రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pawan Kalyan: ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Pawan Kalyan: ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం

• ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోంది

• ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము

• ఒకేసారి రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి

• ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు

• మోదీ నిర్దేశకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తాం

• మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను ఏకతాటిపై నడిపిస్తున్నారు

• విశాఖపట్నం బహిరంగ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan

'అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి, అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయించడానికి అడుగులు వేస్తున్నాం. దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి. ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ'ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2.08 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ "సదుద్దేశం.. సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక సదాశయం.. సత్సంకల్పంతో ఇంకొకకరు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజలతో మమేకమై వారందర్నీ ఏకతాటిపై నడిపిస్తే అది ఆత్మ నిర్భర్ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజలకు వారి పరిసరాల శుభ్రత, బాధ్యత తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్యసాహసాలు నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారత్ అవుతుంది. అది ఒక రోజున అఖంఢ భారత్ గా వర్దిల్లుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుధైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ.. ఆ క్రమంలో ఎదురైన ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని నవ్వూతూ స్వీకరిస్తూ.. వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ కి నా తరఫున, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నమస్కారాలు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను అభివృద్ధిపదంలో నడిపిస్తున్న దార్శనికులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నమస్కారాలు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టిన ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు. నిలబడ్డారు. అలా నిలబడినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఈ రోజున ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు మొత్తం కలిపి రాష్ట్రానికి రూ. 2 లక్షల పది వేల కోట్ల పెట్టుబడులు, ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 

Pawan Kalyan Chandra Babu Naidu Narendra Modi

Pawan Kalyan Chandra Babu Naidu Narendra Modi

• అభివృద్ధిలో అందరికీ సమాన వాటా మోదీ సంకల్పం

అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా.. నమ్మకం.. ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి. 70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద ఈ రోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుండడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజు ఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు. 

Pawan Kalyan Chandra Babu Naidu Narendra Modi

• రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం

ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకొనేలా చంద్రబాబునాయుడు నాయకత్వంలో, ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు, సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వాములవుతాం. ప్రధాన మంత్రిగారికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ. రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి, సమర్ధవంతులైన చంద్రబాబు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ కి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను" అన్నారు.

Comments

-Advertisement-