నారాయణ మ్మూర్తి సభ్యులుగాను, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ మెంబర్ కన్వీనర్ గాను వ్యవహరిస్తారన్నారు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జారీ అయిన ఉత్తరువుల ప్రకారం 12 అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు. వీటిలో కొన్నింటిని కమిటీ విచక్షణ తో, మరి కొన్నిటిని దరఖాస్తులు కోరి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డుకు రూ. 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డులకు రూ. 2 లక్షలు చొప్పున, మిగిలిన అవార్డులకు రూ 1 లక్ష చొప్పున ప్రైజ్ మని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ లను తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టుల అవార్డులకు సంబంధించి కనీస అనుభవం మాత్రమే పేర్కొనడం జరిగిందని, దానికి, అక్రిడేషన్లకు సంబంధం లేదని చైర్మన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ మాట్లాడుతూ… జర్నలిస్టుల అవార్డులు ప్రతి యేటా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. 2017 తరువాత మళ్ళీ 2025-26 సంవత్సరానికి ఉత్తమ ప్రతిభ కనపరిచిన జర్నలిస్టులకు అవార్డులు ఇచ్చే సాంప్రదాయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించిందని ఆయన తెలిపారు. ఒక వారం రోజుల్లో అవార్డులకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసి, అవార్డులకు అర్హులైన జర్నలిస్టులను గుర్తించి జులై నెల లో అవార్డుల ప్రదానం జరిగే లా కృషి చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు.
పాత్రికేయుల సమావేశంలో సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ వి. మణిరాం, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ఐ. సూర్య చంద్ర రావు, డిప్యూటీ డైరెక్టర్ డి. రమేష్, సి.ఆర్. మీడియా అకాడమీ మేనేజర్ ఎం.భాస్కర నారాయణ విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.వి. మోహన రావు తదితరులు పాల్గొన్నారు.