డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి
డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి
• కేంద్రం జన్ మన్ పథకం చేయూతతో గిరిజన గ్రామాల అభివృద్ధి
• రాజకీయాలకు అతీతంగా గిరిజన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
• శ్రీ శంకరన్ గారి వంటి అధికారుల సంకల్పం... నేటి అధికారులకు ఆదర్శం కావాలి
• పర్యాటకం ద్వారా గిరిజన ప్రాంతాల యువతకు ఉపాధి మార్గాలు
• గిరిజన ఉత్పత్తులకు సులభమైన మార్కెటింగ్
• గంజాయి రహితంగా ఏజెన్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి
• గిరిజన ప్రాంతాల సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చేందుకు బాధ్యత తీసుకుంటాను
• అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. కష్టపడ్డాను... కలత చెందాను... ప్రజల వెతలు చూసి ఆవేదన చెంది కన్నీరు కార్చిన రోజులున్నాయి. రాజకీయ శత్రువులు అసభ్యంగా ఇంట్లోని వారిని దూషించినా భరించను. ఎన్ని చేసినా... ఏం చూసినా... ఎలాంటిది విన్నా సరే నేను బలంగా అనుకున్నది ఒక్కటే... కనీసం నాలుగు గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించే స్థాయికి వెళ్లాలని అనుకున్నాను. ఈ రోజు మీ అందరి అభిమానం, ఆశీర్వాదంతో వందల గిరిజన గ్రామాలకు రోడ్లు వేసే స్థితిలో పని చేస్తున్నాన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు త్రికరణశుద్ధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ కోసం... ఆనంద డోలికల ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తూ గిరిపుత్రుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.
శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామంలో జిల్లా పరిధిలో రూ.105 కోట్లతో ఏజెన్సీ ప్రాంతంలో 100 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, రూ. 23 కోట్లతో 32 కిలోమీటర్ల రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కింద గిరిజన గ్రామాల్లో వంద మంది కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో సులభంగా రోడ్లు వేసుకునేందుకు కేంద్రం తగిన సహాయం చేస్తోంది. ఇది గతంలో 250 కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో మాత్రమే అమలు అయ్యేది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో 100మంది ఉన్నా రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2వేలకు పైగా గిరిజన గ్రామాల్లో రోడ్ల సౌకర్యం లేదు. మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడా చాలా తక్కువ మంది నివసించడంతో జన్ మన్ పథకం అంతగా అక్కరకు రావడం లేదు. దీని కోసం పంచాయతీ రాజ్ నుంచి నిధులు అలాగే ఉపాధి హామీ పథకంలో రోడ్లను వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ను డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ గా ఆవిష్కరించవచ్చు.
ఈ ప్రాంతానికి వస్తున్న సమయంలో విలేకరులు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీలు లేరని ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. రాజకీయాలు అభివృద్ధికి అడ్డు కాకూడదని నేను భావిస్తాను. మీరు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా మీ కష్టాలు చూస్తే మాత్రం నేను చలించిపోతాను. గిరిజనులకు కష్టాల్లో మేము ఉన్నామనే భరోసా కల్పించడానికి వచ్చాం. రూ. 100 కోట్లతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. గిరిజనుల సమస్యలపై దృష్టిపెడుతున్నామని అక్కడ సౌకర్యాలు పెంచాలని దీనికి ఆర్థికంగా తోడ్పాటు కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారు.
మేము మీ కోసం మనసు పెట్టి వచ్చాం... మీ కోసం నిలబడి ఉన్నాం. నరేగా నుంచి రూ. 72.20 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 33.13 కోట్లు వెచ్చించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు బాగు చేస్తున్నాం. మొత్తం దీనివల్ల 72 గ్రామాలు 4369 మంది గిరిజనులు లబ్ధి పొందుతారు. లబ్ధి పొందేవారు తక్కువే అయినా గిరిజనుల కష్టాలు తీర్చాలని బలంగా సంకల్పించాం.
• మార్పు కోరుకున్నారు... 6 నెలల్లో రోడ్లు వచ్చాయి
గత ఎన్నికల్లో రాష్ట్రంలోని యువత బలంగా మార్పు కోరుకున్నారు. కూటమికి బలంగా నిలబడ్డారు. దాని ఫలితమే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 6 నెలల్లోనే రోడ్లు వస్తున్నాయి. సర్పంచులు భుజాలు ఎగరేసి మరి తాము గ్రామ ప్రథమ పౌరులం అని బలంగా చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి, నేను - గిరిజన స్థితిగతులు వారి ఆదాయం, ఆరోగ్యం, రోడ్లు ఇతర సౌకర్యాల గురించి చర్చించుకున్నాం. దీని మొత్తానికి రూ. 2,569 కోట్లు ఖర్చు అవుతుందని నేను ముఖ్యమంత్రి కి చెప్పిన వెంటనే ఆయన మరో మాట లేకుండా దశల వారీగా గిరిజన గ్రామాల్లో సమస్యలు తీరుద్దామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా మొదటగా రూ. 350 కోట్లు ఏడాదికి ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించాం. కేంద్రం సహకారం కూడా తీసుకొని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి తీసుకొచ్చేలా చూస్తాం.
• శ్రీ శంకరన్ గారి స్ఫూర్తితో...
గిరిజన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ట్రైబుల్ డవలప్మెంట్ అథారిటీ (ఐటీడీఏ)లను తీసుకొచ్చిన గొప్ప ఐఏఎస్ అధికారి శ్రీ శంకరన్ గారి లాంటి చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి. అభివృద్ధికి దూరంగా విసిరి వేయబడ్డ మనుషుల పట్ల మానవత్వంతో పాటు, వారి గుండెల్లో గుర్తిండిపోయేలా, బలంగా నిలబడేలా సంకల్పం అధికారులు చేసుకోవాలి. శ్రీ శంకరన్ గారిలా ప్రతి అధికారి ఆలోచిస్తే గిరిజనులకు కష్టాలే ఉండవు. ఆ స్ఫూర్తితో అధికారులు పని చేయాలి.
వివిధ సందర్భాల్లో గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ సమస్యలు, ప్రజల ఆటుపోట్లు చూశాను. వారి కోసం బలమైన పనులు చేయాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాం. అధికారగణం కూడా క్షేత్రస్థాయిలో లోపాలను సవరించుకొని సమన్వయం సాధించాలి. నేను క్షేత్రస్థాయి కష్టాలను మాత్రమే చూడగలను. ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలి అనేది ముఖ్యమంత్రి గారి సూచనలతోనే సాధ్యం. నేను అడిగిన వెంటనే విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
• పర్యాటకంగా కొత్త పంథాలో వృద్ధి సాధిద్దాం
రాష్ట్రంలో మన్యం ప్రాంతం ప్రకృతిపరంగా అద్భుతం. పర్యాటకంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గిరిజన గూడేల్లో ఉండే యువత కొత్తగా ఆలోచించి వచ్చే పర్యాటకులకు హోం స్టే వంటి సౌకర్యాలు కల్పించి, అరుదుగా కనిపించే విషయాలను పరిచయం చేస్తే పర్యాటకం పెరుగుతుంది. దీని ద్వారా ఉపాధి మార్గాలు వస్తాయి. అది జీవన శైలిని పెంచుతుంది. దీని కోసం పర్యాటకులను ఆకర్షించడం, క్రమశిక్షణగా ముందుకు వెళ్లడం, ప్రణాళికతో సౌకర్యాలు కల్పన అనేవి ముఖ్యం. దీన్ని యువత అర్థం చేసుకోవాలి. దీనివల్ల పర్యాటకం పెరగడంతో పాటు గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సులభమవుతుంది. నేను ఇక్కడికి వచ్చాకా రూ. 1500 పెట్టి కొన్ని ఉత్పత్తులు కొన్నాను. అలాగే ఇక్కడికి వచ్చేవారు కూడా గిరిజన ఉత్పత్తులకు అంబాసిడర్ అవుతారు.
సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కాఫీ, పసుపు, మిరియాలు ఇతర ఉత్పత్తులు చాలా నాణ్యంగా ఉంటాయి. మన్యం ప్రాంతాల్లో నీటి వనరుల లభ్యత బాగుంటుంది. దీనిని ఉపయోగించుకొని 100 గజాల్లో సాగు చేసిన అరుదైన పంటలకు అద్భుతమైన మార్కెటింగ్ చేసుకోవచ్చు. సినీ పరిశ్రమ కూడా ఎక్కడో విదేశాలకు వెళ్లే బదులు ఏజెన్సీ ప్రాంతాన్ని షూటింగులకు ఎంచుకుంటే ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.
• గంజాయిని వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను
పర్యటనలో భాగంగా నేను స్థానికంగా ఉన్న యువకుడితో గంజాయి దొరుకుతుందా? అని ప్రశ్నిస్తే చక్కగా దొరుకుతుంది అని నవ్వుతూ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. గంజాయి అనేది గిరిజనులు ఆచార వ్యవహారాల్లో వనదేవతలకు నైవేద్యంగా సమర్పించే సంప్రదాయంగా ఉండేది. అది ఇప్పుడు పూర్తి వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రమంతా గంజాయి వాడకం అధికమైంది. దేశంలోనే గంజాయి సరఫరాలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ వ్యాపారం దేశమంతటా పాకింది. యువతకు, చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు లభ్యం కావడం భయంగొలుపుతోంది. కడపలో ఇటీవల ఒక టీచర్ ను విద్యార్థులు హత్య చేసిన ఘటనలో గంజాయి ప్రభావం ఉందనే విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గంజాయిని సామాజిక సమస్యగా గుర్తించాలి. గంజాయి దుష్పరిణామాలు చాలా లోతుగా ఉన్నాయి. గంజాయి బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి, వారి కుటుంబాల పరిస్థితి కూడా చిన్నాభిన్నమవుతోంది. గంజాయి పండించే విషయంలో అంతా ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వానికి సహకరించి గంజాయి నిరోధానికి సహకరించండి. మీకు కచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తాం. మీరు దాని నుంచి బయటకు రండి. మీరు గంజాయిని వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. దాని నిరోధానికి అంతా సమష్టిగా ముందుకు వెళ్దాం. గిరిజనుల బతుకులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. గిరిజనుల ఆడబిడ్డలు నవ్వుతూ ఉంటేనే అడవికి కొత్తకళ వస్తుంది.
• డీజీపీ పర్యటన వద్దన్నా మీ కోసం వచ్చాను
నేను మొదట నుంచి ఒకటే బలంగా నమ్ముతాను. ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. వారితో నేరుగా మాట్లాడితే దాదాపు సమస్యకు వారే పరిష్కారం చూపిస్తారు. ప్రజల వద్దకు వేగంగా, సులభంగా వెళ్లాలనేది నా కల. మీరు దానికి సహకారం అందించాలి. నా మీద పడకుండా క్రమశిక్షణగా ఉంటే నేను మరింత ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యలు వినేందుకు, తెలుసుకునేందుకు అధికంగా ప్రయత్నిస్తాను. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. డీజీపీ నా పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించినా నేను మీ కోసం వచ్చాను. కచ్చితంగా గిరిజనుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని బలంగా భావించబట్టే ఇక్కడికి వచ్చాను. మంచి చేసే వారికి ఆపద రాదు. నేను అదే నమ్ముతాను. రాష్ట్రం, దేశం బాగుండాలని బలంగా ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అధికారులతో ఇబ్బంది ఉన్నా, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోయినా నాతో చెప్పండి. దానిని తీర్చేందుకు ప్రయత్నిస్తాను. వెంటనే సమస్య పరిష్కారం కావాలని చూడకండి. ఒక రోడ్డు వేయాలన్న టెండర్ పిలవడానికి 45 రోజులు పడుతుంది. కాబట్టి ప్రతి సమస్య వెంటనే తీర్చేయాలని అనుకోకండి. ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అడిగారు. దానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. జీవో 03 విషయంలో కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఇంటి పట్టాల మంజూరుకు యుద్ధ ప్రాతిపదికను అదాలత్ నిర్వహించాలని కలెక్టర్ కి సూచిస్తున్నాను. మీకు పని చేయాలన్న మనసు, ఆ పనులకు నిధులు తీసుకువచ్చే బుద్ధి కలిస్తేనే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుంది. దీనికి ముఖ్యమంత్రి, నేను కట్టుబడి పని చేస్తాము” అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, నిమ్మక జయకృష్ణ, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ దొన్ను దొర, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గర్, ఎస్పీ అమిత్ బర్ధార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో వి. అభిషేక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
• గిరిజన స్టాల్స్ పరిశీలించి... గిరిజనులతో నృత్యం చేసి...
పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఐటీడీఏ స్టాల్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ, వైద్యశాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు చేరుకొని ప్రదర్శన తిలకించారు. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన వన్ ధన్ వికాస్ స్టాల్ లో గిరిజన ఉత్పత్తులను పవన్ కళ్యాణ్ రూ.1500 చెల్లించి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ లో మహిళకు సీమంతం కిట్లను అందించి వారిని ఆశీర్వదించారు. అక్కడే పిల్లలకు బాలామృతం స్వయంగా తినిపించారు. అంతకుముందు గిరిజనులు సంప్రదాయ థింసా నృత్య ప్రదర్శనలో వాయిద్యాలకు అనుగుణంగా కాసేపు వారితో కలిసి నృత్యం చేశారు.