Good Samaritan: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి రూ.25 వేలు బహుమతి.. ‘గుడ్ సమరిటన్ స్కీం’ వివరాలు!
Good Samaritan: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి రూ.25 వేలు బహుమతి.. ‘గుడ్ సమరిటన్ స్కీం’ వివరాలు!
• ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ‘గుడ్ సమరిటన్ స్కీం’..
• నాలుగేళ్ల కిందట రూ.5 వేల రివార్డుతో పథకం ప్రారంభం..
• తాజాగా బహుమతి మొత్తాన్ని పాతిక వేలకు పెంచిన ప్రభుత్వం..
రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు సాయం చేయడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. బాధితులను కాపాడాలని చూస్తే పోలీసులు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతలా అవుతుందని వెనకాడుతుంటారు. అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు. అంబులెన్స్ వచ్చే వరకూ చూస్తూ నిలబడతారే తప్ప దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకురారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే, ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసుల్లో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే రూ.25 వేల బహుమతి అందుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్ స్కీం’ తెచ్చిందని వివరించారు.
ఏంటీ ఈ పథకం..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చనిపోతున్న వారిలో చాలామంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారేనని వైద్యులు చెబుతున్నారు. రక్తమోడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో ప్రతీక్షణం విలువైనదేనని, అంబులెన్స్ వచ్చేలోగా బాధితులు ప్రాణం పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట గుడ్ సమారిటన్ పథకం తీసుకొచ్చింది. క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా చేస్తే రూ.5 వేలు ప్రోత్సాహకం అందించేది. బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసుల భయం లేకుండా చర్యలు తీసుకుంది. తాజాగా ఈ బహుమతిని రూ.25 వేలకు పెంచింది. ఎక్కువ మందిని కాపాడితే రూ.లక్ష వరకు అందుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు
బహుమతి అందుకోవాలంటే..
ప్రాణాపాయంలో బాధితులను ఆసుపత్రులకి తీసుకెళ్లాక సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. అనంతరం పోలీసులు అధికారికంగా లేఖ ఇస్తారు. తరువాత బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పోలీసుశాఖ, ఆసుపత్రి ధ్రువీకరణ పత్రాలను జత చేసి మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. రవాణా, పోలీసు, రెవెన్యూ, వైద్యశాఖ, జాతీయ రహదారుల సంస్థ, రహదారుల భద్రత శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సమారిటన్ గుర్తించి నగదు ప్రోత్సాహకానికి ఎంపిక చేస్తుంది.