ఏ ఇంట్లోకైనా మీడియా చొచ్చుకు వెళ్లవచ్చా?
ఏ ఇంట్లోకైనా మీడియా చొచ్చుకు వెళ్లవచ్చా?
సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారంపై కొంత కాలంగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ఎవరి ఇంట్లోకి అయినా అనుమతి లేకుండా మీడియా చొచ్చుకు వెళ్లవచ్చా అనేది ప్రశ్న.
ఎవరిదైనా ప్రైవేటు స్థలం లేదా భవనంలోకి ఇతర వ్యక్తులు ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 329 ప్రకారం, అనుమతి లేకుండా ఇతరుల భవనాలు, స్థలాల్లోకి చొరబడటం ట్రెస్ పాసింగ్ అనే నేరం కిందకు వస్తుంది. దానికి సందర్భం, కారణాలను బట్టి మూడు నెలలు, ఏడాది వరకు జైలు శిక్ష ఉందని చట్టం చెబుతోంది. ఈ విషయంలో జర్నలిస్టులకు ఎలాంటి మినహాయింపు లేదు. భారతదేశ చట్టాల ప్రకారం జర్నలిస్టులు, సామాన్య పౌరులు అంతా సమానమే.
మీడియా వారైనా సరే, ఏ సామాన్యుడి ఇల్లు అయినా, సెలబ్రిటీ ఇల్లు అయినా వారి గోడ దాటి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తే వారిపై ఆ భవన యజమాని కేసు పెట్టవచ్చు. బ్లిక్ పర్సనాలిటీల వ్యక్తిగత వ్యవహారంపై ప్రజలందరికీ ఉత్సాహం ఉంటుంది. అందుకే మీడియా దాన్ని రిపోర్ట్ చేయవలసి వస్తుంది. అదే సందర్భంలో మీడియాపై భౌతిక దాడి సరికాదు. తప్పు చేస్తే చట్టపరంగా వెళ్లాలి అనేది జర్నలిస్టుల వాదన. చొరబడటంలో కూడా చాలా రకాలున్నాయి. ఆయుధాలతో రావడం, రహస్యంగా రావడం, గోడ దూకడం, రాత్రి వేళ రావడం, గేట్లు పగలగొట్టడం.. ఇలా నేరాన్ని బట్టి కేసు తీరు మారుతుంది. ఒకవేళ వేరే వారు అక్కడ గేట్లు పగలగొట్టినా ఆ దారిలో మీడియా వాళ్లు వెళ్ళడం కూడా చట్ట ప్రకారం నేరమే. ఈ స్థలం ఫలానా వారిది ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని సాధారణంగా కొన్ని ఖాళీ స్థలాల దగ్గర బోర్డులు పెడుతుంటారు. అనుమతి లేకుండా ప్రవేశించిన వారు శిక్షార్హులు అని దీనర్థం. నిబంధన ఇంటికి, ఇతర ప్రైవేటు స్థలాలకు కూడా వర్తిస్తుంది. మీడియా వారికి, సెలబ్రిటీలకు కూడా ఇందులో మినహాయింపు లేదు. కాకపోతే, అమెరికా వంటి దేశాల్లో ఇది అందరూ పాటిస్తారు. మనదేశంలో చట్టాలపై అవగాహన తక్కువ కాబట్టి, ఎక్కువ మంది దీన్ని గౌరవించరు. కానీ, ఎవరైనా గట్టిగా నిలబడి కేసు పెడితే, కచ్చితంగా చొరబాటు చేసిన వారికి శిక్ష పడుతుంది అంటున్నారు న్యాయనిపుణులు. అంతేకాదు, తమ స్థలం లేదా భవనంలోకి చొచ్చుకు వస్తున్న వారిని ఆపే హక్కు కూడా ఆ స్థల యజమానులకు ఉంటుంది. అయితే దాని అర్థం భౌతిక దాడులు చేయవచ్చని కాదు. వారిని ప్రవేశించకుండా ఆపవచ్చు అని మాత్రమే చట్టం చెబుతోంది. సాధారణంగా దొంగతనం కోసం, దాడులు చేయడం కోసం, ఆక్రమణ కోసం ఎవరైనా ప్రాపర్టీలోకి వస్తే ట్రెస్పాసింగ్ కేసులు పెడతారు. కానీ మాట్లాడటం కోసం, సమాచారం కోసం, లేదా అసలు ఏ ఉద్దేశం లేకుండా ఊరికే ఇతరుల స్థలంలోకి వెళ్లినా కేసు పెట్టవచ్చా అంటే అవుననే చెబుతోంది చట్టం. అంటే ఇక్కడ చొరబాటుదారుని లక్ష్యం ముఖ్యం కాదు. కాకపోతే ఉద్దేశాన్ని బట్టి శిక్ష తీవ్రత మారవచ్చు. కానీ, అసలు ఏ చెడు ఉద్దేశం లేకుండా వెళ్లినా నేరం నేరమే. ందుకంటే, రేపు ఎవరో ఒకరు నీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు. నాకే ఉద్దేశమూ లేదు. ఊరికే మీ ఇంటి ముందు నుంచుంటా అంటే చెల్లదు కదా? బోర్డు పెట్టినా, పెట్టకపోయినా, ప్రతి ప్రైవేటు ఆస్తి మీద యజమానికి హక్కు సహజంగా ఉంటుంది. శివసేన నాయకుడు ఉద్దవ్ ఠాక్రే జర్నలిస్టులపై 2020లో ఈ తరహా కేసు పెట్టించారు. తన నివాసంలోకి అక్రమంగా చొరబడ్డారు అంటూ రిపబ్లిక్ టీవీ రిపోర్టర్, కెమెరా పర్సన్, ఆ బండి నడిపిన డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. అలాగే 2018లో చెన్నైలోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను వీడియో తీస్తున్న ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవని స్పష్టమవుతోంది. చట్ట ప్రకారం పోలీసులు కూడా ప్రైవేటు ప్రాపర్టీలోకి వెళ్లడానికి స్పష్టమైన కారణం ఉండాలి. ఒకటి వారికి ఎవరైనా ఫిర్యాదు చేసి ఉండాలి లేదా, వారికి అక్కడ తీవ్రమైన నేరం, తక్షణం ఆపించాల్సిన నేరం జరుగుతోందన్న కచ్చితమైన సమాచారం వచ్చి ఉండాలి, లేదా కోర్టు లేదా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన సమాచారం వచ్చి ఉండాలి. అప్పుడే మాత్రమే పోలీసులు ప్రైవేటు ప్రాపర్టీలోనికి అడుగు పెట్టగలరు. అయితే భారతదేశంలో చాలా వరకు ఈ చట్టం మీద అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్న వారు కూడా పోలీసులతో అనవసర గొడవ ఎందుకు అనుకుని ఊరుకోవడం సహజంగా కనిపిస్తుంది. ఇక, చొరబడటం మాత్రమే కాదు ఒక వ్యక్తి వెంటపడటం, వెంబడించడం కూడా శిక్షార్హమైన నేరమే. తరచూ వెంటబడటం, ఎక్కడకు వెళ్లినా వెనకాలే వెళ్లడం వంటివి చట్ట ప్రకారం స్టాకింగ్ అనే నేరం కిందకు వస్తాయి. అయితే విస్తృతమైన ప్రజాప్రయోజనం ఇమిడి ఉన్న అంశాల్లో కొన్ని సార్లు మీడియా వెళ్లాల్సి రావచ్చు. అప్పుడు కూడా అది చట్ట వ్యతిరేకమే అయినప్పటికీ విస్తృతమైన ప్రజాప్రయోజనం ఉంది కాబట్టి దాన్ని వెలికితీయడానికి కాస్త రిస్క్ తీసుకోవడం అవసరం అనే వాదన చేయచ్చు. కానీ, అప్పుడు కూడా అది అంతగా ప్రజాప్రయోజనంతో ముడిపడింది అవ్వడం, అందులో కూడా వ్యక్తుల ప్రైవసీకి భంగకరం కాని రీతిలో వ్యవహరించడం లాంటి అంశాలు ముడిపడి ఉంటాయి. చీటికి మాటికీ ఎక్కడ పడితే అక్కడికి మైకులు తీసుకుని దూసుకువెళ్లే అధికారం సాధారణ ప్రజలకు ఎలా ఉండదో మీడియాకు కూడా ఉండదు. దాదాపు పదేళ్ళ క్రితం చిరంజీవి ఇంట్లో ఒక ప్రైవేటు కార్యక్రమం జరిగినప్పుడు ఒక ఇంగ్లీషు పత్రిక ఫోటోగ్రాఫర్ గోడదూకి ఆ కార్యక్రమం లోపలికి వెళ్లారు. అప్పుడు అతనిపై పవన్ కళ్యాణ్ భౌతిక దాడి చేశారు. తరువాత ఫిలిం చాంబర్ లో సినిమా పెద్దలు ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తాజాగా మోహన్ బాబు ఇంటిలోకి మీడియా వెళ్లింది. ఆయనా దాడి చేశారు. ఈ మధ్య ఒక తెలంగాణ నార్కొటిక్స్ అధికారిని ఇంటర్వ్యూ ఇవ్వమంటూ ఒక మహిళా జర్నలిస్టు మీదమీదకు వెళ్లిన ఘటన కూడా ఇటువంటిదే. చిరంజీవి ఘటన సమయంలోనూ ప్రైవసీ అనే అంశం చర్చకు వచ్చింది. మీడియా కూడా తనకున్న పరిమితులు తెలుసుకోవాలి. అందరి ప్రైవసీని మీడియా గౌరవించాల్సిందే. దాన్ని ఉల్లంఘించే హక్కు లేదు. మీడియా కూడా తన పరిమితులు తెలుసుకుని, అక్కడ ఏం జరుగుతోందో చెప్పవచ్చు. రిపోర్ట్ చేయవచ్చు. కానీ ఆవేశపూరిత పరిస్థితులు కుటుంబంలో ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్లకూడదు. మీడియా ఆవేశంలో వెళ్లడం పొరబాటు అనిపిస్తుంది. కానీ దానికి ప్రతిగా భౌతిక దాడి చేయడం కూడా సరికాదు. కొందరు అవగాహన లేని మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం చూపుతుంటారు. జర్నలిజంలో ఏబీసీడీలు, పాత్రికేయ విలువలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటివి తెలియని వారు మీడియాలోకి రావడం వల్ల కూడా సమస్య వస్తోంది. గత కొన్ని రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్కు మధ్య వివాదం తలెత్తింది. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్ బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్ తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఎవరి తప్పు ఎంత ఉన్నదో... న్యాయస్థానం ఏం చెబుతుందో చూడాలి. హైకోర్టు తీర్పు కోసం తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!