రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం పదిలం

Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Health care news Popcorn health losses
Peoples Motivation

ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం పదిలం

ఆహారపు అలవాట్లతో వ్యాధులు తగ్గించుకోవచ్చు..

ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిద్దాం..

క్యాన్సర్ రోగుల్లో మహిళలే అధికం..

రైతులు పురుగుమందుల వినియోగం తగ్గించాలి...

ప్రకృతి సాగు పెరగాలి..

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి..

అమరావతిలో మెగా మెడిసిటీని నిర్మాణం...

హెల్త్ టూరిజానికి ప్రోత్సాహం..

-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఏ జిల్లాలో ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నదానిపై సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్

Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Health care news Popcorn health losses

అమరావతి, ఏప్రిల్ 7 (పీపుల్స్ మోటివేషన్): ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్పు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, ఇందుకోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రోజూ అరగంట వాకింగ్ చేయడం, అలాగే దైవ చింతనతో ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాను ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోందని తెలిపారు. పొగాకు, డ్రగ్స్, ఆల్కాహాల్‌ను దూరం పెడితే క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు తగ్గుతాయన్నారు. జంక్ ఫుడ్, ఫాలిష్డ్ బియ్యం తినడం తగ్గించి మిల్లెట్స్, ముడిబియ్యం తీసుకోవడంతో పాటు ఆహారంలో పీచు పదార్థం, కూరగాయలు ఎక్కువగా తినాలని సూచించారు. జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను సోమవారం సచివాలయంలో ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని రూపొందించాలన్నది తమ ఆలోచన అన్న సీఎం...హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామన్నారు. 

ఉప్పు, నూనె, చక్కెర తగ్గించాలి

నలుగురు ఉన్న కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు వాడితే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. వంటనూనె నెలకు 2 లీటర్లు, చక్కెర 3 కేజీల కన్నా ఎక్కువ వినియోగించకుండా చూసుకోవాలి. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉప్పు వినియోగం తగ్గిస్తే 40 శాతం మేర గుండెపోట్లు తగ్గుతాయి. కేరళ ప్రభుత్వం షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ ప్రకటించింది. తమిళనాడులో రేషన్ షాపుల్లో గ్లూకోజ్ టెస్టులకు స్ట్రిప్స్ ఉచితంగా ఇస్తున్నారు. ఏపీలో క్లీన్ కుక్ స్టవ్ పంపిణీ కింద అంగన్వాడీలకు గ్యాస్ స్టవ్ ఇచ్చాం. డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ మోడల్ కింద సింగపూర్‌లో అక్కడి ప్రభుత్వం ఇళ్లకు ప్రత్యేక పెయింట్ వేసి దోమల బెడద లేకుండా చేస్తోంది. దోమలను నివారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున న్యూట్రిఫుల్ యాప్ డెవలెప్ చేశాం. దీనికి స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం 4 లక్షల మంది ఈ యాప్‌ను అనుసరిస్తున్నారు. 


పురుగు మందుల వినియోగం తగ్గాలి

రైతులు పంటలకు పురుగు మందుల వినియోగం తగ్గించాలి. వీటి వాడకం వల్ల పంజాబ్ రాష్ట్రం క్యాన్సర్ కేపిటల్ అయింది. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం నేడు పురుగు మందుల వినియోగంతో అనారోగ్యంపాలైంది. అందుకే మన రాష్ట్రంలోని రైతుల్లో చైతన్యం తెచ్చి ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాల విద్య నుంచే ఆహారపు అలవాట్లపై చైతన్యం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. 


డిజి లాకర్‌లో హెల్త్ రికార్డులు

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల జారీలో ఏపీ ముందుంజలో ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 88 శాతం మంది ప్రజలకు హెల్త్ అకౌంట్లు రూపొందించాం. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నాం. ఫేజ్ 2 లో చిత్తూరు జిల్లా, ఫేజ్ 3లో రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేస్తాం. 26 నెలల్లో ఈ వర్చువల్ ఆసుపత్రులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హెల్త్ రికార్డులు రూపొందించి డిజిటల్ లాకర్‌లో పెడతాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని చిన్నతనం నుంచే ట్రాకింగ్ చేస్తాం. కాలాన్ని బట్టి వ్యాధులు ఎప్పుడు వస్తాయో ప్రజలకు అలెర్ట్ సందేశాలు పంపేలా రూపకల్పన చేస్తాం. మొబైల్ వైద్య వాహనాల ద్వారా ఇంటివద్దే పరీక్షలు చేయిస్తాం. డాక్టర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సేవలందిస్తారు.. 


టాటా, గేట్స్ తో కలిసి

టాటా, గేట్స్ ఫౌండేషన్‌ సహకారంతో వైద్య రంగంలో ముందుకెళ్తాం. ప్రపంచస్థాయి టెక్నాలజీ, ప్రాక్టీసెస్‌ను ఇక్కడికి తీసుకొస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తాం. 175 నియోజకవర్గాలకుగాను 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. లేని 105 నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్మిస్తాం. ఆరోగ్య సేవలను ప్రజలకు దగ్గర చేయడానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నియోజకవర్గాల్లో నిర్మిస్తాం. పీపీపీ విధానంలో నిర్మించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తాం. ఆసుపత్రుల నిర్మాణానికి స్థలంతో పాటు, కొంత రాయితీ ఇస్తాం. మధ్యప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలో దీనిపై అధ్యయనం చేసి ఉత్తమ విధానాన్ని తీసుకొస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ఏర్పాటవుతుంది. వ్యాధులకు సంబంధించి దేశ, విదేశాల్లో ఉండే నిపుణులను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంటాం. రాష్ట్రంలోని ఉత్తమ డాక్టర్లను వారికి అనుసంధానం చేసి ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఏం చేశామన్నది సమీక్ష చేస్తాం. 


అమరావతిలో మెగా మెడిసిటీ ఏర్పాటు

రాజధాని అమరావతిలో పీపీపీ విధానంలో మెగా గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేస్తాం. కేంద్రం దేశంలో 25 మెడిసిటీలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అమరావతిలో మెడిసీటీ నిర్మాణంపై కేంద్రంతో సంప్రదిస్తున్నాం. దీనికి 200 ఎకరాలను కేటాయించి అందులో 100 ఎకరాలు హెల్త్ కేర్, సేవలకు 40 ఎకరాలు, రెసిడెన్షియల్‌కు 40 ఎకరాలు, కమర్షియల్‌కు 20 ఎకరాలు ఇచ్చే విధంగా విధానాలు రూపొందించారు. మెడిసిటీ ఏర్పాటుపై ఆరోగ్య శాఖ, సీఆర్డీఏ కలిసి పని చేస్తాయి. హెల్త్ టూరిజానికి కూడా ఈ మెగా మెడిసిటీ ఉపయోగపడుతుంది. 


జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులపై సీఎం ఇచ్చిన ప్రజంటేషన్ వివరాలు ఇలా ఉన్నాయి

మహిళల్లోనే హైపర్ టెన్షన్ ఎక్కువ

‘హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్‌లు, గుండె వ్యాధుల విషయంలో... తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వాయ కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నియోనియో, సీఓపీడీ కేసులు ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువుగా నమోదవుతున్నట్టు గుర్తించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, తాగునీటిలో టాక్సిన్స్‌తో అనారోగ్యం బారిన పడ్డ వాళ్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువుగా ఉన్నారు. పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు. అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్‌న్యూట్రిషియన్ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువ. వర్షాకాలంలో ఎక్కువుగా వచ్చే చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ సమాచారం గత 5 ఏళ్లు ఆసుపత్రులకు వచ్చిన సమాచారాన్నంతా తీసుకుని రూపొందించాం. దీనిపై మాకు రికార్డులు ఉన్నాయి.  వెనకబడిన జిల్లాల్లో ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల డయాబెటిస్ తక్కువగా ఉంది.


హైపర్‌ టెన్షన్

• రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్లు (మొత్తం జనాభాలో 52.43%) మందికి స్ర్కీనింగ్ చేస్తే అందులో 19.78 లక్షల మందికి (9.2 శాతం) హైపర్ టెన్షన్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్ ఎదుర్కొంటున్నారు. 

• 11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. 

• 8,37,927 మంది మగవాళ్లకు హైపర్ టెన్షన్ ఉంది. 

• మరో 14.29 లక్షల మంది (71.92%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. 

• జిల్లాల వారీగా చూస్తే... కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువుగా ఉంది. 

• శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. 

డయాబెటిస్

• రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల (52.43%) మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది.

• డయాబెటిస్ మాత్రం మహిళలు కన్నా, మగవాళ్లకే ఎక్కువ.

• 5,61,196 మంది మగవాళ్లకు డయాబెటిస్ ఉంది. 

• 5,52,767 మంది మహిళలకు డయాబెటిస్ ఉంది. 

• మరో 8.76 లక్షల మంది (78.73%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. అంటే వీరంతా డయాబెటిస్ రిస్క్‌లో ఉన్నారు. 

• జిల్లాల వారీగా చూస్తే... గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్ ఎక్కువుగా ఉంది. 

• అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. 

డయాబెటిస్, హైపర్ టెన్షన్

• హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్న వారి సంఖ్య 20.78 లక్షల మంది (9.6%). 

• వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఎదుర్కొంటున్నారు. 

• 11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉంది. 

• మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్ ఉంది. 

• అండర్ ఫాలో అప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64%) ఉన్నారు. 

• హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా జిల్లాల్లో ఎక్కువ.  

• అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు. 

గుండె సంబంధిత వ్యాధులు

• 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు. 

• ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాలో గుండె వ్యాధిగ్రస్తులు అధికం. 

• అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం. 

క్యాన్సర్ రోగులు

• 1,19,397 మంది క్యాన్సర్ రోగులు. 

• వీరిలో మగవాళ్లు 46,872 మంది కాగా, మహిళలు 72,525 మంది ఉన్నారు. 

• కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికం 

• అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పం. 

కాలేయ వ్యాధిగ్రస్తులు

• 30,646 మంది క్యాన్సర్ రోగులు. వీరిలో మగవాళ్లు 21,740 మంది, మహిళలు 8,906 మంది. 

• నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధికం 

• అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పం. 

శ్వాస సంబంధిత రోగులు

• 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

• వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా, మహిళలు 19,274 మంది ఉన్నారు. 

• నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం.

• అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

నరాల సంబంధిత అనారోగ్యం

• 1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

• వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా, మహిళలు 43,735 మంది ఉన్నారు. 

• విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం.

• అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు

• రాష్ట్రంలో మొత్తం 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

• వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా, మహిళలు 50,807 మంది ఉన్నారు. 

• నీళ్లు, లిక్కర్, పొగాకు కారణంగా ఉన్నాయి. 

• శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కేసులు. 

• అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నాయి.

జూన్ నాటికి స్క్రీనింగ్ పూర్తి

ఈ ఏడాది జూన్ కల్లా రాష్ట్రంలో అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారిన పడే అవకాశాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు అని చెప్పడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.  దీనిపై మరింత అధ్యయనం, పరిశీలన, పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాల్సి ఉంది.’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

Comments

-Advertisement-