ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తాం...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తాం...
-ఎంపీలు బస్తిపాటి నాగరాజు, డాక్టర్ బైరెడ్డి శబరి
బిఎస్ఎన్ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా టెలికాం అడ్వైజరీ కమిటీ 2024- 26 రెండు సంవత్సరాల కాలానికి మొదటి సమావేశం స్థానిక బిఎస్ఎన్ఎల్ భవన్ నందు గురువారం జరిగింది.
ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లు హాజరయ్యారు.
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం లో టెలికాం సేవలను అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
అదేవిధంగా ఇటీవల నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి నియమించిన టెలికాం అడ్వైజరీ కమిటీ ( టిఏసి) మెంబర్లు పెరుమాళ్ళ విజయ్ కుమార్, మోమిన్ గౌస్ లాజం, చింతిబోయిన శ్రీనివాసులు, ఆడిక మధు, కురువ రమేష్ లకు శుభాకాంక్షలు తెలిపి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగానికి ఎంతగానో సపోర్టు చేస్తున్నదని, అత్యధిక బడ్జెట్ను బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు.
నంద్యాల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మొబైల్ సిగ్నల్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు .
ముఖ్యంగా రోళ్ళపాడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతాలకు త్వరలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు . బిఎస్ఎన్ఎల్ అధికారుల దృష్టికి టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్లు ఏ ఊర్లో టవర్లు లేవు , ఎక్కడ సిగ్నల్ తక్కువగా ఉందన్న విషయాలు సమగ్రంగా ప్రజలను కలిసి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వవలసిందిగా ఎంపీ సూచించారు.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం లో టెలికాం సేవలను అభివృద్ధి చేస్తాం :
టీఏసి సమావేశానికి హాజరైన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ , కొత్తగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి నియమించబడిన టిఏసి మెంబర్లు బత్తిని జీవన్ కుమార్, కురువ మల్లికార్జున రెడ్డి, గురుభ చంద్రశేఖర్ , పర్ల భాస్కర్, కాపా రాఘవేంద్ర రెడ్డి లకు శుభాకాంక్షలు తెలిపారు. టిఏసి సభ్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు, ప్రజలకు మధ్యవర్తిత్వం వహించి టెలికాం సేవలు అభివృద్ధి చేయడానికి కీలకపాత్ర వహించడానికి మంచి అవకాశం లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా సూచించి మాట్లాడుతూ వికసిత భారత్ నినాదంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నారని, అలాగే ముఖ్యంగా టెలికాం రంగంలో అభివృద్ధి సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు . బిఎస్ఎన్ఎల్ సంస్థ తక్కువ ఖర్చుతో టెలికాం సేవలను అందిస్తున్నదని, మారుమూల గ్రామాలకు టెలికాం సేవలను విస్తరిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ అధికారులకు తమ వంతు సహకారం అందిస్తామని , అధికారులు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి పనులు జరిగే విధంగా చేస్తామని తెలిపారు. ఇటీవలే కొన్ని గ్రామాలకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కూడా కలవడం జరిగిందని తెలిపారు .
![]() |
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ని సన్మానిస్తున్న బి ఎస్ ఎన్ ఎల్ అధికారులు |
సామాజిక సేవ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థను ఆదరించండి:
ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి. రమేష్ బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా పరిధిలో అందిస్తున్న టెలికాం సేవలను వివరిస్తూ, టిఏసి సమావేశానికి ఇద్దరు ఎంపీలు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని , బిఎస్ఎన్ఎల్ సమస్యలను ఇద్దరు ఎంపీలు దృష్టికి తీసుకువచ్చి ఎంపీల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు . ప్రజలకు చేరువగా అతి తక్కువ ఖర్చుతో సామాజిక సేవ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థను అందరూ ఆదరించాలని కోరారు .
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న టిఏసి సభ్యులు తమ ప్రాంతాలలోని సమస్యలను సమావేశంలో చర్చించారు. ప్రజలకు బిఎస్ఎన్ఎల్ కు వారధిగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కె .రాజేశ్వర రావు, ఐ .ఎఫ్. ఏ డి. శ్రీలత , ఏజీఎం ఆపరేషన్ పి. శ్రీనివాసరావు, ఏజీఎం అడ్మిన్ వి. శ్రీను నాయక్ , ఏజీఎం డోన్ జి.నారాయణస్వామి, ఏజీఎం మొబైల్ ఇన్స్టాలేషన్ ఎన్. చంద్రశేఖర్, ఏజీఎం ట్రాన్స్మిషన్ జి. వి .మురళీకృష్ణ , ఏజీఎం ప్లానింగ్ వి. జాన్సన్, ఇతర బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు .