Consumer rights: వినియోగదారుల హక్కులకు భరోసా కల్పిస్తాం
Consumer rights: వినియోగదారుల హక్కులకు భరోసా కల్పిస్తాం
విజయవాడలో కొత్త అదనపు వినియోగదారుల ఫోరం బెంచ్ ప్రారంభం
విస్తృతంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తాం
-నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి
విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-
వినియోగదారుల హక్కులకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు సెంటర్ లో వినియోగదారుల కమిషన్ రెండో అదనపు బెంచ్ (A New Additional District Consumer Redressal Commission) ను సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ భవనం రెండో అంతస్థులో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, ఫోరం చైర్మన్, బెజవాడ బార్ అసోషియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యతలేని సరుకులు, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతూ వినియోగదారులను మోసం చేసే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో వినియోగదారుల హక్కులకు వేదికగా ఈ అదనపు బెంచ్ పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా వినియోగదారులకు తగిన సమాచారం అందించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల ఫోరం కేసుల పరిష్కారం మరియు వినియోగదారులకు పరిహారం అందించడంలో చాలా ముందుందన్నారు.
రాష్ట్రంలో 1,33,736 కేసులు వినియోగదారుల ఫోరంలో నమోదు చేస్తే చాలా వరకు వాటిని పరష్కరించడం జరిగిందన్నారు. వినియోగదారుల జిల్లా ఫోరం లో రూ. 50 లక్షల విలువ వరకు, రాష్ట్ర ఫోరంలో రూ. 2 కోట్ల విలువ వరకు కేసులు నమోదు చేయవచ్చన్నారు. వినియోగదారుడే రాజు అని, ప్రజలు ఎవర్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్నారు. దేశంలో మొదటిసారి రాష్ట్రంలో డిజిటల్ క్యాంపెయిన్ ను స్కూల్స్, కాలేజీల్లో ప్రచారం చేస్తామన్నారు. వినియోగదారుల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. మచిలీపట్నం వెళ్లాలంటే వినియోగదారులకు గతంలో చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు. ఇప్పుడు విజయవాడలో వినియోగదారుల హక్కుల కోసం అదనపు బెంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వినియోగదారుల హక్కులను కాపాడటంలో ముందుంటుందన్నారు.
కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, విజయవాడ వినియోగదారుల అదనపు బెంచ్ ఫోరం ఛైర్మన్ సీహెచ్. కిషోర్, సభ్యులు కే.శశికళ, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివ రామ ప్రసాద్, అధ్యక్షులు కె. చంద్రమౌళి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుల సీహెచ్. అజయ్ కుమార్, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోము కృష్ణ మూర్తి, తదితరలు పాల్గొన్నారు.