ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

*మంత్రి టీజీ భరత్ గుప్తా చేతుల మీదుగా శ్రీ మాత్రే ఫుడ్స్ గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపన

*రూ.10 కోట్ల పెట్టుబడులతో కర్నూలులో ఆధునిక గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

*స్థానిక రైతులకు మార్కెట్ అవకాశాలు – యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన

*అరటి, జామ, ఫ్రూట్ పల్ప్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం

*ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం : మంత్రి టీజీ భరత్ గుప్తా

కర్నూలు:- శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మక గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు మే 13, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బ్రహ్మణపల్లె సమీపంలోని గుట్టపాడు MSME పార్క్‌లో ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ గుప్తా, జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి. సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అతిథి విశిష్టులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 8 నెలల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త కంపెనీలు రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్లాంట్‌ను రిలయన్స్ కంపెనీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఓర్వకల్లులో నీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మరియు బ్రాండ్ ఇమేజ్ కారణంగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఓర్వకల్లుకు సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంచి నాయకత్వం ఉంటే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. రానున్న రోజుల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు.

*పరిశ్రమల హబ్‌గా ఓర్వకల్లు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి*

పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రివర్యుల నాయకత్వంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షితమవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు అనేక ప్రతిష్టాత్మక పరిశ్రమలు రావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ 20 నెలల కాలంలో రాష్ట్రానికి సుమారు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్, అగస్త్య ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఎస్‌ఎంఈ పార్కులు, షిగాచి పరిశ్రమలు స్థాపన దిశగా ముందుకు సాగుతున్నాయని, తాజాగా శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు శంకుస్థాపన జరగడం మరో ముఖ్యమైన ముందడుగని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా, ప్రత్యేకంగా ఓర్వకల్లును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానికంగా చదువుకున్న యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా, ముఖ్యంగా ఓర్వకల్లుకు ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న పరిశ్రమ యాజమాన్యాలు కూడా కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలు చూసి ఓర్వకల్లులోనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. మన జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలు స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఓర్వకల్లులో మరిన్ని భారీ పరిశ్రమలు స్థాపితమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కర్నూలు జిల్లాకు నిరంతరం పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి. వేదవ్యాస్ రెడ్డి మాట్లాడుతూ… ఆధునిక సాంకేతికతతో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తూ విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసే గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MSME పార్క్‌లో 5.96 ఎకరాల భూమిని కేటాయించిందని, ఏడాది లోపే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో పలు దశల్లో సుమారు రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. స్థానికంగా పండే అరటి, జామ, పండ్ల గుజ్జు (ఫ్రూట్ పల్ప్) మరియు ఇతర పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌పై ఈ యూనిట్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా స్థానిక రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25 మందికి ప్రత్యక్ష ఉపాధి, వందలాది మంది రైతులు మరియు అనుబంధ రంగాల వారికి పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మరియు వ్యవసాయ విలువ శ్రేణి బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో సహకరిస్తున్న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి టి. జి. భరత్, ఎమ్మెల్యే చరితా రెడ్డి మరియు అధికారులకు వేదవ్యాస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం, MSME ప్రోత్సాహక కార్యక్రమాలు పరిశ్రమల అభివృద్ధికి మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని గుర్తించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మద్దతు ఇవ్వడం ద్వారా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. అనంతరం శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి అశోక్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments