Supreme Court: సంచలన తీర్పు.. ఆ 25వేల టీచర్ల నియామకాలను చెల్లవు
Supreme Court: సంచలన తీర్పు.. ఆ 25వేల టీచర్ల నియామకాలను చెల్లవు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల 753 టీచర్ల నియామకాలను చెల్లవని సుప్రీం స్పష్టంచేసింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్‌ఖన్నా ధర్మాసనం సమర్థించింది. ఆ పోస్టులకు సంబంధించి చేపట్టిన నియామక ప్రక్రియ మలినపడిందని ధర్మాసనం ఆక్షేపించింది. నియామకాలు రద్దైన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఇప్పటివరకు అందుకున్న జీతభత్యాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. మానవీయ కోణంలో ఆలోచించి ఆ నియామకాల ద్వారా కొలువులు సాధించిన దివ్యాంగులు యథావిథంగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తీర్పునిస్తున్నట్లు తెలిపింది. మూడు నెలల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
బెంగాల్‌లో 25,743 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి చోటు చేసుకున్న కుంభకోణంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదని అందులో పేర్కొంది. ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఉద్యోగులు తమ వేతనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
అంతకుముందు ఈ కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ క్రమంలోనే తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టి తాజాగా వెలువరించింది. ఇక, ఈ కుంభకోణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలోనే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ దీదీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 4న విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది.