పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి
పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి
• గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో చేపడతాం
• ప్రతిపాదనలతో ముందుకొచ్చిన ఐఓసీ అధికారులు
• ప్రభుత్వాధికారులతో పీఎన్‌జీఆర్‌బీ ప్రతినిధుల భేటీ
అమరావతి, పీపుల్స్ మోటివేషన్:- దేశంలోనే మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యులు ఎ. రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైపులైన్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతి రాజధాని నగరాన్ని దేశంలో మొట్టమొదటి పూర్తి పైప్డ్ గ్యాస్ నగరంగా చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన విషయాన్ని ప్రభుత్వం ముందుంచారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్-టెక్ సిటీ (గిఫ్ట్) నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్తు, టెలీకాం కేబుళ్ల వరకు అన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయని, అక్కడ ఆవాసాలకు, వ్యాపార సముదాయలకు, సంస్థలు అన్నిటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించబడుతోందని చెప్పారు. అదే తరహాలో అమరావతి రాజధాని నగరంలో కూడా పూర్తిగా పైప్డ్ గ్యాస్ అందించి రాజధానిని దేశంలో మొట్టమొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పీఎన్‌జీఆర్బీ ప్రతినిధులు తెలిపారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమ్మతి తెలియజేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
80 లక్షల కనెక్షన్లు లక్ష్యం
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 80 లక్షల మందికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సీఎస్‌తో భేటీ అనంతరం పీఎన్‌జీఆర్బీ ప్రతినిధుల బృందం ఆర్టీజీఎస్‌ను సందర్శించి అక్కడ ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో చేపడుతున్న నేచురల్ గ్యాస్ పైపులైన్ల నిర్మాణ ప్రగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 80 లక్షల ఆవాసాలకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అందించాలనేది లక్ష్యమని, ఆ దిశగా పీఎన్‌జీఆర్బీ అధికారులు సహకారం అందించాలని దినేష్ కుమార్ కోరారు. గ్యాస్ పైపులైన్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తాము పూర్తీగా సహకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషషన్ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కుమార్ ఆశిష్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.