Mega DSC: మెగా డీఎస్సీలో.. వివాహిత మహిళలు ఆ తప్పు చేయకండి
Mega DSC: మెగా డీఎస్సీలో.. వివాహిత మహిళలు ఆ తప్పు చేయకండి
• 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
• దరఖాస్తులో వివాహిత మహిళలు తమ సర్టిఫికేట్‌లో ఉన్న ఇంటి పేరుతోనే నమోదు చేసుకునే వెసులుబాటు..
• ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను ఆదివారం నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా వివాహిత మహిళా అభ్యర్థుల విషయంలో కీలక ప్రకటన వచ్చింది.
డీఎస్సీ దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్‌లో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఒకే దరఖాస్తులోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికులుగా.. మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు.
డీఎస్సీకి రెండు రోజుల్లోనే 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఈసారి అన్ని పోస్టులకు కలిపి గడువులోగా ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆదివారం (ఏప్రిల్ 20) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.