పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు..
పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు..
• తక్షణమే చేప పిల్లల పంపిణీకి చర్యలు
• మత్స్యకారుల ఇంధన రాయితీకి నిధుల మంజూరు
• తీర ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి
• పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
• పశువుల ఆసుపత్రులకు భవన నిర్మాణాలు, మరమ్మతులకు ప్రతిపాధనలు
• జనవరిలో మత్స్యకార భరోసా, పశువులు, గోర్రెలకు టీకాలు
• మత్స్య శాశ, పశు సంవర్ధక శాఖల సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, సహకార, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, పీపుల్స్ మోటివేషన్:- ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
మంగళవారం అమరావతి సచివాలయంలో మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. చేప పిల్లల పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని, జనవరి నెలాఖరు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని ప్రజా ప్రతినిధులు చేప పిల్లల పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మత్స్యకారులకు ఇంధన రాయితీలో ఇబ్బందులు తలెత్తడంతో తక్షణమే రూ.6.67 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇకనుంచి ప్రతి ఏటా మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీకి అవసరమైన నిధులు ముందుగానే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఇంధనం ధర లీటరుకు సుమారు రూ.10/- ఆదా చేసేందుకు మెరైన్ ఇంధనం అందుబాటులోకి తెస్తున్నామని, ప్రభుత్వ పరిధిలో ఉన్న 54 ఫిష్ సీడ్ పాండ్స్ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన మత్స్య సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కేరళా తరహాలో కేరళ ప్రభుత్వ సహకారంతో కృత్రిమ రీఫ్ లను ఏర్పాటు చేసి తీర ప్రాంతాల్లో మత్స్య సంపద వృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో హార్బర్లు, జెట్టిలు, ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పశుసంవర్ధక శాఖ సమీక్షా :
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆసుపత్రుల భవన నిర్మాణాలు, మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (EMBRYO TRANSFER TECHNOLOGY) అభివృద్ధి చేసి మేలైన జాతులు, వ్యాధి నిరోధక శక్తి కలిగిన జాతులను వృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో రాష్ట్రంలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలకు అన్నింటికీ టీకాలు, డీ వార్మింగ్ మందులు అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం అయిన గోకులం పశువుల షెడ్ల నిర్మాణాలు, గడ్డి జాడు పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించేందుకు నివేదిక సిద్ధం చేయాలని, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమంలో బ్యాంకర్లు మరింత సహకారం అందించే విధంగా బ్యాంకర్లతో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
పశు కిసాన్ క్రెడిట్ కార్డులు :
పశు పోషకులు, కోళ్ల పెంపకం దారులకు రెండు లక్షల వరకు హామీ లేని రుణం అందించి 3% వడ్డీ రాయితీ కల్పిస్తున్నామని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
సమీక్షా సమావేశంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు, మత్స్య శాఖ కమీషనర్ డోలా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.