peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026 Editor : Admin

ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కర్నూలు సర్వజన ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలి

*ఆసుపత్రి కి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

*-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త

కర్నూలు:- కర్నూలు సర్వజన ఆసుపత్రి కి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చుచున్నామని , ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త. మంగళవారం ఉదయం కర్నూలు మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో మంత్రి భరత్ గుప్త ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ మరియు సర్వజన ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలపై సమీక్షించి సూచనలు జారీ చేశారు. ఈ మధ్య మార్చురీలో డబ్బులు తీసుకుంటున్నారు అన్న విషయం మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. ఈ విషయం పై విచారించగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు మార్చురీలో గత 15 సంవత్సరాల నుండి ప్రభుత్వము నుండి ఎటువంటి జీత భత్యాలు లేకుండా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని తెలుసుకున్నారు.వెంటనే వారిని ఔట్సోర్సింగ్ లో పారిశుద్ధ కార్మికులుగా తీసుకొని వారికి జీత భత్యాలు చెల్లించి వారు ప్రజల నుండి సొమ్ము వసూలు చేయకుండా చూడాలని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

ప్రభుత్వాసుపత్రిలో దాదాపు 400 ఏసీలు ఉండగా అందులో 300 చాలా పాతవి తరచూ రిపేర్లు చేయవలసిన అవసరం ఉన్నదని తెలుసుకున్న మంత్రి దశలవారీగా ఆసుపత్రి నిధులతో క్రొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఏఎంసీ ద్వారా ఏసీలు మరమ్మతులు చేయించుకోవాలని అవసరమైన మేరకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూపరిండెంట్ను ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన ఏడు ఆక్సిజన్ ప్లాంట్లను వాడుకులోకి తీసుకుని రావడానికి అవసరమైన ప్రణాళికలు సమర్పించవలసిందిగా ఆదేశించారు. సర్వజన ఆసుపత్రి ఎల్లప్పుడూ పరిశుభ్రముగా ఉండే విధంగా కాంట్రాక్టర్ అధికారులకు సహకరించాలని , అధికారుల సూచనల మేరకు కాంట్రాక్టర్ సిబ్బందిని నియమించి ప్రజల నుండి ఐ విఆర్ఎస్ ద్వారా మంచి ఫీడ్బ్యాక్ వచ్చే విధంగా చర్యలు ఉండాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

నర్సింగ్ సిబ్బంది యొక్క సేవలను సున్నితమైన ప్రదేశాల్లో ఇబ్బంది కలగకుండా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని వారి ద్వారా రోగుల కు మంచి సేవలు అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి ఇంకా అవసరమైన వెంటిలేటర్లు , లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ , బెడ్లు , ట్రాలీలు మొదలగునవి సమకూర్చుతామని తెలిపారు.ఆసుపత్రిలో ఉన్న జనరేటర్లు ఆటోమేటిక్ గా పనిచేసే విధంగా సమర్థవంతంగా ఉండాలని , 50 సీసీటీవీ ల ద్వారా అన్ని విషయాల పై నిరంతర పర్యవేక్షణ జరుగుతూ ఉండాలని, అన్ని స్కానర్లు ఏఎంసీ వినియోగించుకొని ఎల్లప్పుడు పనిచేస్తూ ఉండాలని ఆదేశించారు. 1956 సంవత్సరంలో నిర్మించిన శుశ్రుత భవన ములో అందించే వైద్య సేవలు వీలైనంత త్వరగా ఐపిడి భవనం కు మార్చే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగుల సహాయకులకు నిర్మించ తలపెట్టిన విశ్రాం సదన్ త్వరగా కార్యరూపం దాల్చే చర్యలు తీసుకోవాలని , ఆసుపత్రిలో పేరుకుపోయిన కాలం చెల్లిన మందులు వెంటనే తరలించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే విషయాలు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని అధికారులను కోరారు. ప్రజలకు సంతృప్తికరమైన మంచి వైద్య సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని మంత్రి భరత్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ , జి జి హెచ్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ నాగేశ్వరరావు ,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి , అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం , హాస్పిటల్ డెవోలోప్ కమిటీ మెంబర్ లు డాక్టర్ ప్రవీణ్, సాయి ప్రదీప్ , స్టేట్ క్యాన్సర్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ , ఏపీఎంఐడిసి ఈ ఈ చిరంజీవులు, డిఎంహెచ్వో కామేశ్వర ప్రసాద్ , డెప్యూటీ భాస్కర్ , జిల్లా సర్వైవలెన్స్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి , ఎన్టీఆర్ వైద్య సేవ డాక్టర్ భాస్కర్ రెడ్డి , డి ఐ ఓ డాక్టర్ ఉమా,డాక్టర్ లు శివబాల, కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు.