రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నేడు చంద్రబాబు 75వ పుట్టిన రోజు ప్రత్యేక కథనం

CBN BIRTHDAY CELEBRATIONS CHANDRABABU BIRTHDAY CELEBRATIONS CHANDRABABU BIRTHDAY WISHES CM CHANDRABABU NAIDU 75TH BIRTHDAY CHANDRABABU 75TH BIRTHDAY
Peoples Motivation

నేడు చంద్రబాబు 75వ పుట్టిన రోజు ప్రత్యేక కథనం

• నారావారిపల్లె నుంచి నాయకుడై ఎదిగి..

• తండ్రి మొండితనం.. తల్లి శ్రమతత్వం.. రెండూ కలిపితే నారా చంద్రబాబు నాయుడు

• విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పీజీలో ఉండగానే రాజకీయ అరంగేట్రం

CBN BIRTHDAY CELEBRATIONS CHANDRABABU BIRTHDAY CELEBRATIONS CHANDRABABU BIRTHDAY WISHES CM CHANDRABABU NAIDU 75TH BIRTHDAY CHANDRABABU 75TH BIRTHDAY

చంద్రబాబు నాయుడు... ఆ పేరే ఒక బ్రాండ్‌! ఆయనది అసాధారణ ప్రస్థానం! అలుపెరుగని ప్రయాణం! నారావారిపల్లె నుంచి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యేదాకా... ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యం! అభివృద్ధిపైనే ఆయన ధ్యాస... రాజకీయం ఆయన శ్వాస! చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనాలు..

'నారా వారి' కుర్రోడు! చిన్న పల్లెలో పుట్టాడు! ఇంతింతై ఎదిగాడు! ఇతరులు అందుకోలేనంత ఎత్తున నిలిచాడు! 'ఒక సామాన్యుడు ఇంత స్థాయికి రాగలడు' అనేందుకు నిదర్శనంగా నిలిచాడు. ఆయనే... నారా చంద్రబాబు నాయుడు! ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు, విభజిత రాష్ట్రానికి రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి! అందరూ 1996లో ఉన్నప్పుడు ఆయన '2020' గురించి కలగన్నారు.. ఇప్పుడు 2025లో ఉంటూ... '2047'ను దర్శిస్తున్నారు. ఆయనొక స్వాప్నికుడు! రాజకీయాల్లో సాహసికుడు! లోతైన ఆలోచనల అపర 'చాణక్యుడు'! ఎవరికీ లొంగని మొండివాడు! అంతటి చంద్రబాబు నాయుడు నేడు తన జీవితంలో 'వజ్రోత్సవం'లో అడుగు పెడుతున్నారు. పైకి కనిపించే చంద్రబాబు వేరు! లోపల ఉండే చంద్రబాబు వేరు! బాల్యం, విద్యార్థి దశతో మొదలుకుని ఇప్పటిదాకా చంద్రబాబు జీవితంలో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి! చంద్రబాబు స్నేహితులు, బంధువులు, ఆయనను సన్నిహితంగా చూసిన వారెందరినో పలకరించి, నాటి జ్ఞాపకాలను కదిలించి 'ఆంధ్రజ్యోతి' అందిస్తున్న ప్రత్యేక కథనం...

75 ఏళ్ల చంద్రబాబు ప్రస్థానం:

రాజకీయాల్లో 'విజనరీ' అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 30 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకత చాటుకున్నారు. రైతు బజార్లు, జన్మభూమి, ఈ-సేవ, ఇంటర్‌లో మూడు ప్రశ్నపత్రాల విధానం, ఇంజనీరింగ్‌ కాలేజీల పెంపు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌.. ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. తుఫాన్లు, విపత్తుల వేళ సీఎం హోదాలో క్షేత్రస్థాయిలో మకాం వేసి పరిస్థితులు చక్కదిద్దిన తీరు ఆయన పాలనాదక్షతకు నిదర్శనం. పాలనలో తనదైన మార్క్‌ వేసిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆదివారం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలో కీలక విశేషాలు, ఘట్టాలు...

వాక్చాతుర్యం లేకున్నా..

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు గొప్ప వాక్చాతుర్యంతో పాటు తిరుగులేని ప్రజాకర్షణ ఉంది. చంద్రబాబుకు ఈ రెండూ మైన్ససులే. కానీ ప్రజల మన్ననలు పొందుతూ రాజకీయాల్లో కొనసాగుతుండటం చంద్రబాబు ప్రత్యేకత. ఎన్టీఆర్‌ స్థానాన్ని చంద్రబాబు భర్తీ చేయగలరా? ఎన్నికల్లో పార్టీని గెలిపించగలరా? అన్న పార్టీ శ్రేణుల అనుమానాలను 1999 ఎన్నికల్లో చంద్రబాబు పటాపంచలు చేశారు. ప్రత్యర్థులు చంద్రబాబు పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్‌ పక్షిలా మళ్లీ బలం పుంజుకుని ఉవ్వెత్తున ఎగబాకడం ఆయన ప్రత్యేకత.

2,817 కి.మీ. పాదయాత్ర

2012లో చంద్రబాబు 62ఏళ్ల వయసులో 'వస్తున్నా మీకోసం' అంటూ 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆరు పదులు దాటిన వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేయడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అంతకుముందు 2003లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి 66 రోజుల పాటు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అప్పటికి ఆయన వయసు 54 ఏళ్లు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ 45 ఏళ్ల వయసులో పాదయాత్ర చేశారు. నారా లోకేశ్‌ 40 ఏళ్ల వయసులో 2023 జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

పుస్తక పఠనం హాబీ

చంద్రబాబు ప్రతిరోజూ ఉదయం 4-4.30 గంటలకు నిద్ర లేస్తారు. రాత్రి 10.30-11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తారు. రోజంతా క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా తీరిక దొరికితే పుస్తక పఠనం తప్పనిసరి. అది ఆయన హాబీ. ఆయనకు ఇష్టమైన పుస్తకం రొండా బైర్న్‌ రాసిన 'సీక్రెట్‌'. ఈ పుస్తకంలోని.. 'నువ్వు ఏదైనా పని చేయాలని బలంగా సంకల్పిస్తే.. ఆ పని సానుకూలం కావడానికి అవసరమైన పరిస్థితులు వాటంతట అవే ఏర్పడతాయి. కావలసిందల్లా గట్టి సంకల్పమే' అన్న వాక్యాలు చంద్రబాబుకు చాలా ఇష్టం.

అక్రమ కేసులో 52 రోజులు జైలు

చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఓ నిర్ణయం తీసుకునే ముందు వంద రకాలుగా ఆలోచిస్తారు. తనపై ఎలాంటి మచ్చా రాకుండా ఎంతో జాగ్రత్త పడతారు. అయినా జగన్‌ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపాలన్న ఉద్దేశంతో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేయించింది. 2023 సెప్టెంబరు 9న అక్రమ కేసులో అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు. అప్పటికి ఆయన వయసు 73 ఏళ్లు. తొలిసారి జైలు జీవితం గడిపారు. ఆ వయసులో 52 రోజులు రాజమండ్రి జైలులో గడపాల్సి వచ్చింది. జైలులో తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా చంద్రబాబు మనోధైర్యాన్ని వీడలేదు.

దక్షత.. దార్శనికత

1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన తర్వాత భవిష్యత్తు అంతా కంప్యూటర్‌ యుగానిదేనని, ఆ దిశగా అడుగులు వేయకపోతే రాష్ట్రం వెనుకబడిపోతుందని భావించారు. 'ప్రపంచ అవసరాలకు తగినట్లు ఎవరు ముందుగా మారుతారో వారే ఎక్కువ ప్రయోజనం పొందుతారు'.. అని 1996లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, అప్పటి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి పీవీఆర్‌కే ప్రసాద్‌తో చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచే ఐటీ రంగం, సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజకీయ శిక్షణ తరగతుల కోసం మొదటిసారి కంప్యూటర్‌ వాడిన వ్యక్తి చంద్రబాబే. ప్రజలందరూ తెలుసుకునేలా జీవోను వెబ్‌సైట్‌లో ఉంచడం మొదలైంది ఆయన హయాంలోనే. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన తర్వాత మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ భారత పర్యటనకు వచ్చారు. ఆయన్ను ఏపీకి ఆహ్వానించి, పెట్టుబడులు పెట్టించాలనే దృఢసంక్పలంతో చంద్రబాబు ప్రయత్నించారు. ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకపోయినా ఓ సమావేశంలో ఆయన్ను కలిశారు. 40 నిమిషాల పాటు లాప్‌ట్యా్‌పలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్‌ నచ్చడంతో గేట్స్‌ హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించారు. హైటెక్‌ సిటీ నిర్మాణంతో లక్షలాది మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా హైదరాబాద్‌ ముఖ్య ఆదాయ వనరుల్లో అది ఒకటిగా నిలిచింది.

పింఛన్లకు ఐరిస్ యంత్రాలు:

పింఛన్ల పంపిణీ సక్రమంగా సాగడానికి చంద్రబాబు హయాంలోనే ఐరిస్‌ యంత్రాలను వాడటం మొదలు పెట్టారు. అప్పటి వరకు పాస్‌పోర్టు కార్యాలయాల్లోనే వాడుతున్న ఐరిస్‌ యంత్రాలు తెప్పించి, రాష్ట్రం అంతా లబ్ధిదారుల కంటి పాపలను రికార్డు చేయించి, వేలిముద్రలను డిజిటలైజ్‌ చేయించారు. ఇలా అనర్హులను ఏరివేసి వారి స్థానంలో మరికొంత మంది అర్హులకు పింఛన్లు ఇచ్చారు. అలాగే రేషన్‌ షాపుల్లో సంతకాలు పెట్టి రేషన్‌ తీసుకునే పద్ధతిని ఆపేసి, తప్పనిసరిగా వేలిముద్ర వేసి తీసుకునేలా విధానాలు మార్చారు. మొదట్లో ఈ విధానాలను విమర్శించిన ప్రతిపక్ష నాయకులు ఆ తర్వాత అదే మార్గాన్ని అనుసరించారు.

మతకలహాలు, ఫ్యాక్షన్‌కు చెక్:

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 1995 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రధాన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. అవి... హైదరాబాద్‌లో మతకలహాలు, నక్సల్స్‌ సమస్య, రాయలసీమ ఫ్యాక్షన్‌. 1989 నుంచి 1994 వరకు హైదరాబాద్‌లో ఏటా రంజాన్‌ మాసంలో మతకలహాలు జరుగుతుండేవి. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మూడింటిపై దృష్టి పెట్టారు. 1995 నుంచి మతకలహాల ఊసే లేకుండా చేశారు. గ్రేహౌండ్స్‌ను బలోపేతం చేసి నక్సల్స్‌ సమస్యను చాలా వరకు నియంత్రించారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ ముఠాలపై రాజకీయాలకు అతీతంగా ఉక్కుపాదం మోపారు.

ఈ-సేవలకు ఆద్యుడు:

ప్రతి చిన్న పనికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి లంచాలు ఇచ్చుకునే సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి 1999లో ఈ-సేవలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పన్నుల చెల్లింపులు మొదలు వివిధ సర్టిఫికెట్ల జారీ వరకు అన్నీ ఈ-సేవల ద్వారా అందుబాటులో ఉంచారు. దీని కోసం అన్ని శాఖల సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఇప్పుడే అదే మీ-సేవ రూపంలో పనిచేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఫైలింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.

ఎంసీహెచ్‌ఆర్డీ

కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి శిక్షణ కోసం ఉమ్మడి ఏపీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఐఓఏ) ఉండేది. పేరుకే శిక్షణ సంస్థ. దాని పనితీరు మాత్రం అంతంతే. 1994లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధికి విజన్‌-2020 ఒక్కటే మార్గమని చెబుతూ ఉండేవారు. ఈ విజన్‌-2020ని ఉద్యోగులకు అవగతమయ్యేలా చేసి సమర్థంగా అమలు చేయడానికి ఉద్యోగులందరికీ శిక్షణ అవసరమని గుర్తించారు. అప్పటి వరకు పేరుకే పరిమితమైన ఐఓఏను డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఉద్యోగులకే కాదు మంత్రులకూ శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రులకు శిక్షణ ఇవ్వడం దేశంలో ఏపీతోనే మొదలైంది.

సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

హైదరాబాద్‌లో ఎంసీహెచ్‌ఆర్డీ చెంతనే ఏర్పడిన సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌.. చంద్రబాబు ఆలోచన నుంచి పురుడు పోసుకున్నదే. ఏ శాఖలోనైనా వచ్చే శాఖాపరమైన ఇబ్బందులు, పాలనాపరంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కార వేదికగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ మారింది. దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాటి బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే ఇదొక వివేకవంతమైన ముందడుగు అంటూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.

ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొని..

జీవితంలో ఎదురయ్యే ప్రతి సంక్షోభాన్ని ఓ పాఠంగా భావించాలని చంద్రబాబు చెబుతుంటారు. తొలి నుంచి ఆయన పంథా ఇదే.

1984లో తొలిసారి..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1984 ఆగస్టులో తొలి సంక్షోభం చోటు చేసుకుంది. ఆ ఏడాది ఆగస్టు 16న కుట్రపూరితంగా ఎన్టీఆర్‌ను గద్దె దించి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యా రు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం ఎన్టీఆర్‌కు ఉన్నా సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామం టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి శిబిరం వైపు వెళ్లకుండా కాపాడుకున్నారు. నెలరోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనతో 1984 సెప్టెంబరు 16న నాదెండ్ల భాస్కరరావు రాజీనామా చేశారు.

1995లో రెండోసారి..

1995 ఆగస్టులో టీడీపీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. అయితే ఇది పార్టీ అంతర్గత సంక్షో భం. ఎన్టీఆర్‌ సహాయకురాలిగా ప్రవేశించిన లక్ష్మీపార్వతి చివరికి ఆయన భార్యగా పార్టీని శాసించడం మొదలెట్టారు. పార్టీలో సీనియర్లంతా అవమానాలకు గురవుతూ పార్టీని వీడిపోతున్న పరిస్థితి. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కావడంతో అధికశాతం ఎమ్మెల్యేలు లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా గళం విప్పా రు. పార్టీని కాపాడుకునేందుకు బాబు వీరికి నాయకత్వం వహించి 1995 సెప్టెంబరు 1న తొలిసారి సీఎం గా ప్రమాణం చేశారు.

యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా 1973లో చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చంద్రగిరి బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తొలి పదవి చేపట్టారు.

1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటికి ఆయన వయసు 28 ఏళ్లు. జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరిపై 2,500 ఓట్లతో విజయం సాధించారు.

1980 అక్టోబరులో సీఎం టీ అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికైన ఘనత చంద్రబాబుదే.

1981 సెప్టెంబరులో ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు.

1983 జనవరిలో చంద్రగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థి వెంకట్రామ నాయుడు చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

1984లో చంద్రబాబు టీడీపీలో చేరి పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.

1984లో పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆగస్టు సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించి, సీఎం పదవి కోల్పోయిన ఎన్టీఆర్‌ను నెలరోజుల్లో తిరిగి సీఎం పదవిలో అధిష్ఠింపజేశారు.

1989లో చంద్రగిరి నుంచి కాకుండా కుప్పం నుంచి తొలిసారి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆయన కుప్పం నుంచే వరుసగా గెలుస్తున్నారు. ఇప్పటి వరకు కుప్పం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు.

1995 ఆగస్టులో మరో సంక్షోభం టీడీపీని కుదిపేసింది. లక్ష్మీపార్వతి పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. పార్టీని కాపాడుకునేందుకు ఎన్టీఆర్‌పై తిరుగుబాటుకు చంద్రబాబు నాయకత్వం వహించారు.

1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఏపీకి 13వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.

1999లో తొలిసారి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించింది. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

1992లో హెరిటేజ్‌ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఇది దక్షిణ భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు డెయిరీగా ఉంది.

2003 అక్టోబరు 1న సీఎం హోదాలో తిరుమలకు వెళుతున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద క్లెమోర్‌మైన్స్‌తో నక్సల్స్‌ దాడి చేశారు. ఈ ఘోర దుర్ఘటన నుంచి చంద్రబాబు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 2014 వరకు చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు.

2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. చంద్రబాబు మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమయ్యారు.

2023 సెప్టెంబరు 9న నాటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. అక్టోబరు 31న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి జైలులో 52 రోజులు గడిపారు.

2024 మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారు.

వినూత్న సంస్కరణలు మూడు సెట్ల ప్రశ్నపత్రాలు:

1996లో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాలు లీక్‌ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పీవీఆర్‌కే ప్రసాద్‌ ఉన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా నెల రోజుల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి అప్పటి వరకు ఉన్న ఒక ప్రశ్నపత్రం విధానానికి స్వస్తి పలికి, మూడు సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పరీక్షకు మూడు సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేయడం, పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు ఆ మూడింటిలో ఒకదాన్ని ఎంపిక చేసి విద్యార్థులకు ఇవ్వడం ప్రారంభించారు.

20 వేల నుంచి లక్షకు ఇంజనీరింగ్‌ సీట్లు

1996లో ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్లు 20 వేల లోపే. ఇక్కడ సీట్లు సరిపోక 40 వేల మంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి సీటుకు రూ.2 నుంచి 3 లక్షలు చెల్లించి చదువుకునేవారు. మరోవైపు చంద్రబాబుకు ముందు సీఎంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కొత్త కాలేజీల మంజూరు వ్యవహారంలో ఏకంగా తన పదవినే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. భవిష్యత్తు అంతా ఐటీ, కంప్యూటర్‌ రంగాలదే అని ఆలోచించిన చంద్రబాబు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల రెండు మూడేళ్లలోనే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ వచ్చింది. 20 వేల లోపు ఉన్న సీట్లు ఏకంగా లక్షకు చేరాయి.

జన్మభూమి నుంచి పీ4 వరకు..

ప్రభుత్వంలో ప్రజలను, సంస్థలను భాగస్వాములను చేయాలన్నది చంద్రబాబు యోచన. ఇందులో భాగంగా శ్రమదానం, జన్మభూమి, నీరు-మీరు, పచ్చదనం- పరిశుభ్రత, తాజాగా పీ4 వంటి కార్యక్రమాలు రూపొందించారు. జన్మభూమి ప్రవాసాంధ్రులను సైతం కదిలించింది. పల్లెలు అభివృద్ధి బాట పట్టేలా చేసింది. అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులను కార్యాలయాల నుంచి కదలించి 'ప్రజల వద్దకు పాలన' ప్రారంభించారు.

రైతు బజార్లు

'చెత్త నుంచి సంపద సృష్టి'.. చంద్రబాబు వినూత్న ఆలోచనల్లో ఒకటి. ఈ ఆలోచనను సద్వినియోగం చేసుకున్న పంచాయతీలు వాటి ఆదాయం కంటే ఎక్కువగా సంపద కేంద్రాల ద్వారా ఆర్జించిన ఉదంతాలు ఉన్నాయి. 2019కి 3000 గ్రామా ల్లో సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పంట పండిం చే రైతుకు.. వాటిని కొనుగోలు చేసే ప్రజలకు నడుమ దళారుల ప్రమేయాన్ని తొలగించేందుకు రైతు బజార్లకు పెట్టారు.

విద్యుత్తు కొరతల నుంచి మిగులు..

2014లో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. అప్పులు, విద్యుత్తు కొరత వెంటాడుతున్నాయి. వాటిని చాలెంజ్‌గా తీసుకుని చంద్రబాబు ముందుకు నడిచారు. హైదరాబాద్‌కు మిన్నగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే విద్యుత్తు మిగులు దిశగా రాష్ట్రాన్ని నడిపారు.

యువకుడు కొత్తతరం నాయకుడు

'నాయకత్వ లక్షణాలు' పుట్టుకతో వస్తాయా? లేక... నేర్చుకుంటే వస్తాయా? చంద్రబాబు విషయానికి వస్తే... పుట్టుకతో వచ్చిన లక్షణాలకు పెరిగి పెద్దయ్యే కొద్దీ మరింత పదును పెట్టారని చెప్పవచ్చు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ సందడే! బాల్యంలో బడి నుంచి యూనివర్సిటీలో పీజీ విద్యార్థి దాకా ఇదే జోష్‌! పీయూసీ రోజుల్లోనే చంద్రబాబు వెయ్యి కోళ్లతో నారావారిపల్లిలో ఫారం పెట్టారు. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బునంతా స్నేహితులకోసమే ఖర్చు పెట్టేవారు. వారంలో రెండు రోజులైనా స్నేహితులతో కలిసి 'శీనయ్య మెస్‌'కు వెళ్లాల్సిందే. ఎక్కువ సందర్భాల్లో బిల్లు చంద్రబాబుదే! ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రవేశపెట్టిన 'శ్రమదానం' ఎంత పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. నిజానికి... పీయూసీలోనే ఆయన తన మిత్రులతో కలిసి 'శ్రమదానం' మొదలుపెట్టారు. కొంటి కాలువ, బాపన కాలువలో పూడికలు తొలగించారు. డిగ్రీలో తిరుపతిలోని పొర్ల వీధిలో క్లాస్‌మేట్స్‌తో కలిసి రూమ్‌లో ఉండేవారు. పరీక్షలకు రెండు నెలల ముందు మాత్రం తిరుపతి ఆకుతోట వీధిలో రూమ్‌ తీసుకుని ఒక్కడే చదువుకునేవారు. చదివేది రెండు నెలలే! కానీ, మార్కులు 50శాతానికి తగ్గేవి కావు. చంద్రబాబులోని అసలైన 'నాయకుడు' ఎస్వీ యూనివర్సిటీలో బయటికొచ్చాడు. 1973-74లో 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌' స్టూడెంట్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. యూనివర్సిటీ హాస్టల్‌, మెస్‌ జనరల్‌ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు. అప్పట్లోనే సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల సందర్శనలకు సహ విద్యార్థులను తీసుకెళ్లేవారు. అప్పట్లో ఎ.రంగంపేటలో అప్పర్‌ ప్రైమరీ స్కూలు మాత్రమే ఉండేది. దానిని హైస్కూలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని జనం కోరితే... రూ.8వేలు కార్పస్‌ ఫండ్‌ కడితే చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో... చంద్రబాబు చుట్టుపక్కల ఊళ్లలో తన మిత్రులతో కలిసి తిరిగి రూ.5వేల చందాలు పోగేసి... జడ్పీకి చెల్లించారు. దీంతో ఆ బడి హైస్కూలుగా మారింది. తనకు తెలిసిన వారి మధ్య గొడవలు జరిగితే పోలీసు స్టేషన్‌ దాకా వెళ్లకుండా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా రాజీ కుదిర్చేవారు. ఆయన పీజీ చేస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా వెంట పదీ ఇరవైమంది ఉండేవాళ్లు. 'నలుగురిలో నా కొడుకు దర్జాగా ఉండాలి' అంటూ అప్పట్లోనే చంద్రబాబుకు ఆయన తండ్రి ఎజ్డీ డబుల్‌ ఇంజిన్‌ బైక్‌ కొనిచ్చారు.

రాజకీయాల్లో కొత్త ఒరవడి

చంద్రబాబు 1977లో పీహెచ్‌డీ చేస్తుండగానే రాజకీయాల్లో అడుగు పెట్టారు. పులిచర్ల సమితికి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. అదే సమయంలో దివిసీమ ఉప్పెన విధ్వంసం సృష్టించింది. చంద్రబాబు, తన మిత్రబృందంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటించి... నగదును, సహాయ సామగ్రిని సేకరించి నేరుగా దివిసీమకు వెళ్లి బాధితులకు అందించారు. 'వరకట్న నిషేధిత ప్రతిజ్ఞ'లు చేయుంచి... ఆ ప్రతులను నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు అందించారు. 1978లో చంద్రబాబు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు... వర్సిటీలోని తన మిత్ర బృందమే ప్రచారానికి నేతృత్వం వహించింది. ఎస్వీ యూనివర్సిటీకి చెందిన వందలాదిమంది విద్యార్థులు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు కోసం ప్రచారం చేసి... గెలిపించారు. చంద్రబాబు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన తండ్రి పొట్టేళ్లు అమ్మిన సొమ్ము రూ.60 వేలు ఇచ్చి... 'ఎన్నికల్లో ఖర్చు పెట్టుకో' అని ఇచ్చారట! అప్పటిదాకా అభ్యర్థులు ఇలా ప్రతి ఊరికీ, ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయం ఉండేది కాదు. ఊరి పెద్దలను మాత్రం కలిసి వెళ్లేవారు. తొలిసారిగా చంద్రబాబు... ప్రతి ఇంటి గడపా తొక్కి ఓట్లు అడిగారు.

1950 ఏప్రిల్‌ 20వ తేదీ... అంటే, డెబ్బై అయిదేళ్ల కిందట... ఇదే రోజు! ఖర్జూరనాయుడు, అమ్మణ్నమ్మ దంపతులకు నారా చంద్రబాబు నాయుడు జన్మించారు. ఖర్జూర నాయుడు మహా మొండిఘటం! ఏదైనా అనుకుంటే... అది అయ్యేదాకా విడవని లక్షణం! అమ్మణ్నమ్మ విపరీతమైన కష్టజీవి! ఈ రెండు లక్షణాలను పుణికిపుచ్చుకున్న సంతానం... చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడిది నారావారిపల్లి. తల్లిది... కందులవారిపల్లి. ఇవి రెండూ పక్కపక్క ఊళ్లే. మధ్యలో రెండు ఫర్లాంగుల దూరం అంతే! దీంతో చంద్రబాబు బాల్యమంతా ఈ రెండు గ్రామాల మధ్య తిరిగింది. తోట బావుల్లో ఈతలు, చుట్టు పక్కల ఊళ్లలో జల్లికట్టు పోటీలు, అల్లరి ఆటలు... చంద్రబాబు బాల్యమంతా సందడిగానే గడిచింది. అమ్మమ్మ ఇంటికి అదే పరుగున వెళ్లడం... పొద్దుగూకే సరికి నారావారిపల్లికి చేరడం! ఇదో నిత్యకృత్యం. అప్పట్లో ఖర్జూరనాయుడు ఇల్లు పిల్లలు, బంధువులతోపాటు గొడ్డూగోదతో కళకళలాడేది. పది ఆవులు, గేదెలు, గొర్రెలు, పొట్టేళ్లూ ఉండేవి. 'రెండెకరాలు... రెండెకరాలు' అని రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును ఒక దశలో ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కానీ... అప్పట్లోనే ఖర్జూర నాయుడుకు 15 ఎకరాల పెద్ద సేద్యం. ఇరుగుపొరుగు రైతులు అవసరానికి అడిగితే అప్పు కూడాఇచ్చేవారు. పొలం పనుల్లోనూ చంద్రబాబు చురుగ్గా పాల్గొనేవారు. చెరకు సాగుకు మడక దున్నడం, కోతలయ్యాక వాది కట్టడం, చెరుకు గానుగా ఆడటం ఇలాంటి పనులు ఇష్టంగా చేసేవారు. నారావారిపల్లి దగ్గర్లోనే ఉన్న శేషాపురం బడిలో చంద్రబాబు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నారు. హైస్కూలు... చంద్రగిరిలో! అప్పట్లో ఆరు కిలోమీటర్లు నడిచి... చంద్రగిరి హైస్కూలుకు వెళ్లేవాడు. ఆ తర్వాత తిరుపతిలోని టీపీపీఎం హైస్కూలులో చేరారు. అప్పుడే... వాళ్ల నాన్న ఆయనకు సైకిల్‌ కొనిచ్చారు.

అందరి వాడు..

చంద్రబాబు ఏ వర్గాన్నీ దూరం చేసుకోరు. తాను అందరికీ చెందినవాడిగా ఉండటమే కాదు... అది ప్రజలందరికీ తెలిసేలా కూడా చేస్తారు. ఆయన మంత్రివర్గ కూర్పు, పదవుల పంపిణీ దీనికి నిదర్శనం. చివరికి... ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అటూ ఇటూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కూర్చోబెట్టుకుంటారు. ఇది ఉద్దేశపూర్వకం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే... చదువుకునేటప్పటి నుంచీ ఆయనకు ఇదే అలవాటు. ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు చంద్రబాబు సన్నిహిత మిత్ర బృందంలో తొండవాడ గిరిధర్‌ రెడ్డి, రంగంపేట సుబ్బరామిరెడ్డి, విక్టర్‌, పీఎస్‌ మునిరత్నం, షరీఫ్‌, కరీం... ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉండేవారు. అందరూ మిత్రులు కాకపోవచ్చు. కానీ... శత్రువులు మాత్రం ఉండొద్దని, వీలైనంత వరకు తనవాళ్లుగా చేసుకోవాలన్నది చంద్రబాబు విధానం. ఎప్పుడు, ఎవరితో ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కదా! అందుకే... అందరితో బాగుండాలని భావిస్తారు. అప్పుడూ అంతే, ఇప్పుడూ అంతే! కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. చిన్నస్థాయి వ్యక్తే అయినా, అమెరికా అధ్యక్షుడే అయినా... ఎవరినీ నిర్లక్ష్యం చేయరు. బ్యూరోక్రాట్ల విషయంలో ఇంకా జాగ్రత్తగా, లెక్కప్రకారం వెళతారు. 'ఫలానా అధికారికి అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చారు' అని పైకి అనిపించినప్పటికీ... లోపల మరేదైనా కారణం ఉండే ఉంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి వెళ్లినప్పడు ఆయన కేంద్ర అధికారులతో మాట్లాడేవారు. ఏదో ఒక సమయంలో రాష్ట్రం కోసం పనికిరాకపోతారా... అనేదే ఆయన ఉద్దేశం.

గండాలు దాటుతూ..

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా జరిగిన 'అలిపిరి పేలుడు' ఘటన గురించి అందరికీ తెలుసు! వేంకటేశ్వర స్వామి దయవల్లే బతికానని ఆయన ఎప్పుడూ చెప్పుకొంటూ ఉంటారు. అయితే... బాల్యంలోనూ ఆయన పలు గండాలు దాటి బయటపడ్డారు. ఊహతెలియని వయసులో అమ్మమ్మ గారి ఇంట్లో చాపమీద పడుకుని ఉండగా... ఇంట్లోకి నాగుపాము వచ్చింది. రెండేళ్ల వయసులో చంద్రబాబు నీళ్ల తొట్టిలో పడిపోతే వాళ్ల చిన్నాన్న చూసి బయటికి లాగారు. కొబ్బరి చిప్ప తగిలి ఆయన నొసటన గాయమైన మచ్చ ఇప్పటికీ కనిపిస్తుంది.

ఏడుకొండల వాడా..

చంద్రబాబు ఇష్టదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి! ఇది కొత్తగా వచ్చిన భక్తి కాదు. ఆయన బాల్యం తిరుమల కొండతో ముడిపడింది. శనివారం వచ్చిందంటే చాలు... నారావారి పల్లి నుంచి అడవి మార్గంలో 'గోవిందలు' పెడుతూ బంధువులు స్నేహితులతో కొండకు నడిచి వెళ్లేవాళ్లు.

చేసిన సాయం... చెప్పాలా?

'చంద్రబాబు ఎవరికీ సహాయం చేయడు'... అని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అదే సమయంలో... వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 'దాన కర్ణుడు' అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే... వైఎస్‌ చేసే సహాయం బయటికి తెలుస్తుంది. చంద్రబాబు కుడిచేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియదు. ఆయన తెలియనివ్వడు. విద్యా సంస్థల్లో సీట్లు, ఆస్పత్రి ఖర్చులు, చదువుల కోసం డబ్బులు... ఇలా చంద్రబాబు నుంచి రకరకాలుగా సహాయం పొందిన వారు ఎందరో! విచిత్రం ఏమిటంటే... చంద్రబాబు నుంచి వ్యక్తిగతంగా సహాయం పొందిన వాళ్లు కూడా ఆ విషయాన్ని గట్టిగా చెప్పుకోరు. చెప్పాలని ఆయన కూడా ఆశించరు. ఇక... సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను వైఎ్‌సతో పోల్చితే అనేకరెట్లు ఎక్కువగా చంద్రబాబు మంజూరు చేశారు, చేస్తున్నారు. చివరికి... తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తులు సాయం కోరి వచ్చినా, ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్టీఆర్‌ ట్రస్టు నడిపే విద్యా సంస్థల్లో కార్యకర్తలకు ఉచిత విద్య నుంచి... బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా చికిత్సలు అందించడం వరకు చంద్రబాబు నుంచి సహాయం పొందిన వారు వేలల్లోనే ఉంటారు. అధికార దుర్వినియోగమవుతుందని, తనకు చెడ్డపేరు వస్తుందని ఏమాత్రం అనిపించినా... సాయం చేయరు.

ఆహారం... ఆరోగ్యం!

75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబులో ఏమాత్రం ఉత్సాహం తగ్గకపోవడానికి కారణం... క్రమశిక్షణతో కూడిన జీవన శైలి! తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. యోగా చేస్తారు. ఆహారం విషయంలో అత్యంత కఠినంగా ఉంటారు. వైద్యులు ఎంత సూచిస్తారో అంతే తింటారు. ఈ వయసులోనూ ఎంతసేపైనా నిల్చుని పనిచేయగలగడం ఆయన ప్రత్యేకత. జనంలోకి వెళ్లినప్పుడు, కార్యకర్తలను కలిసినప్పుడు అలా నిలబడే అందరితో ఓపిగ్గా ఫొటోలు దిగడం ఆయనకు అలవాటు. ఆమధ్య తిరుమల కొండకు చకచకా నడిచి వెళ్లారు. 'చంద్రబాబుకు అనారోగ్యం, అస్వస్థత' అన్న వార్తలు విన్న సందర్భాలు అత్యంత అరుదు! ఇతర రాజకీయ నాయకుల్లాగా తరచూ పర్యటనలకు వెళ్లే అలవాటు లేదు. ఏడాదికోసారి మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ఎటైనా వెళ్లేవారు. మనవడు దేవాన్ష్‌ పుట్టాక ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లడం కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.

Comments

-Advertisement-