APBRAGCET: ఐదు, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
APBRAGCET: ఐదు, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
• 2025-26 విద్యా సంవత్సరానికి చేరికలు..
• ఐదు, జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
• మార్చి 06వ తేదీ వరకు గడువు..
• సమీపంలోని గురుకుల పాఠశాలల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు..
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధికి కార్పొరేట్ తరహాలో బోధించేందుకు గానూ 2025-26 ఏడాదికి గానూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరికలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయిదో తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతిని పొందే అవకాశం ఉంటుంది.
అర్హతలు:-
• ఐదో తరగతిలో చేరికకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించాలి.
• ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ (బీసీ-సి) విద్యార్థులు 2014 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.
• జూనియర్ ఇంటర్‌లో చేరికలకు 2024-25 ఏడాదిలో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.
• ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థి తల్లిదండ్రుల ఏడాది ఆదాయం రూ.లక్షకు మించకూడదు
• ఐదో తరగతికి https://apbragcet.apcfss.in/Sw-index?id=5 ద్వారా దరఖాస్తులు చేయాలి.
• ఇంటర్‌కు సంబంధించి https://apbragcet.apcfss.in/Sw-index?id=11 ద్వారా దరఖాస్తులు చేయాలి.
• ఒక్కో పాఠశాలలో ఐదో తరగతికి 80 సీట్లు, కళాశాలల్లో జూనియర్ ఇంటర్‌కు 80 సీట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
• జూనియర్ ఇంటర్‌లో డోన్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల మినహాయిస్తే 14 కళాశాలల్లో 1,120 సీట్లు, ఐదో తరగతికి సంబంధించి 15 పాఠశాలల్లో 1,200సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
• మార్చి 06 చివరి తేదీ కాగా ఈ లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇవి తప్పనిసరిగా ఉండాలి:-
• విద్యార్థి వివరాలు తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్‌కార్డు, పూర్వ తరగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
• మొబైల్ నంబరు తప్పు లేకుండా నమోదు చేయాలి.
• ప్రతిభా పరీక్షలో మెరిట్ జాబితా ప్రకారం నేరుగా కేంద్ర కార్యాలయం నుంచి సీటు కేటాయింపు ఉంటుంది.
ఉచితంగా దరఖాస్తు:-
ఏటా ఐదో తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీవో డా. ఐ. శ్రీదేవి తెలిపారు. బయట దరఖాస్తు చేయించుకుంటే డబ్బులు చెల్లించాలని, మీ సమీపంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లోకి వెళ్లి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని డీసీవో తెలిపారు.
ఐఐటీ, నీట్ అకాడమీ శిక్షణతో కూడిన ఇంటర్ ప్రవేశాలకు మార్చి ఆరో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15 వరకు డా. బిఆర్ గురుకుల బాలుర, బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని అరికెర, సి.బెళగల్, చిన్నటేకూరు, నంద్యాల జిల్లాలో జూపాడుబంగ్లా, డోన్ ప్రాంతాల్లో బాలుర ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో డోన్, ఆళ్లగడ్డ రెగ్యులర్, ఆళ్లగడ్డ ఆర్‌పిఆర్‌పిఆర్, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లాలో కంబాలపాడు, వెల్దుర్తి, దిన్నెదేవరపాడు, లక్ష్మాపురం ప్రాంతాల్లో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 8,575 మంది చదువుతున్నారు. చిన్నటేకూరులో సైతం బాలుర ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఐఐటీ, నీట్‌నకు అకాడమీ కోచింగ్ ఇస్తారు. ఈ గురుకులంలో 2023-24 ఏడాదిలో మెడికల్ సీట్లకు గానూ 60 మంది రాస్తే 20 మందికి, ఐఐటీ, ఎన్‌ఐటీలలో 41 మందికి సీట్లు వచ్చాయని డీసీవో శ్రీదేవి తెలిపారు.