పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
• ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
• ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల..
• తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు..
• ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్యమైన తేదీలు ఇవే..

శాసనసమండలి ద్వైవార్షిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరగనుంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చ్ 29వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
పదో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చ్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నిక ప్రక్రియను మార్చి 8వ తేదీ వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
అటు ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
• ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 3న
• నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 11న
• నామినేషన్ల ఉపసంహరణకు : ఫిబ్రవరి 13 వరకు గడువు
• పోలింగ్ : ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4
• ఓట్ల లెక్కింపు : మార్చి 3న