Mana Mitra: ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నెంబరు సేవ్ చేయించండి
Mana Mitra: ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నెంబరు సేవ్ చేయించండి
ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి మనమిత్ర
వాట్సాప్ గవర్నెన్స్ వాడకంపై ప్రతి పౌరుడికి అవగాహన కార్యక్రమం
దీనిపైన కలెక్టర్లు అందరూ చొరవ చూపాలి
ప్రస్తుతం 210 సేవలు అందుబాటులో
మరో పక్షం రోజుల్లో 350 సేవలు అందిస్తాం..
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయబోతున్నాం
-ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడి
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- రాష్ట్రంలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగం, వాడకంపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికీ మనమిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనమిత్ర - వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పిస్తారని, అలాగే ఆ ఇంట్లో ఉన్నవారందరి స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009 సేవ్ చేసి, దాని ద్వారా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న సేవలు ఎలా పొందాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ అమలు గురించి వివరించారు. పౌరులెవ్వరూ కూడా ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోనులో ఉన్న వాట్సాప్ ద్వారానే సులభంగా పొందే అవకాశం కల్పించాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్‌ను అమల్లోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం 210 సేవలు కల్పిస్తున్నామని, మరో వారంలో రోజుల్లో ఈ సంఖ్య 250కి పెంచుతున్నామనమని, పక్షం రోజుల్లో 350 సేవలు అందించనున్నామన్నారు. రాబోయే రోజుల్లో దాదాపు 1000 రకాల సేవలను పౌరులకు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. పౌరులకు కావాల్సిన ధృవపత్రాలు కూడా వాట్సాప్ ద్వారా అందించనున్నామన్నారు. ఆధార్ అనుసంధానం, డిజీలాకర్ల ద్వారా తమ ధృవపత్రాలను ఏ కార్యాలయానికి వెళ్లకుండా కేవలం తమ ఫోనులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స మనమిత్ర ద్వారా ఇట్టే క్షణాల్లో పొందే సదుపాయం దీనిద్వారా కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ సర్టిఫికెట్ చట్టబద్ధమేనని అన్నారు. అధికారులు కూడా పౌరులు డిజిటల్ సర్టిఫికెట్లను చూపిస్తే మళ్లీ ఫిజికల్ సర్టిఫికెట్లు సమర్పించాలనే ఒత్తిడి చేసే పరిస్థితి ఉండదన్నారు. పౌరుడు సమర్పించిన డిజిటల్ సర్టిఫికెట్ అసలైనదా కాదా అనేది క్యూఆర్ కోడ్ ద్వారా తనిఖీ చేస్తే ఇట్టే తెలిసిపోతుందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ పౌరులు పొందుపరిస్తే మళ్లీ అధికారులు ఫిజికల్ సర్టిఫికెట్ సమర్పించమని ఒత్తిడి చేయరాదని కోరారు.
9552300009కి ప్రచారం కల్పించండి
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009కు జిల్లాల్లో, క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని భాస్కర్ కాటంనేని జిల్లా కలెక్టర్లను కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కూడా దీనిపైన అవగాహన కల్పించాలన్నారు. ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పించాలన్నారు. జిల్లాల్లో దీనిపైన ఒక నిరంతర శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ శాఖలు కూడా తాము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించే సేవల్లో ఖచ్చితత్వం పాటించాలన్నారు. వర్క్ ఫ్రం హోం సర్వే కార్యక్రమం కూడా దాదాపుగా పూర్తి అయిందన్నారు. ఈ సర్వేలో ఏఏ విద్యార్హతలు ఉన్నాయనేది వర్గీకరించి దాని ప్రకారం వారికున్న నైపుణ్యాల స్థాయి ఆధారంగా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాల్లో నిర్మిస్తున్న ఆర్టీజీ భవనాల పరిరక్షణకు కూడా కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.