2025లో జనగణన దిశగా కేంద్ర ప్రభుత్వం
2025లో జనగణన దిశగా కేంద్ర ప్రభుత్వం
• తొలి జనగణన ఎప్పుడు జరిగింది..
• కులగణన సాధ్యమేనా..
• దక్షిణాది రాష్ట్రాల ఆందోళన..
• రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ ఏం చెబుతోంది..
2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 కల్లా ఇది ముగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈసారి పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ గా జరగనుంది. దీని ఆధారంగానే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది.
తొలి జనగణన ఎప్పుడు జరిగింది:
భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్యానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా మహమ్మారి కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్ లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన ఇక పై 2025-35, 2035-45 ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యుటేషన్ నన్ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.
కులగణన సాధ్యమేనా..?
2025లో చేపట్టే జనగణనతో పాటు కులగణన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మండల కమిషన్‌తో సహా రాష్ట్రస్థాయి 265 బీసీ కమిషన్స్ సైతం కులగణనపై సిఫారసు చేశాయి. సుప్రీంకోర్టుతో పాటు దాదాపు 20 రాష్ట్రాల హైకోర్టులు కూడా కులగణన చేపట్టాలని తీర్పు చెప్పాయి.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన:
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా లెక్కల విషయంలో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. జనాభా నియంత్రణ ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్వ్యవస్థీకరణ జరిగితే తమ లోకసభ స్థానాలు బాగా తగ్గే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది. ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆందోళన చెందుతున్నాయి.
రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ ఏం చెబుతోంది..?
1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తోంది. ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్నవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ ప్రక్రియను మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2011 డేటా ప్రకారం, దేశం మొత్తం జనాభా 121 కోట్లు. లింగ నిష్పత్తి 1,000 పురుషులకు 940 స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 74.04 శాతం. 2001 నుండి 2011 వరకు జనాభా పెరుగుదల 17.64 శాతం ఉంది. జనాభాలో మొత్తం 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంటే, 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే, 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం, 2019లో జమ్ముకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, 2020 లో దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ దాదాపు 20 కోట్ల జనాభాతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిస్తే, 64,429 జనాభాతో అతి తక్కువ జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ నిలిచింది.