రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ లక్ష్యం పెంపుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం
ప్రస్తుత రబీ సీజన్ లో 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం
ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు స్లాట్ బుకింగ్ కోసం7337359375 వాట్సాప్ నెంబర్
ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, (పీపుల్స్ మోటివేషన్):-
రైతులు పండించిన ప్రతీ గింజను కొనాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శనివారం సాయంత్రం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతు గొప్పదనాన్ని, రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును మంత్రి కందుల దుర్గేష్ స్పష్టంగా వివరించారు. రైతు సేవా కేంద్రం వద్ద డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి కందుల దుర్గేష్ నివాళులర్పించారు. అనంతరం ధాన్యం బస్తాల ట్రాక్టర్ ను నడిపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతులకు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్ లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ విషయమై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం తెలిపారని వివరించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంతో రైతులంతా సంతోషంగా ఉన్నట్లు గమనించానన్నారు.గతంలో రైతన్న ఆరుగాలం శ్రమించి పండించి పంటకు నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో నగదు పడని సందర్భం చూశామన్నారు.ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అధిగమించి కూటమి ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్నారు.గతంలో రైతు భరోసా అని పేరు పెట్టి అన్నదాతలను మోసం చేశారని మంత్రి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.ధాన్యం తేమశాతం విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, అటు ఇటుగా ఎలా ఉన్నా సేకరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపామన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చే రైతును నిరీక్షణ చేయవద్దని ఆదేశించామన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు వెంటనే అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. మిల్లర్లకు గోనె సంచుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.3.75 ఇస్తోందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యత లేని సంచులను ఇవ్వొద్దని హెచ్చరించామన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణలాంటివని గుర్తుచేశారు. రైతు ధాన్యం పండిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నం పెట్టి ఆదుకునే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, నాయకులు, అధికారులపై ఉందని తెలిపారు.రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మిల్లర్లకు సహాయపడాలన్నారు. రైతులకు ఉపయోగపడేందుకే విధానాలు రూపకల్పన చేశామన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా త్వరితగతిన నాణ్యమైన గోనెసంచులు పంపిణీ చేసే బాధ్యత అధికారులదే అని మంత్రి తెలిపారు.క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల తేమశాతం పెరిగిందన్నారు. కానీ ప్రస్తుతం ఆ బాధ లేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వం కనుక గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1600 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు చెల్లించిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిప్పటికీ రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ప్రభుత్వం తమది అన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రపంచంలో వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వినియోగించి సామాన్య ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగంలోకి తీసుకొచ్చారన్నారు. అందులో భాటగంగా రాష్ట్రంలో ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారని వివరించారు. అందులో భాగంగా రైతులు ఇంట్లోనే కూర్చొని తమ వాట్సాప్ నుండి 7337359375 నంబర్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే తమకు కావాల్సిన సమాచారం, సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో సాంకేతికపరమైన విప్లవం వచ్చిందని, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ విషయంలో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన రైతులకి, మిల్లర్లు కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి రైతులకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం మిల్లర్లు సరఫరా చేసే గన్ని బ్యాగులు నాణ్యత ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశ్యం తో గన్ని బ్యాగులపై ఆయా మిల్లర్ల క్యూ ఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఆమేరకు మిల్లర్లు సరఫరా చేసే గన్ని బ్యాగులపై క్యూ ఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, ఆహార భద్రత కోసం ధాన్యం సేకరణ చేయాలని 5 దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన బాపూజీ అని పిలుచుకునే బాబు జగజ్జీవన్ రామ్ జన్మ దినం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించు కోవడం జరుగుతోందని తెలిపారు. రెండు వేర్వేరు పదవీకాలాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా, ఆయన హరిత విప్లవం మరియు భారత వ్యవసాయం ఆధునీకరణకు గణనీయంగా దోహదపడ్డారన్నారు. ముఖ్యంగా 1974 కరువు సమయంలో తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను ఆయనకు అప్పగించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, ఆర్డీవో రాణి సుస్మిత, ఇన్చార్జి డీ ఎస్ వో ఎస్ భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.