కోడిపందాలు, పేకాట మరియు ఇతర జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు..
కోడిపందాలు, పేకాట మరియు ఇతర జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు..
-కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు,పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా మరియు సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.
జిల్లాలో కోడి పందేలు, జూదాలు తదితర అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్రాంతి జరుపుకోవాలని, సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలు ప్రజల్లో సహృద్భావ వాతావరణం పెంపొందిస్తాయన్నారు. జిల్లాలో ఎవరైనా కోడి పందేలు నిర్వహించినా, పందేల నిర్వహణకు స్థలాలు , భూములు ఇచ్చినా, జూద క్రీడలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొందరు యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కొని తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలు పొందే సమయములో, పాస్ పోర్ట్ పొందే సమయాలలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అధోగతి పాలవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలిస్తే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ - 100 కు గాని, డయల్ 112 కు గాని లేదా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 7777877722 కు సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు.