TTD: శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం
TTD: శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం
రూ.కోటి మంజూరు చేసిన టీటీడీ పాలకమండలి
కృతజ్ఞతలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
తిరుమల, (పీపుల్స్ మోటివేషన్):-
తిరుపతిలోని శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలారావు, ఏఈవో, బోర్డు సభ్యులను సోమవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గతంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సుకు టీటీడీ నిధులు కేటాయించేదని, తద్వారా టీటీడీ అనుబంధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, క్రీడాకారులు, స్థానికులు కాంప్లెక్సులోని క్రీడావసతులను వినియోగించుకునేవారన్నారు. శాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడుని కలిసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఇదే విషయాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టిలో పెట్టామని, సీఎం ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర క్రీడాభివృద్ధికి టీటీడీ పాలకమండలి సహకరించడం సంతోషకరమన్నారు. తిరుపతి క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించంతోపాటు క్రీడల్లో వారు మరింత రాణించేందుకు టీటీడీ కేటాయించిన నిధులు దోహదపడతాయన్నారు. తిరుపతి క్రీడాకారులు కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడుకు శాప్ ఛైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.