రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Musi: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి

musirejuvenation MusiRiverfrontDevelopment MirAlamtank TelanganaRising HyderabadRising
Mounikadesk

Musi: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి 

Telangana CM REVANTH REDDY

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూ ఘాట్‌ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని చెప్పారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

 మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

 రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలి. సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలి. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలి.

 సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలి. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌తో కూడిన డిజైన్లు ఉండాలి.

 బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలి. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలి. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలి.

 మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలి.

 మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలి. ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలి. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలి... అని ముఖ్యమంత్రి సూచించారు.

 ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-