(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం
- అమెరికా నుంచి తెప్పించిన దీని వ్యయం రూ. 18 కోట్లు
- క్యాన్సర్ గుట్టును పసిగట్టే ఈ స్కాన్ ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటుకావడం ఇదే తొలిసారి
- పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి
- -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
ప్రైవేట్ కార్పొరేట్ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద, మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్లో ఆధునిక సౌకర్యాల మధ్య ఈ పెట్ స్కాన్ (Positron Emission Tomography) ను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. క్యాన్సర్ వైద్యంలో ఇదోక మైలురాయి కాబోతుంది. ఇందుకోసం సుమారు రూ.18 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం వ్యయంచేసింది. పెట్ సి.టి స్కాన్ ద్వారా క్యాన్సర్ వైద్య సేవలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
ఉచితం.. ఉచితం..
ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేటు ఆసుపత్రుల్లో పెట్ స్కాన్ సదుపాయం అందుబాటులో ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ఇతరచోట్ల అందుబాటులో ఉన్న ఈ పెట్ స్కాన్ సౌకర్యాన్ని రోగుల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుని గుంటూరు జీజీహెచ్ లో అందుబాటులోనికి తెచ్చామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ అసుపత్రుల్లో పెట్ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకునే వారి నుంచి సగటున రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. గుంటూరు జీజీహెచ్ ఆవరణలో ఉన్న నాట్కో క్యాన్సర్ కేంద్రంలో పరీక్షలు చేయించుకునే వారి నుంచి ఎటువంటి ఫీజు తీసుకోరు.
లినాక్, హెచ్ఎఆర్, సిటి స్టిమ్యులేటర్ సర్జికల్ ఎక్విప్‌మెంట్స్‌కు అదనంగా..
గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో రూ.41 కోట్లతో అత్యాధునిక పరికరాలు/యంత్రాలు సమకూర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. లెవల్-1 స్థాయిలో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు ఇప్పటికే లినాక్, హెచ్ఎఆర్ బ్రాకీథెరఫీ, సి.టి స్టిమ్యులేటర్ వంటి అత్యాధునిక సర్జికల్ పరికరాల్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ క్రమంలోనే యూఎస్ఏ నుంచి పెట్ స్కాన్ ను తెప్పించింది. ట్రయల్ రన్ విధానంలో దీని పనితీరును నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకు 50 మంది రోగులను పరీక్షించారు. ఈ కేంద్రంలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్, మెడికల్, న్యూక్లియర్, ప్రివెంటివ్ అంకాలజీ, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయి.
కార్డియాలజీ, న్యూరాలజీ, ఇతర సూపర్ స్పెషాలిటీల అవసరాలకు తగ్గట్టు…
రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని నాట్కో ట్రస్టు వారు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని నాలుగున్నరేళ్ల కిందట నిర్మించారు. క్యాన్సర్ వైద్య సేవల నిమిత్తం అవసరమైన 114 మంది వైద్యులు, సాంకేతిక నిపుణులు, పారా మెడికల్, ఇతర సిబ్బందిని కూటమి ప్రభుత్వం నియమించింది. గడిచిన ఏడాదిలో ఓపీ ద్వారా 19,598 మంది రోగులు, ఐపీ ద్వారా 6.942 మంది రోగులు చికిత్స పొందారు. 3,363 మంది కిమోథెరపీ, 965 మంది రేడియేషన్ థెరపీ చేయించుకున్నారు. 1,131 మందికి క్యాన్సర్ సర్జరీలు జరిగాయి. ఇన్ఫెక్షియస్ డీసిజెస్, హెమటాలజీ, కార్డియాలజీ, నూరాలజీ, పల్మనాలజీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోఫెడిక్స్ వైద్యులు కూడా రోగుల వ్యాధుల నిర్ధారణకు పెట్ స్కాన్ ను ఉపయోగిస్తున్నారు.
క్యాన్సర్ కణం ఎక్కడ దాగి ఉన్నా సరే..
శరీరంలో క్యాన్సర్ కణం ఎక్కడున్నా కచ్చితంగా గుర్తించేందుకు ఈ పెట్ స్కాన్’ ఉపయోగపడుతుంది. దీని సాయంతో క్యాన్సర్ ఏ దశలో ఉంది? ఎక్కడెక్కడికి విస్తరించిందనేది స్పష్టం తెలుసుకోవడానికి వీలుంది. సి.టి స్కాన్‌లో ఎముకలు, ఎంఆర్ ఐలో కణజాలం కనిపిస్తాయి. పెట్ స్కాన్ లో క్యాన్సర్ కణితిని కచ్చితంగా నిర్ధారించి చుట్టుపక్కల అవయవాలేవీ ప్రభావితం కాకుండా అందులో ఏ ప్రాంతానికి ఎంత రేడియేషన్ ఇవ్వాలో వైద్యులు నిర్ణయిస్తారు.