peoplesmotivation.com
Newspaper Banner
Date of Publish : 16 June 2026 Editor : Admin

ప్రజల పనులకు ధర కట్టిన పంచాయతీ కార్యదర్శి..!!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});
  • ప్రజల పనులకు ధర కట్టిన పంచాయతీ కార్యదర్శి..!!!
  • ఇంటి పన్ను.. ఇంటి అప్రూవల్‌కు రూ.50 వేల డిమాండ్
  • రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం
  • వెల్దుర్తిలో కలకలం….కార్యదర్శిపై అవినీతి కేసు

ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ పనులకు ధర కట్టి చివరకు ఏసీబీ వలలో చిక్కాడు. ఇంటి పన్ను నమోదు, గృహ నిర్మాణ అనుమతి (అప్రూవల్‌) కోసం రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన వెల్దుర్తి మేజర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి కే.లక్ష్మీనాథ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.40 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ అధికారుల కథనం మేరకు..

వెల్దుర్తికి చెందిన సంధ్యపోగు సతీష్ తన ఇంటి పన్ను నమోదు చేయించుకోవడంతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందేందుకు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని కార్యదర్శి లక్ష్మీనాథ్‌ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పని ముందుకు సాగకపోవడంతో చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పక్కా సమాచారంతో ఉచ్చు

ఫిర్యాదు అందుకున్న కర్నూలు రేంజ్‌ ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి లంచం డిమాండ్‌ నిజమేనని నిర్ధారించారు. అనంతరం బాధితుడికి సూచనలు ఇచ్చి కార్యదర్శికి డబ్బు అందజేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో మంగళవారం రూ.40 వేల అడ్వాన్స్‌ మొత్తాన్ని కార్యదర్శికి అందజేస్తుండగా, మాటు వేసిన అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.

డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో దాడి

కర్నూలు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలోని బృందం కార్యదర్శిని లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అదుపులోకి తీసుకుంది. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని, రసాయన పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అనంతరం నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అవినీతిపై ఉక్కుపాదం:

ప్రజలకు అందాల్సిన సేవలను లంచాలతో ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. వెల్దుర్తిలో జరిగిన ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వారికి ఈ ఘటన గట్టి హెచ్చరికగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.