డిల్లీ ఎన్నికలలో కోసం బీజేపీ మ్యానిఫెస్టో..
డిల్లీ ఎన్నికలలో కోసం బీజేపీ మ్యానిఫెస్టో..
>> బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా..
>> మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం..
>> హోలీ, దీపావళికి ఒక్కో ఉచిత గ్యాస్ సిలిండర్..
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 'సంకల్ప్ పత్ర' పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ డిల్లీ శాఖ కార్యాలయం వేదికగా ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మేనిఫెస్టోలోని కీలక వివరాలను వెల్లడించారు. తమ సంకల్ప పత్రం వికసిత డిల్లీకి పునాదులు వేస్తుందని నడ్డా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ జేపీ నడ్డా ప్రకటించిన కీలక హామీలివే..
• ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే 'మహిళా సమృద్ధి యోజన' ద్వారా డిల్లీ మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం.
• డిల్లీలో 'ఆయుష్మాన్ భారత్' అమలు. అదనంగా రూ.5 లక్షల హెల్త్ కవర్.
• ఆప్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు.
• పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
• హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ.
• 60 నుంచి 70 ఏళ్లలోపు సీనియర్ సిటిజెన్లకు ప్రతినెలా రూ.2,500 పింఛను.
• 70 ఏళ్లకుపైబడిన వారికి రూ.3వేల పింఛను.
• డిల్లీలోని 'ఝగ్గి-ఝోప్డీ' (జేజే) క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. అక్కడి పేదలకు రూ.5కే పోషకాహారం. జేజే క్లస్టర్లు అంటే అనధికారిక సెటిల్‌మెంట్లు/మురికివాడలు.
తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు..
ఆప్ హయాంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల దిల్లీలోని 51 లక్షల మంది ప్రజానీకం ప్రయోజనాల్ని పొందలేకపోయారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే అమలుపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని నడ్డా తెలిపారు.
"ఆప్ హయాంలో మొహల్లా క్లినిక్‌లు అవినీతికి నిలయాలుగా మారాయి. ల్యాబ్ టెస్టుల పేరుతో మోసానికి పాల్పడ్డారు. దాదాపు రూ.300 కోట్ల ప్రజల సొమ్మును లూటీ చేశారు. బీజేపీ గెలిస్తే దీనిపై దర్యాప్తు చేయిస్తాం" అని జేపీ నడ్డా చెప్పారు. "మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఇస్తామని ఆప్ చెబుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మహిళలకు ఎలాంటి ఆర్థిక సాయమూ అందడం లేదు. కనీసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రాయితీని కూడా ఆప్ సర్కారు అందించడం లేదు" అని బీజేపీ చీఫ్ విమర్శించారు.
మేనిఫెస్టోపై 12వేల చిన్నా,పెద్ద సమావేశాలలో చర్చ..
వేలాది పార్టీ సమావేశాల్లో జరిగిన మేధోమథనం, ప్రజల నుంచి అందిన సూచనలు, నియోజకవర్గాల వారీగా సేకరించిన ఆలోచనల ప్రాతిపదికన బీజేపీ సంకల్ప పత్రాన్ని రూపొందించామని నడ్డా వెల్లడించారు. మేనిఫెస్టో రూపకల్పనపై తమకు దాదాపు 1.80 లక్షల సలహాలు, సూచనలు అందాయన్నారు. దాదాపు 12వేల చిన్నా,పెద్ద సమావేశాలలో ఎన్నికల ప్రణాళికపై చర్చ జరిగిందని తెలిపారు. 41 ఎల్‌ఈడీ వ్యాన్ల ద్వారా ప్రజల నుంచి ఆలోచనలను సేకరించినట్లు బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.