peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026 Editor : Admin

CBN: నేను కాదు… మనం

  • క్షేత్ర స్థాయి ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవాలి
  • సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు చేద్దాం
  • టూరిజం అభివృద్ధి చేసిన జిల్లాకు అత్యధిక ఆదాయం
  • 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
ap cm chandra babu naidu andhra pradesh cm chandra babu naidu cbn
ap cm chandra babu naidu andhra pradesh cm chandra babu naidu cbn

అమరావతి: టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై చర్చ జరిగింది. దీంట్లో భాగంగా జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్డీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి. సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దాం. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. సింగపూర్ దేశంలో నేను కాదు.. మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా నేను కాదు మనం అనే విధానాన్నే అవలంభిద్దాం. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా… సంక్షేమ, అభివృద్ధి జరగుతున్నా.. అందరి కృషి వల్లే సాధ్యమైంది. కలిసి కట్టుగా పని చేస్తే… ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదు. నేను కాదు మనం అనే విధానాన్ని నాతో ప్రారంభిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇదే తరహాలో ఆలోచన చేయాలి. జీఎస్డీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. గిరిజన ప్రాంతంలో ఉంటూనే పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో అభివృద్ధి వేర్వేరుగా ఉంది. అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు విలువ జోడింపుతో జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. అభివృద్ధిపై దృష్టి సారించాలి… ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలి. సర్వీస్ సెక్టార్ మరింతగా పెరగాలి. దేశ జీడీపీలో ఏపీ 10 శాతం మేర వ్యవసాయ ఉత్పత్తుల వాటాను కలిగి ఉంది. కొన్ని జిల్లాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి.. వాటికి సంబంధించిన ప్లాంట్లు వస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంది. జీఎస్డీపీ గ్రోత్ విషయంలో కలెక్టర్లు ఎలా పని చేస్తున్నారనే అంశంపై అధ్యయనం చేస్తు్న్నాం. నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి ఎలా సాధించాలన్నదానిపై జిల్లా కలెక్టర్లు ఆలోచనలు చేయండి. అన్నమయ్య జిల్లా కలెక్టరే దీనికి ఉదాహరణ. బెస్ట్ పాలసీల అమల్లో కలెక్టర్లు పోటీలు పడాలి. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లకు పోటీ పెట్టినట్టే… జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య పోటీ పెట్టండి. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లకు చాలా అనుభవం ఉంటుంది.. వాళ్ల దగ్గర చాలా సమాచారం ఉంటుంది. క్షేత్ర స్థాయి అధికారులను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది.. సంక్షేమం చక్కగా అందుతుంది… వినూత్నమైన ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం దక్కుతుంది. సూర్యలంక, మంగినపూడి, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు తదితర ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లు అభివృద్ధి చేస్తే స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త జాతీయ రహదారులు కొత్త అవకాశాల్ని సృష్టిస్తాయి… లాజిస్టిక్స్ హబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు… టౌన్ షిప్ లను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. విజన్ యూనిట్లను జిల్లా కలెక్టర్లు సమర్ధంగా వినియోగించుకోవాలి. గతంలో పెద్ద జిల్లాల్లో 21 నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి వచ్చేది. కలెక్టర్లు జిల్లా పర్యటనకు వెళ్తే ప్రయాణానికే ఓ పూట పట్టేది. ఇప్పుడు ప్రతీ జిల్లా కలెక్టర్ పరిధిలో కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గతానికంటే మెరుగైన పనితీరు కనబర్చడానికి… అభివృద్ధి చేయడానికి, సంక్షేమం అందించడానికి ఇప్పుడు కలెక్టర్లకు అవకాశాలు ఎక్కువ.”అని సీఎం వివరించారు.