పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

  • పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం
  • యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి
  • స్వదేశీ పర్యాటకం – వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత
  • రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన
  • ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు
  • వైద్య రంగంలో అద్భుత అవకాశాలు-యువత అందిపుచ్చుకోవాలి
  • బైసర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి:- పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటి. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలి. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి. దేశం మొత్తం దుబారాను తగ్గించాలి. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారింది. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి. సెక్యూరిటీని కూడా కుదించుకోవాలి. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనలను పాటిద్దాం. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారు. దీనిపైనా ప్రజలు ఆలోచన చేయాలి. మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే స్వదేశంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలి. సెలవు వస్తే విదేశాలకు వెళ్తున్నారు. అంతకంటే మంచి ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు ఉన్నాయి. గోవాను మించిన టూరిజం కేంద్రంగా సూర్యలంక మారుతుంది. నాదేశం-నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలి’. అని సీఎం సూచించారు.
విద్య, వైద్యంలో తిరుగులేని స్థానం
పరిశ్రమలకు, సంస్థల ఏర్పాటుకు అనుమతులన్నీ ఆటోపైలట్ మోడ్‌లో ఇచ్చే బాధ్యత తమదని, నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించే బాధ్యత పారిశ్రామిక వేత్తలదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విద్య, వైద్యంలో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని ప్రతీ ముగ్గురు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిలో ఒకరు అమరావతి నుంచే తయారుకావాలన్నారు. అమరావతిలోని నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు.
*వచ్చే ఏడాది ఇదే రోజున ప్రారంభం కావాలి*
సంస్థలకు శంకుస్థాపనలతో పాటు వేగంగానూ ప్రారంభోత్సవాలు కావాలి. 2027లో ఇదే రోజున అమరావతిలో కిమ్స్ ఆస్పత్రి ప్రారంభం కావాలి. ప్రజలకు సేవ చేసేందుకు భాస్కరరావు కిమ్స్ ఏర్పాటు చేశారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారింది. ఎంట్రప్రెన్యూర్‌గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశం ఉంటుంది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. గతంలో హైదరాబాద్‌లో చాలా తక్కువ ఆస్పత్రులు హోటళ్లు మాత్రమే ఉండేవి. సీఐఐ సదస్సులు పెట్టేందుకు కనీసం కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉండేవి కావు. నాడు తీసుకున్న అభివృద్ధి చర్యలతో ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్‌గా హైదరాబాద్ తయారైంది.
యువతకు లక్ష ఉద్యోగాల కల్పన
‘అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్‌ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావును అభినందిస్తున్నాను. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్ ఏర్పాటువుతోంది. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఎదగనుంది. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. 250 మెడికల్ సీట్లు, 1,000 నాన్ మెడికల్ సీట్లు, మరో 1,000 మంది ట్రైనీలు తయారుకావాలి. డెంటల్, ఫిజియో థెరపీ వంటి సుమారు 5,000 మందిని నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్లు చాలా అవసరం ఉంది. డాక్టర్లు కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది’. అని సీఎం చంద్రబాబు అన్నారు.
23 నెలల క్రితం రాష్ట్రంలో విధ్వంసం
గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అలాంటి అరాచక పాలన నా జీవితంలో చూడలేదు. నేను పిల్లల భవిష్యత్ మాత్రమే చూస్తాను. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నా ఆలోచన. ఇటీవలే గూగుల్‌ డేటా సెంటర్‌కు భూమి పూజ చేసుకున్నాం. 2028 ఆగస్ట్ కి ముందే నిర్మాణం పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించాలని సూచించాను. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. 2028 డిసెంబర్‌కు ఫేజ్ 1 సిద్ధం అవుతుంది.
దేశంలోనే తొలి క్వాంటమ్ హబ్‌గా ఏపీ
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ పనులు ప్రారంభించాయి. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌కి చిరునామాగా ఏపీ తయారవుతుంది. రెండేళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేస్తాం. ఇప్పటికే ఓ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటయ్యింది. త్వరలో 133 క్యూబిట్ సామర్ధ్యంతో క్వాంటం కంప్యూటర్ సిద్ధం అవుతుంది. ఇరాన్-అమెరికా యుద్ధంతో మన దేశంలో అనేక సమస్యలు వచ్చాయి. పెట్రోలు, గ్యాస్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. విదేశాలపై ఆధార పడకుండా గ్రీన్ ఎనర్జీని ఇక్కడే ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ చేపట్టాం. ప్రతీ పొలంలో, ప్రతీ ఇంటి పైనా సోలార్ రూఫ్ టాప్ లాంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. గత పాలకులు ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాం. గత ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచితే మన ప్రజా ప్రభుత్వంలో చార్జీలు పెంచలేదు. భవిష్యత్‌లో పెంచబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
‘ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాం. చాలా దేశాల్లో వృద్ధాప్య సమస్య ఉంది. వైద్యుల కంటే నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి డిమాండ్ ఉంది. ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడికి వెళ్లి సేవలు అందించేలా ఆయా దేశాల భాషను నేర్చుకోవాలని కోరుతున్నాను. బైసర్ సంస్థ దృష్టి పేరిట ఏఐ ఆధారిత కంటి అద్దాలు అందించారు. తద్వారా దృష్టి లోపం ఉన్న అంధులు సొంతంగా పనిచేసుకునే అవకాశం వస్తుంది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సంజీవని ద్వారా డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. కిమ్స్ సంస్థ వైద్యంతో పాటు ప్రివెంటివ్ హెల్త్ కేర్ అందించేలా చర్యలు చేపట్టాలి. అమరావతిలో వైద్య సేవల కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయం, హోటళ్లు లాంటి సదుపాయాలు ఉండాలి. ఒకప్పుడు శారీరక కష్టం ఎక్కువగా ఉండేది.
విశ్వ నగరంగా అమరావతి
రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్‌కు అండగా ఉంటాం. రెండో దశలో భూసమీకరణ ద్వారా అమరావతిని భవిష్యత్ నగరంగా నిర్మిస్తాం. 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం. వెస్ట్ బైపాస్ లాగే మరో 10 నుంచి 15 ఫ్లైఓవర్లు కృష్ణానదిపై రావాలి. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి తయారవుతుంది. అమరావతితో పాటు విశాఖను కూడా విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఈ నెల 15 తేదీన డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాం. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌గా, టెక్నాలజీ హబ్‌గా మారుతుంది. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. వీటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. లక్షమంది ఉద్యోగులను మెడికల్ ఫీల్డ్‌లో తయారు చేయగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments