WARANGAL CHAPATA CHILLI GI TAG: టమాటా మిరపకాయ గురించి
WARANGAL CHAPATA CHILLI GI TAG: టమాటా మిరపకాయ గురించి తెలుసా!
• వరంగల్ జిల్లా చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు..
• ధ్రువీకరణ పత్రం అందించిన కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ..
• సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ వినియోగం..
Warangal Chapata Mirchi GI Tag: వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధ్రువీకరణ పత్రం అందిందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి దండా రాజిరెడ్డి తెలిపారు. పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.
టమాటా మిరపకాయ:
వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కొద్దిగా టమాటా ఆకారంలో ఉండే వీటిని ‘టమాటా మిరపకాయ’ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధికి, ఎగుమతికి అనువుగా ఉంటాయి. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుంటారు. మిఠాయిలతో పాటు ఆహార, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా వినియోగిస్తున్నారు. స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఈ పంట ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా సాగవుతోంది. ఇక్కడ 20 వేల మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7 వేల ఎకరాల్లో 10 వేల టన్నులకు పైగా ఈ మిరపకాయలను ఉత్పత్తి చేస్తున్నారు.
చపాటా మిర్చి డిమాండ్:
భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. చపాటా మిర్చి సాగుచేసే రైతులకు భౌగోళిక గుర్తింపు ద్వారా ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయని మల్యాలలోని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్ అన్నారు. జీఐ కారణంగా చపాటా మిరపకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరగనుందని తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.