తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం అనే మాయలో పడకండి
తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం అనే మాయలో పడకండి – క్రికెట్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి
-అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
ఐపీఎల్, టి20 క్రికెట్ మ్యాచ్ లను ఆసరాగా తీసుకొని, అమాయక ప్రజలను మోసగించేందుకు క్రికెట్ బెట్టింగ్ ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయన్నారు. "తక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభాలు సాధించవచ్చు" అనే ఆశ చూపిస్తూ ఈ ముఠాలు ఎందరో యువతను, సామాన్యులను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయి.
ఇటీవల క్రికెట్ బెట్టింగ్ యాప్స్ వల్ల, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో అనేకమంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చట్టవిరుద్ధమైన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావంతో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అనకాపల్లి జిల్లా పోలీసులు ఇటువంటి క్రికెట్ బెట్టింగ్ ముఠాలను అణచివేసేందుకు ప్రజలు సహకరించాలని, సమాచారం స్థానిక పోలీసులకు గాని లేదా డయల్ 100/112 అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు.
ముందుగా చిన్న మొత్తంలో గెలిచేలా చేసి నమ్మకాన్ని పెంచుతారు. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఓడిపోయాక డబ్బు తిరిగి పొందేందుకు మరింత పెట్టుబడి పెట్టాలని మభ్యపెడతారు. అప్పులు తీసుకునే స్థితికి వచ్చి, తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసేవరకు వదలరు. పరిమితి దాటి అప్పులు పెరిగితే బెట్టింగ్ ముఠాలు, లోన్ యాప్ ప్రతినిధులు కుటుంబసభ్యులను వేధిస్తారు. తీవ్ర ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి చేరుకుంటున్నారు. నకిలీ అకౌంట్లు, నకిలీ యూపీఐ లావాదేవీలు అసలు నిర్వాహకులు కనిపించరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లను ఉపయోగించి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తారు. ఇతరుల ఖాతాలను ఉపయోగించి డబ్బు మళ్లింపు చేయడం చట్టపరంగా నేరం. చట్టవిరుద్ధమైన మార్గాల్లో నడుస్తున్న యాప్స్ వెనక పెద్ద ముఠాలు ఉన్నాయని గుర్తించాలన్నారు. ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు కష్టపడి సంపాదించిందే నిజమైన సంపాదన. బెట్టింగ్‌లో పెట్టిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం తక్కువన్నారు. ఓడిపోయినవారు మళ్లీ అదే తప్పు చేయకుండా ఉండలేరు, ఇది వ్యసనంగా మారుతుంది. ఆర్థిక నష్టమే కాదు, కుటుంబ పరువు పోయేలా బెట్టింగ్ ముఠాలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులను ఒంటరిగా మారుస్తూ మరణం వైపు నడిపిస్తుంది.
"ఈజీ మనీ" మాయలో పడకండి శ్రమించిందే శాశ్వత సంపాదనన్నారు. అప్పుల కోసం అనాగరిక మార్గాలను ఆశ్రయించకండి చట్టబద్ధమైన మార్గాలను వినియోగించుకోండి.
సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు అవి చాలా వరకు మోసపూరితమైన లింకులే, ప్రభుత్వ అనుమతి లేని బెట్టింగ్ యాప్స్ వాడడం నేరం, చట్ట ప్రకారం శిక్షార్హం. మీ పిల్లలు, స్నేహితులు బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే వారికి అవగాహన కల్పించండి. నిజమైన సంపాదన మీ శ్రమ, నైపుణ్యం, తెలివితేటలపై ఆధారపడి ఉంటుందన్నారు. బెట్టింగ్ మాయలో పడకుండా, చట్టబద్ధమైన మార్గాల్లో జీవనం సాగించండి. మీ కుటుంబాన్ని, భవిష్యత్తును కాపాడుకోవడానికి బెట్టింగ్ యాప్స్‌కు వీలైనంత దూరంగా ఉండి, మీ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు.
అనకాపల్లి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు తావు లేదు. ప్రజలను మోసం చేసే వారిని ఉపేక్షించబోమని, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన, ప్రోత్సహించిన వారిపై ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. యువత ఈ మాయలో పడకుండా, తల్లిదండ్రుల ఆశలను నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.