పిల్లల అక్రమ రవాణా కట్టడికి కఠిన చర్యలు..
పిల్లల అక్రమ రవాణా కట్టడికి కఠిన చర్యలు..
• ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు.• మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1098 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు.
• మిషన్ వాత్సల్య పోర్టల్' తో 'ట్రాక్ చైల్డ్ పోర్టల్' అనుసంధానం.
• ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి
దిల్లీ /ఏలూరు, మార్చి 25: ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా గత పదేళ్లలో పిల్లల అదృశ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, పిల్లలను అపహరించిన దోషులకు శిక్షలు విధించడం, ఆచూకీ లభించిన పిల్లలకు పునరావాసం, సహాయక చర్యలపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన నేరాలపై గణాంకాల వివరాలు సేకరిస్తుందని, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద శాంతిభద్రతల పరిరక్షణ, పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని స్థాయిలలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020లో నేషనల్ లెవల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ను ప్రారంభించిందని, నేరాలు, నేరస్తుల సమాచారాన్ని 24x7 ప్రాతిపదికన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా సేకరించి, ముఖ్యమైన నేరాల సమాచారాన్ని అంతర రాష్ట్రాల మధ్య సమన్వయానికి అనుమతిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను ఎదుర్కోవటానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ Further సలహాలు జారీ చేస్తోందని, ఈ సలహాలు వెబ్‌సైట్ www.mha.gov.inలో అందుబాటులో ఉన్నాయని, అదృశ్యమైన, ఆచూకీ లభించిన పిల్లల కేసులను పరిష్కరించడంలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోలీసులు, శిశు సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కు సాయం అందిస్తుందని, అదృశ్యమైన పిల్లల కేసుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి)ని జారీ చేసిందని, కేసుల నమోదు విషయంలో మార్గదర్శకాలను రూపొందించడం, అదృశ్యమైన పిల్లల సమస్యలపై తక్షణం స్పందించడమే లక్ష్యంగా ఎస్ఓపి పనిచేస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
అదృశ్యమైన నిరుపేద పిల్లలకు అత్యవసర సేవలు అందించడం కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ నంబర్ 1098 24/7 పని చేస్తుందని, తక్షణ సాయం అందించడానికి ప్రధాన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల వద్ద రైల్వే చైల్డ్ లైన్‌లు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ "ట్రాక్ చైల్డ్ పోర్టల్"ను కూడా ప్రారంభించిందని, అదృశ్యమైన, ఆచూకీ లభించిన పిల్లలను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని, పోలీసు స్టేషన్‌లు, జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లకు లాగిన్‌లు ఇవ్వడం వల్ల అదృశ్యమైన పిల్లల గురించి సమాచారాన్ని పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారని, ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లోని 'ఖోయా-పాయా'లో సమాచారం త్వరగా తెలుసుకునే వీలుందని, 'ట్రాక్‌చైల్డ్ పోర్టల్' 2024 సెప్టెంబర్ 2 నుంచి 'మిషన్ వాత్సల్య పోర్టల్'తో అనుసంధానించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 'మిషన్ వాత్సల్య' పథకాన్ని అమలు చేస్తుందని, భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్) 2023లోని సెక్షన్ 137 (2) ప్రకారం పిల్లలను కిడ్నాప్ చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా, భిక్షాటన కోసం పిల్లలను కిడ్నాప్ చేస్తే సెక్షన్ 139 (1) ప్రకారం పదేళ్ల కంటే తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష, లేదా జీవితాంతం జైలు శిక్ష విధించవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
మిషన్ శక్తి కింద మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 'శక్తి సదన్' ఇంటిగ్రేటెడ్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ హోమ్‌ని కలిగి ఉందని, ఆపదలో ఉన్న మహిళలకు, అక్రమ రవాణా బాధితులైన వారికి 'శక్తి సదన్' ఆశ్రయం కల్పిస్తుందని, అదేవిధంగా 'మిషన్ వాత్సల్య' కింద చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లు అక్రమ రవాణా చేయబడిన పిల్లల సహాయ, పునరావాస అవసరాలను చూసుకుంటాయని కేంద్ర మంత్రి తెలిపారు.
నేషనల్ డేటాబేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెండర్స్, క్రైమ్ హిస్టరీ, వ్యక్తిగత వివరాలు మొదలైన వాటిని అందించే ట్రాఫికర్ పోర్ట్‌ఫోలియోను శోధించడానికి 'లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సులభతరం చేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
2016 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల వారీగా అదృశ్యమైన పిల్లల వివరాలను విడుదల తెలియజేయగా, 2022లో ఏపీలో 4,813 మంది పిల్లలు అదృశ్యం కాగా, 4,192 మంది పిల్లల ఆచూకీ కనిపెట్టారు. దేశవ్యాప్తంగా బీహార్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, దిల్లీతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పిల్లల అదృశ్యం కేసులు తక్కువగా ఉన్నట్లు కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.