Ration Cards: ఆ రేషన్ కార్డులకు స్వస్తి..కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డుల మంజూరు
Ration Cards: ఆ రేషన్ కార్డులకు స్వస్తి..కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డుల మంజూరు
• రాష్ట్రంలో మార్చనున్న రేషన్ కార్డుల ముఖచిత్రం..
• ప్రభుత్వ ఆమోదం కోసం డిజైన్లను పంపిన అధికారులు..
• మరోవైపు జగన్ బొమ్మలు పార్టీ రంగు తొలగింపు..
• ఏపీ ప్రభుత్వ అధికార చిహ్నంతో రానున్న కార్డులు..
• కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన కార్డులపైనే రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ రేషన్‌కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది.
వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు..
ఓవైపు కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు’ నినాదంతో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు కొత్త రేషన్‌కార్డుల కోసం పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు.
కొత్త జంటలుకు కొత్త కార్డులు..
గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించి అర్హులైనవారికి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కొత్త కార్డుల జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.