NTR Bharosa Scheme: పింఛన్ లబ్ధిదారుకు గుడ్ న్యూస్.. మూడు నెలల పింఛన్ ఒకేసారి
NTR Bharosa Scheme: పింఛన్ లబ్ధిదారుకు గుడ్ న్యూస్.. మూడు నెలల పింఛన్ ఒకేసారి
• 6 నెలలకొకసారి పింఛన్లు మంజూరు..
• ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు..
• ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ..
-అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశం
ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని సూచించారు.
ఈ విధానాన్ని డిసెంబరు నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. భర్త చనిపోయినవారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పింఛన్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపి క్షేత్రస్థాయిలో మళ్లీ సమీక్షిస్తారు. ఇక్కడ అనర్హులుగా నిర్ధారణ అయితే పింఛన్ నిలిపివేస్తారు. ఈ క్రమంలో అర్హుల పింఛన్లు తొలగినా గ్రామ సభల్లో ఫిర్యాదులు తీసుకుని నిబంధనలను పరిశీలించి పింఛను కొనసాగిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎస్‌వోపీని తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారని స్పష్టం చేసింది. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో మూడు నెలల మొత్తం కలిపి అందిస్తారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.