ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.
కసిరెడ్డిదే కీలక పాత్ర..
ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు.
అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.