Whats app: 161 రకాల పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఎలా పొందాలో తెెలుసా?
Whats app: 161 రకాల పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఎలా పొందాలో తెెలుసా?
• '' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
• ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్..
• ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే వాట్సాప్ గవర్నెన్స్ అని వ్యాఖ్య..
• మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు..
• దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 కేటాయింపు..
‘మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో ఈరోజు మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను. ఈ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తోంది, క్యాబ్ వస్తుంది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా. అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించడం జరుగుతోంది అని మంత్రి లోకేశ్ అన్నారు.
ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే వాట్సాప్ గవర్నెన్స్
యువగళం పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఉదయం బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి మళ్లీ తిరిగి బస్సు ఎక్కేవరకు ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో ఉన్నా. వారి సమస్యలు విన్నా. రైతులు, మహిళలు, విద్యార్థులు, కులవృత్తుల వారిని కలవడం జరిగింది. వారంతా ఒక్కటే అడిగారు.. కుల ధృవీకరణ పత్రం ఇన్నిసార్లు ఎందుకు తీసుకోవాలి అని. ఆదాయ ధృవపత్రం కోసం మళ్లీ అధికారుల వద్దకు ఎందుకు వెళ్లాలని అడిగారు. పవర్ బిల్లు చెల్లించాలంటే ఎందుకు సీమ్ లెస్ గా చెల్లించలేకపోతున్నాం? బస్సు ఎక్కిన తర్వాతే ఎందుకు టికెట్ తీసుకోవాలి? ముందే తీసుకోకూడదా? అని పదేపదే నన్ను అడిగారు.
గత ఐదేళ్ల పాలనలో సర్టిఫికెట్లు రానివ్వకుండా చేశారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి నాటి ప్రభుత్వం కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు. వ్యవస్థలో లోపాలను సరిచేయాలని భావించా. ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. ప్రతి ఇంట్లో, జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది. 60 శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వారంతా వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. వాట్సాప్ తో వర్క్ చేయాలని యువగళం పాదయాత్ర సమయంలోనే అనుకున్నా.
దీంతో మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్ ఫాం ద్వారా తీసుకురాలేదు. ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడా లేదు. మీరు చేయగలుగుతారా? అని అడిగారు. గతేడాది అక్టోబర్ 22న ఢిల్లీలో మెటా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ ను స్వీకరించాను. డిసెంబర్ నాటికి లాంఛ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంఓయూ జరిగిన మూడు నెలల 9 రోజుల తర్వాత లాంఛ్ చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు
వాట్సాప్ గవర్నెన్స్ కు 36 శాఖలను అనుసంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్. రియల్ టైంలో ధృవపత్రాలు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్ సైట్ కు ఆ లింక్ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు.
బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్ సెలెక్షన్ ద్వారా రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సర్వీసులతో పాటు అనేక సర్వీసులు తీసుకువచ్చాం. రెండో దశలో ఏఐ బాట్, వాయిస్ ద్వారా కూడా అమలు చేస్తాం. ప్రపంచంలోనే వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనది. దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లోటుపాట్లు సరిచేసుకుని మరింత మెరుగ్గా దీనిని తీర్చిదిద్దుతాం.
రియల్ టైం గవర్నెన్స్ లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తున్నాం. డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్ లెస్ సర్వీసెస్ అందిస్తాం. గత మూడు నెలలుగా మా టీం అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా టెస్టింగ్ చేస్తున్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం. ఆరు నెలల్లో ఐడియల్ ప్రొడక్ట్ గా తీర్చిదిద్దుతాం. అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా. ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్య దేవనాథన్ మాట్లాడుతూ.. ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది. 'మన మిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 'మన మిత్ర' ద్వారా 161 పౌర సేవలను ప్రతి ఒక్కరికీ అందిస్తాం. ప్రజలు సులభంగా వినియోగించేలా వాట్సాప్ గవర్నెన్స్ ను రూపొందించాం. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం చాలా కృషిచేశామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
వాట్సాప్ డైరెక్టర్, ఇండియా హెడ్ రవి గార్గ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్ ప్లాట్ ఫామ్ పై అన్ని రకాల సేవలు అందించడం ఎక్కడా లేదు. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. హాయ్ అని టైప్ చేయడం ద్వారా ప్రజలు సులభంగా పౌరసేవలను పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం 161 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఆర్టీజీఎస్ సీఈవో కె. దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
సేవలు ఇలా పొందండి..
• మొదటి విడతలో విద్యుత్తు, ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖలతోపాటు వినతులు ఇచ్చేందుకు సదుపాయాన్ని కల్పించారు.
• వాట్సప్ లో ఈ సంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపించాలి.
• ఆ తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది. 'సేవను ఎంచుకోండి' అని కనిపిస్తుంది.
• సేవను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలు కనిపిస్తాయి. అవసరమైన సేవను ఎంచుకోవాలి.
• ఉదాహరణకు రెవెన్యూ శాఖను ఎంచుకుంటే ఓబీసీ, వివాహ ధ్రువీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, మరెన్నో సేవలు పొందడానికి క్లిక్ చేయండి అని వస్తుంది.
• ఆ సేవల్లో ఈడబ్ల్యూఎస్ ఎంపిక చేసుకుంటే ఆధార్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి.
• రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల రికార్డులు, సర్టిఫికెట్లు పొందొచ్చు.
• ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, రద్దు, ప్రయాణం రిమైండర్ సేవలు అందుతాయి.
• ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు.
• ద్రువపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తు పరిస్థితిని తెలుసుకోవచ్చు.
• విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను చెల్లించొచ్చు.