Road Accident: లారీని ఢీకొన్న కారు.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Road Accident: లారీని ఢీకొన్న కారు.. ప్రమాదంలో ఆరుగురు మృతి
లారీ కిందికి దూసుకెళ్లి నుజ్జునుజ్జయిన కారు
తాడిపత్రిలో ఇస్కాన్ నగర సంకీర్తన నుంచి తిరిగొస్తుండగా ఘటన
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు అనంతపురం ఇస్కాన్ ప్రార్థన మందిరం భక్తులుగా గుర్తించారు. వారు తాడిపత్రి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, వాహనాల రద్దీని క్లియర్ చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రమాదానికి కారణాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రమాద స్థలంలో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు, జెేసీబీ వాహనం సహాయంతో బయటకు తీశారు. మృతులు సంతోష్, షణ్ముఖ, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.