AP DSC: మెగా డీఎస్సీ వాయిదా.. కారణం ఎస్సీ వర్గీకరణేనా!!
AP DSC: మెగా డీఎస్సీ వాయిదా.. కారణం ఎస్సీ వర్గీకరణేనా!!
• ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా...
• షెడ్యూల్ ప్రకారం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్...
• కొన్ని అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటన వాయిదా...
• రెండు రోజుల కిందటే ఏపీలో టెట్ ఫలితాలు వెల్లడించారు...
AP DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటనను వాయిదా వేశారు. రెండు రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాలను వెల్లడించారు. దీంతో వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేశారు. రెండు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
కారణం ఎస్సీ వర్గీకరణేనా..
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే కారణమని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్లతో ఎస్సీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపిస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. అయితే డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడం, దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది??
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు,, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కాగా, డీఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో అనేక విడతల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యా శాఖ యోచిస్తోంది.