విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు
• అధికారులకి ఎలాంటి అపాయం జరిగినా బెదిరించిన వారిదే బాధ్యత
• ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు
• ఇంకోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే సమోటోగా కేసులు
• గత ముఖ్యమంత్రి పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు
• అటవీ అమర వీరుల త్యాగాలు వృథా కానివ్వం
• భావితరాలు గుర్తుంచుకునేలా విగ్రహాల ఏర్పాటు... భవనాలకు అమర వీరుల పేర్లు
-గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
'విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అధికారులకు ఇంకోసారి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటాం. కేసులు పెడతామ'ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అధికారులపై ఈగ వాలినా, చిన్న గీతపడినా బెదిరింపులకు దిగినవారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సప్త సముద్రాలు దాటినా, రిటైర్ అయినా వదిలిపెట్టమని ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తామని తెలిపారు.
కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులు ఎవరూ వాళ్ల బెదిరింపులకు బెదిరిపోరన్నారు. 20 ఏళ్లు తమ ప్రభుత్వం ఉంటుందని మభ్యపెట్టి గత ప్రభుత్వంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని, రోడ్డు మీద నిరసనను చూస్తున్న మహిళలపై కూడా హత్యాయత్నం కేసులు పెట్టారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు ఎన్నిసార్లు ఇబ్బందిపెట్టినా బాధ్యతగా వ్యవహరించమని కోరడం తప్ప ఏనాడూ... అంతు చూస్తామని మాట్లాడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి కర్తవ్య నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.
ఆదివారం గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్మారక స్థూపం వద్ద అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి అమర వీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ని సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని గత ముఖ్యమంత్రి అంటున్నారు. డీజీపీ ని రిటైర్ అయినా వదలం అని అంటున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. గత ప్రభుత్వంలో పోలీసులతో ఘోర తప్పిదాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. మీరు ఇంట్లో కూర్చుని రోడ్డు మీద ఆడ బిడ్డలకు సంరక్షణ లేదని విమర్శలు చేస్తున్నారు. ఆడ బిడ్డల మీద దాడులు ఎప్పుడు మొదలయ్యాయి? రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉన్మాదులు ఎందుకు ఇలా పేట్రేగిపోతున్నారు? గత ప్రభుత్వంలో పాలకులు బాధ్యతారాహిత్యంగా నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణిని తిట్టారు. ఇళ్లలోకి వచ్చి బిడ్డలను రేప్ చేస్తామని మాట్లాడారు. పాలించే నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడితే.. క్రిమినల్స్ కి తప్పులు చేసినా పర్వా లేదన్న ధైర్యం వస్తుంది.
సామాజిక మార్పుతోనే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగుతాయి..
ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తూ ఉంటారు. ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్ గా పరిగణించవద్దు. ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు పెట్టడానికి వెళ్తే అధికారులు సరిగా స్పందించలేదు. ఆ కేసులో తమ బిడ్డ బ్రెయిన్ డెడ్ అయితే అతని తల్లి అవయవాలు దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సమయంలో ప్రాణాలు తీసుకురాలేకపోయినా, మన ప్రవర్తన ఓదార్పునివ్వాలి. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చు.
నేరగాళ్లకి కుల, మతాలు ఉండవు..
ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ది లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా కోల్ కత్తా ప్రభుత్వ ఆసుపత్రి లాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చట్టాల అమలుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. నిర్భయ చట్టం సమయంలో చాలా మంది పార్లమెంటేరియన్లు, న్యాయమూర్తులు కూడా బలంగా మాట్లాడారు. క్రిమినల్స్ కి కులాలు, మతాలు ఉండవు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడి కులాల వెనుక దాక్కుంటామంటే కుదరదు. ఏ కులం అయినా, మతం అయినా తప్పు చేస్తే శిక్షించి తీరాలని ముఖ్యమంత్రి కి, డీజీపీ కి చెప్పాము. దీంతో పాటు ఆడ బిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టు పక్కల వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్ కమిటీలు రావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. దీంతోపాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి.
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ..
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట ఇష్టానుసారం రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్ల నరికివేతపై మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీస్ శాఖ స్పందించలేదు. అయితే గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఊహించనన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలతోపాటు సరస్వతి పవర్ భూముల్లో 76 ఎకరాలు అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించేశారు. దీనితోపాటు వాగులు వంకల సంరక్షణ బాధ్యత కూడా ఉంది. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నాము. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్ జోన్ ఏర్పాటు చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమలు కూడా లేవు. సరస్వతి పవర్ వ్యవహారంలో పాల్పడిన ఉల్లంఘనలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
విశాఖ నడిబొడ్డున గంజాయి పెంచుతున్నారు. భవిష్యత్తులో గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాము.
అటవీ అమర వీరుల త్యాగాలను వృధా కానివ్వం..
అటవీ సంపద దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాలి. అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐ.ఎఫ్.ఎస్. అధికారితో పాటు 23 మంది సిబ్బంది తమ ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో అశువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి ప్రసాదించిన వన సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదులను రక్షించే బాధ్యత మనందరిదీ. సిబ్బంది, నిధుల కొరత ఉన్నా వాటిని అధిగమించి అటవీ శాఖను బలోపేతం చేస్తాం. అటవీశాఖలో సిబ్బంది కొరత ఉన్నా అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ల ముందర కాళ్లకు బంధాలు వేయకుండా వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే సరిపోతుంది.
దాతల సహకారంతో సంజీవని స్కీమ్ కు నిధులు..
అటవీ సంపద సంరక్షణలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్, కీర్తిచక్ర అవార్డు గ్రహీత దివంగత పందిళ్లపల్లి శ్రీనివాస్ తో సహా 23 మంది ఫారెస్ట్ అధికారులు అశువులు బాసారు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ తో పోరాటం చేసి శ్రీనివాస్ గారు ప్రాణాలు వదిలారు. వీరి త్యాగాలను మనతో పాటు భావి తరాలు మరిచిపోకూడదు. భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా విగ్రహాల ఏర్పాటు, నగర వనాలు, అటవీ శాఖ భవనాలకు వారి పేర్లు పెడతాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి తీసుకొచ్చిన సంజీవని పథకానికి పారిశ్రామికవేత్తలు, దాతలతో మాట్లాడి రూ. 5 కోట్ల నిధులు సమీకరిస్తాం. అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేస్తాం.
బిష్ణోయ్ తెగలా పోరాటం చేద్దాం..
చెట్లు, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి బిష్ణోయ్ తెగ ఎంత వరకైనా వెళ్తుంది. జోద్ పూర్ రాజు చేపట్టిన చెట్లు నరికివేతకు వ్యతిరేకంగా అమృతా దేవి నాయకత్వంలో బిష్ణోయ్ తెగ శాంతియుతంగా పోరాడి వందల సంఖ్యలో ప్రాణాలను అర్పించింది. రాజు సైన్యంపై ఎదురుదాడి చేయకుండా చెట్లను కౌగలించుకొని సైన్యం చేతిలో వీరమరణం పొందారు. ఆ కోవకు చెందిన వ్యక్తులే మన అమరవీరులు. ఇలాంటి వారినే స్ఫూర్తిగా తీసుకొనే అటవీ సంపద సంరక్షణ కోసం సుందర్ లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం చేశారు. అటవీశాఖ నా చేతిలో ఉన్నంత వరకు ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటివి సంస్కరణలు తప్పకుండా తీసుకొస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడి అటవీశాఖ బలోపేతానికి కావాల్సిన నిధులు తీసుకొస్తాను. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాధపురం పంచాయతీ పరిధిలో సహజ వనరులు ఇష్టారాజ్యంగా తవ్వేశారు. అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దోపిడీ వల్ల వ్యక్తులు బలపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పంచాయతీలకు సీనరేజ్ రావడం లేదు. దీన్ని సరి చేయాల్సి ఉంది. ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టేందుకు ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాము. ఆ నంబర్ కి కాల్ చేస్తే ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుని అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని త్వరలో అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా వేలం వేయబోతున్నాం" అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, బి.రామాంజనేయులు, గుంటూరు జెడ్పీ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి, అటవీశాఖ ఉన్నతాధికారులు కజురియా, ఎస్.ఎస్. శ్రీధర్, రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు.