చెక్ డ్యామ్‌లన్నీ మరమ్మతులు చేసుకోవాలి
చెక్ డ్యామ్‌లన్నీ మరమ్మతులు చేసుకోవాలి
నరేగా పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ మూడు నెలలు చాలా కీలకం
పల్లెల్లో వలసలకు తావు లేకుండా పనులు కల్పించడం
కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వినతి
అమరావతి: ఈ వేసవిలోపే రాష్ట్రంలోని అన్ని చెక్ డ్యామ్‌లను రిపేర్లు పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా నరేగా పథకంపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పైన ఆయన మాట్లాడుతూ వేసవి పూర్తిఅయ్యేలోపు చెక్ డ్యామ్‌లన్నీ కూడా రిపేర్లు పూర్తి చేయాలని, నరేగా నిధులు సక్రమంగా వినియోగంచుకుని పనులు చేయాలన్నారు. అటవీశాఖ కూడా నరేగా పథకం వినియోగించుకుని పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని కోరారు. నరేగా పథకం బాగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు ఈ పథకం అమలుపైన దృష్టి సారించి ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ పని రోజులు కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ నరేగా పథకం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ వేసవి కాలం చాలా కీలకమైందన్నారు. గ్రామాల్లో ప్రజలు పనుల కోసం వలసలు వెళ్లకుండా నిరోధించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సాధ్యమైనంత ఎక్కువ పని రోజులు ప్రజలకు ఈ పథకంలో కల్పించి వారు ఇతర ప్రాంతాలకు వసల పోకుండా నిరోధించాలన్నారు. నరేగాకు నిధుల కొరత లేదని, ఆయా గ్రామాల్లో తగినన్ని పనులు గుర్తించేలా స్థానిక యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలన్నారు. గత ఏడదితో పోల్చితే ఈ ఏడాది నరేగాలో పనులు పురోగతి సాధించిందని వివరించారు. అన్ని పంచాయతీల్లో పనులు ఆరంభించారని, ఎక్కడైనా ఇంకా పనులు ప్రారంభని పంచాయతీలుంటే గుర్తించి అక్కడ కూడా నరేగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నరేగా ద్వారా 4 వేల కిలోమీటర్ల రహదార్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 1.55 లక్షల పంట కుంటలు తవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే 20లక్షల హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. పల్లె పుష్కరణి కార్యక్రమం కింద 1000 చెరువులను అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నరేగా కింద పనులు కల్పించలేమనే అపోహ కొంతమంది అధికారుల్లో ఉన్నట్లు తమకు తెలిసిందని, అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా నరేగా కింద పనులు కల్పించవచ్చని, కలెక్టర్లు దీనిపైన దృష్టి పెట్టాలని కోరారు.