Bank Robbery: మంగళూరులో భారీ దోపిడీ... రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Bank Robbery: మంగళూరులో భారీ దోపిడీ... రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
>> తాజాగా మంగళూరులోని బ్యాంకులో భారీ దోపిడీ
>> రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోపిడీ
>> కర్ణాటకలోని బీదర్ లో ఏటీఎం వద్ద రూ.93 లక్షలు దోచుకున్న దొంగలు..
కర్ణాటకలో ఇద్దరు దోపిడీ దొంగలు ఏటీయం వద్ద కాల్పులు జరిపి ఒకరిని చంపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే మరో భారీ దోపిడీ జరిగింది. తాజాగా, ఐదుగురు సాయుధ దుండగులు రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. మంగళూరులోని కేసీ రోడ్ లో ఉన్న కోటేకర్ ఉల్లాల్ కోపరేటివ్ బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది.
తుపాకులు, కత్తులు, చాకులు చేతపట్టుకుని వచ్చిన ఐదుగురు దుండగులు బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. ఆ దోపిడీ ముఠా బంగారం, నగదును నాలుగైదు బ్యాగుల్లో నింపుకుని అక్కడ్నించి పరారైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బ్యాంకులో పనిచేసేవారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను మరమ్మతుల కోసం టెక్నీషియన్ వద్దకు పంపించడం పోలీసుల అనుమానాలకు కారణమైంది. సీఎం సిద్ధరామయ్య మంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా పోలీసులంతా ఆయన బందోబస్తుకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు బ్యాంకును దోపిడీ చేసినట్టు భావిస్తున్నారు.
కాగా, కర్ణాటకలోపి బీదర్ లో ఏటీఎం వద్ద భారీగా నగదు దోచుకున్న దొంగలు హైదరాబాద్ పారిపోయి రావడం తెలిసిందే. వారిని వెదుక్కుంటూ బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారు. దొంగలు ఓ బస్సులో ఉండగా, ట్రావెల్స్ మేనేజర్ వారిపై అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో ఆ దొంగలు ట్రావెల్స్ మేనేజర్ పై కాల్పులు జరిపి పారిపోయారు.