నేడు మనం ఇంధన పొదుపు చేయకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమే
నేడు మనం ఇంధన పొదుపు చేయకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమే
• ఈ ఏడాది ఇందన పొదుపులో మన రాష్ట్రానిదే ప్రథమ స్థానం
• ఒక యూనిట్ ఆదా చేస్తే ఒక యూనిట్ ఉత్పత్తి చేసినట్లే
• సోలార్ పరికరాల వినియోగం పెరగాలి
• విజన్-2047లో భాగంగా రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు
• విద్యుత్ పరికరాల వినియోగంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తే విద్యుత్ ఆదా చేయగలం
• విద్యుత్ ఆదా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
విజయవాడ, పీపుల్స్ మోటివేషన్:- ఇంధన పొదుపు మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని లేకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమేనని ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ పట్టణంలోని ఓ హోటల్ లో శుక్రవారం రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు గ్రహీతలకు అవార్డుల ప్రధానోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎనర్జీ శాఖ జాయింట్ సెక్రటరీ, ఏపీఎస్ఈసీఎం సీఈవో బి.ఏ.వి.పి. కుమార రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె. విజయానంద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఇంధన పొదుపులో ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా మన రాష్ట్రం అవార్డు సాధించడంలో అందరి సహకారం, సమన్వయం ఎంతో ఉందన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గతేడాది జాతీయ స్థాయిలో 83 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచామని, ఈ ఏడాది 87 పాయింట్లు సాధించి మరోసారి మొదటి స్థానం కైవసం చేసుకున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ వివరించారు.
మనం ఒక యూనిట్ ఇంధనం ఆదా చేస్తే ఒక యూనిట్ ఉత్పత్తి చేసినట్టే అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్నారు. ఇంధన పొదుపుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇంధన పొదుపుపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదాహరణకు ఇంటి పై భాగంగా కూల్ సర్పెస్ పెయింట్ వేస్తే ఇంట్లో వేడి వాతావరణం తగ్గి మార్పు కనిపిస్తుందని తెలిపారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో మనందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుందని, విజన్-2047 లో భాగంగా 50-60 శాతం గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా మనం ముందుకు వెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.
కరెంట్ ఆదా చేద్దాం.. భావి తరాలకు భరోసానిద్ధామని స్పషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్నారు. లైట్లు, ఎలక్ట్రిక్ పరికరాలైన ఫ్రిడ్జ్, ఇస్త్రీపెట్టే, ఏసీ, గ్రీజర్, వాషింగ్ మెషిన్, కంప్యూటర్ తదితర పరికరాల వాడకంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తే సగానికి సగం విద్యుత్ ఆదా చేయవచ్చన్నారు. ఒక వారం, ఒక నెల విద్యుత్ ఆదా చేయటం కాకుండ నిత్య జీవన విధానంలో విద్యుత్ పొదుపు ఒక భాగంగా చేసుకున్నప్పుడే నూరు శాతం ఫలితాలు సాధించగలమన్నారు. సోలార్ వినియోగంపై అవగాహన పెంచుకుని సోలార్ పరికరాల వాడకం పెంచుకోవాలని అప్పుడే మనం పూర్తి ఫలితాలు పొందగలమన్నారు. సోలార్ తో పనిచేసే పరికరాల వలన విద్యుత్ ఆదా అవడంతో పాటు మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నవారిమవుతామన్నారు.
ఏపీ జెన్ కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ మన దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రధాన పాత్ర పోషిస్తుందని, మనం విద్యుత్ వృథా చేస్తే మన సహజ వనరుల లభ్యత వేగంగా తరిగిపోతుందని హెచ్చరించారు. ఒక యూనిట్ ఉత్పత్తికి ఒక కేజీ బొగ్గు అవసరం అవుతుందన్నారు. అభివృద్ధిలో వేగం పుంజుకున్న నేటి రోజుల్లో రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తుండటం, అధునాతన ఉపకరణాలు అందుబాటులోకి వస్తుండటంతో రోజు రోజుకు గృహ వినియోగం కూడా పెరిగిపోతుందన్నారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, మనం విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భారం తగ్గుతుందన్నారు. మన దేశంలో లభ్యమయ్యే బొగ్గు సరిపోక నేడు విదేశాల నుండి అధిక ధరకు బొగ్గు దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపారు. దీంతో బొగ్గు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన స్థాయిలో మనం ఎంత విద్యుత్ ఆదా చేస్తే అంత పర్యావరణ హితానికి దోహదపడినట్లే అని వివరించారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండి పి. రవి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కీలక రంగాలలో భారీగా ఇంధనం ఆదా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇంధన పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇంధన పొదుపును ప్రజలు తమ జీవన శైలిగా మార్చుకోవాలన్నారు. దీంతో మనం ఏర్పాటు చేసుకున్న ఇంధన పొదుపు టార్గెట్ కంటే ఎక్కుగానే ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గృహాలలో బీఈఈ స్టార్ రేటెడ్ గృహోపకరణాలు, ఇంధన ఎనర్జీ ఎఫిసిఎంట్ ఉపకరణాలను మాత్రమే వినియోగంచేలా అలవాటు చేసుకోవాలన్నారు. కరెంట్, నీరు వృధాను అరికట్టేవిధంగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డులు సాధించిన వారికి బహుమతులు అందచేశారు. ఇండస్ట్రీ, బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్ విభాగాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంస్థలకు మెమోంటోలు, బహుమతులు అందచేశారు. అలాగే విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు మెమోంటోలు, బహుమతులు అందచేశారు.
ఇండస్ట్రీ విభాగంలో థర్మల్ పవర్ ప్లాంట్ కేటగిరీలో మొదటి బహుమతి ని ఎస్ఈఐఎల్, ద్వితీయ బహుమతిని సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అధికారులు అందుకున్నారు. టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ కేటగిరిలో మొదటి బహుమతిని మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ద్వితీయ బహుమతిని రవళి స్పిన్నర్స్ ప్రై లిమిటెడ్ యాజమాన్యాలు అందుకున్నారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కేటగిరిలో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ మొదటి బహుమతిని, ఆర్జాస్ స్టీల్ ప్రై. లిమిటెడ్ ద్వితీయ బహుమతిని గెలుపొందారు.
బిల్డింగ్స్ విభాగంలో ఆఫీస్ బిల్డింగ్స్ కేటగిరిలో ప్రథమ బహుమతిని విజయవాడ రైల్వే ఎలక్ట్రీక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, ద్వితీయ బహుమతిని గుంటూరు రైల్ వికాస్ భవన్ లు సాధించాయి. హస్పిటల్ కేటగిరిలో గుంతకల్లు రైల్వే హస్పిటల్ మొదటి బహుమతిని, విజయవాడ రైల్వే హస్పిటల్ ద్వితీయ బహుమతిని అందుకున్నాయి. ఆర్టీసీ డిపో అండ్ బస్టాండ్స్ కేటగిరిలో సత్తెనపల్లి బస్ డిపో మొదటి స్థానంలో, విశాఖపట్నం బస్ డిపో ద్వితీయ స్థానంలో సాధించాయి.
ఇన్స్టిట్యూషన్ విభాగంలో మొదటి బహుమతిని తాడిపత్రి మున్సిపాలిటి అందుకోగా, విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ ద్వితీయ బహుమతిని అందుకున్నాయి.
విద్యార్థుల విభాగంలో మొదటి బహుమతిని శ్రీకాకుళం జిల్లా జి. సిగదమ్ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు వి. వైకుంఠరావు, డి. వర ప్రసాద్, ఆర్. తేజ, అంకం ఈశ్వర్ లు అందుకున్నారు. ద్వితీయ బహుమతిని గుంటూరు జిల్లా పెదకాకాని కి చెందిన సెయింట్ జోసెప్స్ హై స్కూల్ విద్యార్థులు వై. లోహితాక్స్, వై. జోహాన్, ఎండి. ఖాషీష్, సీహెచ్. రోసీ రాచెల్, పి. అంజలీ కుమారీలు అందుకున్నారు. తృతీయ బహుమతిని చీరాల కు చెందిన ఎంఏ అండ్ ఎన్ ఏ విద్యా ఇంగ్లీషు మీడియం హై స్కూల్ విద్యార్థులు అందుకున్నారు. వీరితో పాటు మరో 10 కన్సోలేషన్ బహుమతులను విద్యార్థులకు అందచేశారు.