Vanajeevi ramaiah: వనజీవి రామయ్య చెట్లను పెంచండి అనే నినాదంతో..
Vanajeevi ramaiah: వనజీవి రామయ్య చెట్లను పెంచండి అనే నినాదంతో..
పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటలోని వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య గారు పడ్డ తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. తొలకరి చినుకులుపడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య గారు, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిస్తుంది. రామయ్య గారికి ఓ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకొంటే ఆసుపత్రిలో ఉండగా పరామర్శించాను. అప్పుడు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారు. రామయ్య గారు స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేయడంతోపాటు... పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాము. ‘వనజీవి’ రామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
చెట్లను పెంచండి అనే నినాదంతో..
చిన్నప్పటి నుండి ‘చెట్లను పెంచండి’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపుతూ.. స్వయంగా మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య మరణం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ పర్యావరణ మార్పులని వనజీవి రామయ్య తరచూ చెబుతుండేవారు. దీనికి పరిష్కారం ఉన్న అడవులను సంరక్షించడంతో పాటు.. ప్రతి ఒక్కరూ కొత్తగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే అని ఆయన బలంగా విశ్వసించారు. ఈ దిశగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. తన జీవితాన్నే పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసిన వనజీవి రామయ్య, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
వనజీవి రామయ్య కేవలం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మాత్రమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన మాటలు సూటిగా ప్రజల హృదయాలకు తాకేవి. ఆయన మరణం పర్యావరణ ఉద్యమానికి ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే మనం ఆయనకు నిజమైన నివాళి అర్పించగలం. రామయ్య చూపిన బాటలో నడుస్తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటాయి..