రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు.
ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.
పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటన చాలా దురదృష్టకరం అని పేర్కొన్న సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి, చిత్తూరు రహదారి సంబేపల్లె మండలం, ఎర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రమాదేవి వాహనం పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు కావడంతో ఆమె కారులో ఇరుక్కున్నారు. అక్కడున్న స్థానికులు పరుపరుగున వచ్చి రమాదేవిని వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా రమాదేవి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. క్షతగాత్రులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు రమాదేవి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యేందుకు వెళుతుండగా... సంబేపల్లె మండలం యర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మరణించడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.