Rythu bharosa Guidelines: రైతులకు గుడ్ న్యూస్.. తెలుగులో రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
Rythu bharosa Guidelines: రైతులకు గుడ్ న్యూస్.. తెలుగులో రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
>> తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం..
>> జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు..
>> పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు..
>> డీబీటీ పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం..
రైతు భరోసా పథకిం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది.
ఎకరాకు రూ.12వేలు పెంపు..
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపింది.