HNSS: ఆసియాలోనే అతి పొడవైన కాలువ 'హంద్రీనీవా'
HNSS: ఆసియాలోనే అతి పొడవైన కాలువ 'హంద్రీనీవా' పూర్తితోనే రాయలసీమ రతనాల సీమ
• ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
• జూన్ 10కల్లా పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు - మంత్రి నిమ్మల
• 2024 జూన్ లో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంవత్సరం తిరక్కుండానే హంద్రీనీవా పనులు పూర్తి చేయాలనుకోవడం రాయలసీమ పట్ల అనుకున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
• కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హంద్రీనీవాకు సంబంధించి ప్రధాన కాలువ, అనుబంధ కాలువలు కలిపి 700 కిలోమీటర్ల పొడవున 9 నెలల కాలంలో పనులు శరవేగంగా పూర్తి చేస్తుండటం సరికొత్త రికార్డ్
• వైసిపి ప్రభుత్వం 20 20 జూన్ నాటికి హంద్రీనీవా పూర్తి చేస్తామని వర్క్ ఆర్డర్లు ఇచ్చి, టెండర్లు పిలిచి, ప్రగల్బాలు పలికి తట్ట మట్టి కూడా తీయలేదు
• హంద్రీనీవా కాలువకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఏర్పాటుచేసిన 3850 సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా వైకాపా ప్రభుత్వం వాడుకోలేకపోయింది.
• కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టకుండా చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం.
రాయలసీమను రతనాల సీమ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. హంద్రీనీవా పనుల పరిశీలనార్థం మంగళవారం పత్తికొండ నియోజకవర్గం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పనుల ప్రగతిని, శరవేగంగా జరుగుతున్న తీరును విలేకరులకు కూడా చూపించారు. ఆసియాలోనే అతి పొడవైన హంద్రీనీవా మెయిన్ కెనాల్ ఈ ఏడాది జూన్ 10వ తేదీకి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేయింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న తీరును ఆయన వివరించారు. ప్రతిష్టాత్మక హంద్రీనీవా మెయిన్ కెనాల్ పొడవు 565 కిలోమీటర్లు గా, ఎత్తు 392 మీటర్లగా ఆయన విశదీక రించారు. రాష్ట్రంలోని పోలవరం తదితర ఏడెనిమిది ప్రధాన ప్రాజెక్టులలో హంద్రీనీవాను చేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అందువల్లనే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 3240 కోట్లు హెచ్ఎన్ ఎస్ఎస్ కు కేటాయించి రాయలసీమపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు..
హంద్రీనీవా పూర్తి చేయడం ద్వారా మెయిన్ కెనాల్ ఆయ కట్టు పరిధిలోని అన్ని నియోజకవర్గ చెరువులను వాగులను నింపవచ్చని తద్వారా భూగర్భ జల సంపద అపారంగా పెరుగుతుందన్నారు. ఉదాహరణకు పత్తికొండ నియోజవర్గంలో 70 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నిటిని నింపితే 70 కిలోమీటర్ల మేర భూగర్భ జల సంపద పెరిగి భూములన్ని సస్యమలమవుతాయి అన్నారు. అలా కాకుండా ప్రధాన కాలువకే పరిమితమైతే కాలువకు ఇరువైపులా అటు అర కిలోమీటరు , ఇటు అర కిలోమీటరు మాత్రమే భూగర్భ జల వనరులు విస్తరిస్తాయన్నారు.
వాస్తవాలు ఇలా ఉండగా కాలువ లైనింగ్ పనులకు వైకాపా నేతలు అడ్డు చెప్పడం, అర్థరహిత ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం, అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. గత టిడిపి పాలన, గడచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల గణాంకాలను మంత్రి రామానాయుడు తులనాత్మకంగా వివరించి రాయలసీమకు జగన్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు.
2014 -19 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4000 కోట్లు ఖర్చు పెడితే వైసిపి ఐదేళ్ల పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన సంగతిని నిమ్మల గుర్తు చేశారు. నాడు టిడిపి హయాంలో హంద్రీనీవా ఫేజ్ 1 లో 84 శాతం పనులు , ఫేజ్ 2లో 75 శాతం పనులు జరిగాయన్నారు. అలాగే రాయలసీమ ప్రాజెక్టులకు గత టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో 12411 కోట్లు కేటాయిస్తే , గడచిన ఐదేళ్ల వైకాపా కాలంలో కేవలం 2011 కోట్లు మాత్రమే విదిల్చి నట్లు నిమ్మల విమర్శించారు. హంద్రీనీవా లైనింగ్ పనులకు 2021లో జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు నోరెత్తని వైకాపా నేతలు ఇప్పుడు లైనింగ్ పనులపై విమర్శలు చేయటం వారి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం అన్నారు. హంద్రీనీవా పై మాట్లాడే నైతిక అర్హత వైకాపా నేతలకు లేదని ఖండించారు.
'గాలేరు నగరి' ని హంద్రీనీవాతో తూరలతో ( పైపులు ) అనుసంధానించిన పెద్దిరెడ్డి నిర్వాకాన్ని మంత్రి నిమ్మల నిచితంగా విమర్శించారు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ ప్రధాన కాలువకు లైనింగ్ వద్దనే వైకాపా నేతలు పెద్దిరెడ్డి నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అందువల్ల చేతల ప్రభుత్వానికి, చేతకాని ప్రభుత్వానికి ఉన్న మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకొని వైకాపా నేతల తప్పుడు మాటలు వినవద్దు. విమర్శలు పట్టించుకోవద్దు అంటూ నిమ్మల రాయలసీమ ప్రజలకు హితవు పలికారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని నిమ్మల పిలుపునిచ్చారు.