-Advertisement-

గెలుపు కోసం ఉచిత విన్యాసాలు !

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

గెలుపు కోసం ఉచిత విన్యాసాలు !

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. కాంగ్రెస్ కావచ్చు.. బిజెపి కావచ్చు.. తాయిలాలు ప్రకటించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయి. అధికారంలోకి రాగానే తమ స్వలాభమే తప్ప ప్రజల మేలుకోరి పనిచేయడం లేదు. కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో మార్పురావడం లేదు. 2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, ఢిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు. జార్ఖండ్, మహారాష్ట్రల్లో మాత్రం కాంగ్రెస్, బిజెపిలు అధికారం కోసం నానా గడ్డి కరుస్తున్నాయి. జార్ఖండ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను ప్రకటించాయి. పదిలక్షలమంది యువతకు ఉపాధి, పదిహేను లక్షల రూపాయల వరకూ ఆరోగ్యబీమా, నాలుగువందల యాభైరూపాయలకే సిలండర్, మహిళలకు నెలకు రెండున్నరవేల రూపాయలు, ప్రతివ్యక్తికీ ఏడుకేజీల ఆహారధాన్యాలు, వరి కనీసమద్దతుధరను ఎనిమిది వందల రూపాయలు పెంచడం, వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కుల పరిరక్షణ ఇందులో ఉన్నాయి. ఈ హామీలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగించివుంటే నమ్మకం ఉండేది. కానీ బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.

ఆదివాసుల ఓట్లకోసం బీజేపీ ఎంతగా కష్టపడుతోంది. ఇటీవలి ఎన్నికల సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది తెలియచెబుతాయి. ప్రధానంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు జార్ఖండ్ మూలమూలల్లోకి చొరబడ్డారని, వారికి దొంగసర్టిఫికేట్లు ఇచ్చి స్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు అతిపెద్ద ఓటుబ్యాంకును తయారుచేసుకున్నాయని ఆరోపిస్తూ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు. చొరబాటుదారులు గిరిజన ఆడబిడ్డలమీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, విద్యాసంస్థలకు మైనారిటీ గుర్తింపుతో ఆదివాసీ విద్యార్థులకు జెఎంఎం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీజేపీ విమర్శలు చేస్తోంది. సంథాల్ ప్రాంగణాల్లో పెద్దసంఖ్యలో అక్రమ చొరబాటుదారులు స్థిరపడ్డారంటూ జార్ఖండ్ హైకోర్టులో ఒక పిల్ దాఖలు కావడం, దానిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుతూండటం ఎన్నికల్లో బిజెపి వాడుకుంటోంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఓ ఐదుసీట్లు ఎక్కువ తెచ్చుకున్న జెఎంఎం, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతీ చిన్న ఎన్నికనూ తీవ్రంగా తీసుకొనే బీజేపీ ఈ మారు జార్ఖండ్ను స్వాధీనం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోలో, తాను అధికారంలోకి రాగానే 2.87 లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతోపాటు, మహిళలకు వివిధ పథకాల ద్వారా దండిగానే ఆర్థిక సాయం ప్రకటించింది. పదేళ్ళక్రితం బీజేపీ ఆదివాసీయేతరులను, ప్రధానంగా ఓబీసీలను దగ్గరకు చేర్చుకొని జార్ఖండ్లో అధికారంలోకి రాగలిగింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా ఉదృతంగా ఉన్నందువల్ల కూడా  ఆ ఎత్తుగడ సులువుగా పనిచేసింది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే బిజెపి పాలన ఎలావుందో గత పదేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం కర్ణాటక, తెలంగాణలో ఇష్టారీతిన ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు, ప్రకటించిన పథకాలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేకపోతున్న తీరును ప్రజలు చూస్తున్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు ముందు ఈ రకమైన హామీలు గుప్పించినా ప్రజలు ఇరుపార్టీలను నమ్మేంతగా పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఏదోరకంగా ఆయా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. చాంతాడంత లిస్టుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరవాత హామీలు అమలు చేయలేక చతికిలపడడం అలవాటు చేసుకున్నారు. ఐదేళ్ల తరవాత మళ్లీ కొత్తగా హామీలు ఇవ్వడానికి వెనకాడడంలేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు అమలుచేయలేని అసహాయతను బయటపెడుతున్నారు. దున్నపోతు మీద వాన పడినట్టు పట్టించుకోనట్టు నటించడం కూడా అలవాటు చేసుకున్నారు. మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించడం మాత్రం మానడంలేదు. బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్కు భిన్నంగా ఏమీ లేదు. ఉచితాల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది. ప్రతీ మహిళకు రూ.2,100 ఇస్తామని ఝార్ఖండ్లో చెప్పిన బీజేపీ, నిరుద్యోగభృతి కూడా ఇస్తామని చెప్పింది. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై బీజేపీ ఆధారపడ్డట్టు కన్పించింది. ముఖ్యమంత్రి లడ్కీ బచావ్ పేరుతో మహిళలకు ప్రతీ నెల రూ.1500 హామీ ఇచ్చి, ఇప్పటికే పాక్షికంగా అమలుచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ హామీ మామూలే. ఉచితాలు, హామీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటములు కూడా తక్కువేం తినలేదు. ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక అనుభవాలతో కాంగ్రెస్ హామీలకన్నా, అధికారమే మిన్న అన్న ధోరణిలో సాగుతోంది. గత హామీల అమలుకు దిక్కు లేకున్నా, కొత్త హా మీలు, పథకాలు ప్రకటిస్తే ప్రజలు ఓట్లేస్తారులే అన్న ధీమాలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నట్లుగా కనపడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్లకు ఏ విషయంలో విభేదాలున్నా ప్రజలకిచ్చే హామీల విషయంలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలి ఒక్కటే అన్నట్టుగా ఉన్నది. ప్రజల నిజమైన అవసరాలపై వాటికి పట్టింపులేదు. ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలనే బాధ్యత లేదు. అధికారమే పరమావధి అన్నట్టుగా వీరి కార్యాచరణ ఉంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యం కావాలి. మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. అలాగే ఉచిత హామీలను తిరస్కరించాలి. అప్పుడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని గుర్తించాలి.

Comments

-Advertisement-