Vizag Steel: విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీ కేంద్రం అధికారిక ప్రకటన విడుదల
Vizag Steel: విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీ కేంద్రం అధికారిక ప్రకటన విడుదల
>> విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం..
>> నేడు అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..
>> కేంద్రం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
>> నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం..
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజి ఇవ్వాలని నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడంతో తెలిసిందే. ఈ క్రమంలో, కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బేషరతుగా ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ప్రధాని మోదీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు.
ప్రకటించిన ప్యాకేజీలో... డైరెక్ట్ ఈక్విటీ కింద కింద రూ.10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140 కోట్లు కేటాయించారని వివరించారు. ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయి ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ ఓ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.