TGOBMMS: రాజీవ్ యువ వికాసం పథకం పూర్తి సమాచారం.. అర్హతలు, దరఖాస్తు విధానం
TGOBMMS: రాజీవ్ యువ వికాసం పథకం పూర్తి సమాచారం.. అర్హతలు, దరఖాస్తు విధానం
• రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడీ
• రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ
• రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ
• గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.50 లక్షలు
• అర్బన్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 లక్షలు
• నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21-55 ఏండ్ల లోపు వారు అర్హులు
• అగ్రికల్చర్ దరఖాస్తుదారులకు 60 ఏండ్లు ఏజ్ లిమిట్
• రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం
• ఐదేళ్ల కాలానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి
• పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ
రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి వెంచర్లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకం 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకం వ్యవస్థాపకత మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీలతో పాటు ₹3 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది. లబ్ధిదారుల అర్హతలు, వయో పరిమితి, వార్షికాదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. రూ.50 వేలలోపు యూనిట్‌కు 100 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మిగతా యూనిట్లకు కూడా 70 నుంచి 90 శాతం వరకు రాయితీలను ప్రకటించింది. అంతేకాదు.. రాయితీ మొత్తం పోను.. మిగతాదాన్ని లబ్ధిదారుడి వాటాగా కాకుండా.. బ్యాంకు రుణంగా అందజేయనున్నట్లు వెల్లడించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటికే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఈ ప్రక్రియ ఏప్రిల్ 5 వర కు కొనసాగుతుందని, అదే నెల 6 నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని వివరించింది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొంది. ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపింది.
రాయితీలు ఇలా..
యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది. రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా ఉండదు
రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడీ
రూ.లక్ష లోపు రుణం తీసుకుంటే 90 వేలు (10%) మాఫీ
రూ.2 లక్షల లోపు లోన్ తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ
అర్హతలు ఇలా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ల సభ్యు లు, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్లు, ఈబీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ఠ వయోపరిమితి 60 సంవత్సరాలు. దరఖాస్తుదారులకు రేషన్‌కార్డు తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి. ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. రవాణా రంగానికి సంబంధించిన యూనిట్‌ను ఏర్పాటు చేసేవారికి డ్రైవింగ్ లైసెన్సు, వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదార్ పాస్‌పుస్తకం తప్పనిసరి. ది వ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
వారికి ప్రాధాన్యత..
మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు మొత్తం లక్ష్యంలో 25 శాతం ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యతనిస్తారు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు. అంటే.. ఐదేళ్ల వరకు ఆ కుటుంబానికి చెందిన ఇతరులు ఈ పథకానికి అనర్హులు.
ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తూ..
ఈ పథకానికి ఈనెల 17 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చేనెల 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అనుమానులు ఉంటే.. నివృత్తి చేయడానికి హెల్ప్‌డెస్క్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, అర్హత పత్రాలతోపాటు హార్డ్ కాపీని సంబంధిత అధికారులకు అందజేయాలి. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాల్లో, నగరాల్లో ఉండేవారు నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తు కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడు వు ముగిసిన తర్వాతి రోజు నుంచే.. అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 20 వరకు నెలన్నరపాటు మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఒకే గ్రామంలో బహుళ స్వయం ఉపాధి పథకాలకు అవకాశం ఉండదు. అర్హతకు సంబంధించిన స్ర్కూటినీ పూర్తయ్యాక.. ఎంపిక చేసిన దరఖాస్తులను జిల్లా స్థాయి పరిశీలనకు పంపుతారు. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో పరిశీల ఉంటుంది. ఆ తర్వా త ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపుతారు. మంత్రి ఆమోదం పొంది న దరఖాస్తులను ఈ పథకంలో లబ్ధికి ఎంపిక చేస్తా రు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధిలో వారం నుంచి పక్షం రోజుల పాటు శిక్షణనిస్తారు. రాయితీ విడుదల అయిన 16 రోజుల్లో లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
కమిటీ చైర్మన్‌గా కలెక్టర్..
జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్డీయే పీడీ ఉంటారు. సభ్యులుగా.. అదనపు కలెక్టర్, పరిశ్రమల శాఖ జీఎం, ఎస్సీ/బీసీ కార్పొరేషన్‌ల ఈడీ, జిల్లా మైనార్టీ సంక్షే మ అధికారి, దివ్యాంగుల శాఖ ఏడీ, డబ్ల్యూ అండ్ సీడీ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీటీడీవో, ఎల్‌డీఎంలు ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో/పురపాలక కమిషనర్, మునిసిపల్ కార్పొరేషన్‌లో జోనల్ స్థాయి అధికారి కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన మండల ప్రత్యేక అధికారి, ఆ ప్రాంతంలోని బ్యాంక్ మేనేజర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల నుంచి ఒక ప్రతినిధి, డీఆర్‌డీఏ నుంచి ఒక సభ్యుడు ఈ కమిటీలో ఉంటారు.